🐂🐂🐂🐂🐂🐂🐂🐂
మనం సాధారణంగా నంది విగ్రహాన్ని శివుని గర్భాలయంలో శివలింగానికి ఎదురుగా వుండడం చూస్తూ వుంటాం కదా..
నిజానికి నంది శివుని రాకకోసం లేదా అతని మాటకోసం ఎదురుచూస్తూ ఎదురుగా లేడు. అతడు కేవలం ఎదురు చూస్తూన్నాడంతే.
నంది నిరీక్షణకు చిహ్నం. మన భారత ధర్మంలో నిరీక్షణ అనేది అత్యుత్తమ ధర్మాలలో ఒకటిగా భావింపబడుతున్నది.
నంది దేనికోసమో ఆశించి ఎదురు చూడటం లేదు. అతనిది ఏ కోరికా లేని ఎదురుచూపు.
నిజాయితీ, దక్షత వంటి గొప్ప లక్షణాలు కలిగియున్నవాడు నంది. అందుకే అతడు శివునికి అత్యంత సాన్నిహిత్యుడయ్యాడు. నందిలో వున్న గొప్ప స్వీకార తత్వమది.
మనమంతా ఆలయానికి వెళ్లాక నందిలా వుండాలి. అనగా ఎటువంటి కోరికా లేని స్థితిలో కేవలం ఆ పరమాత్మకై నిరీక్షణ అనే తపనలో తదేకంగా వుండగలగాలి. దానికి స్థిర తత్వాన్ని ఆపాదించాలి.
నిజానికి వృషభుడు మనకు అదే చెబుతున్నాడు. మీరు కంగారుగా ఇక్కడ కూడా కదలాడకండి. ఇది ఆ పరమాత్మ స్ధావరం. ప్రశాంత చిత్తంతో నాలా కూర్చోండి. అన్నీ అదిగో ఎదురుగా వున్న ఆ భోలా శంకరుడు చూసుకుంటాడు అని.
ముందు మనం ఎటువంటి కంగారు లేదా కలుషిత ఆలోచనలకు లోనుకాకుండా వుండాలని అతడు మనకు చెబుతున్నాడు.
సాధారణంగా ప్రార్ధన కంటే ధ్యానం ఉత్కృష్టమైనది. ఎందుకంటే మనం దేవునితో మాట్లాడటానికి ప్రయత్నించే మార్గం ప్రార్ధన. కాని ధ్యానం ద్వారా భగవంతుడే మనతో మాట్లాడుతాడు.
నందీశ్వరుడు మనకదే చెబుతున్నాడు.
ముందు వినడానికి ఆసక్తి కనబరచండి. దానికి తగ్గ ఓర్పును సమకూర్చుకోండి. అలాగే నిరీక్షణలోనే మోక్షసాధన వుందని గమనించండి.
అయితే ఇక్కడ నంది కూర్చొనే విధానం కేవలం కూర్చోవడం కాదు. అతను చాలా చురుకైన భంగిమలో కూర్చుని వున్నాడు. అవసరమైతే అతడు లేచి నిలబడతాడు. ముష్కరులను పడగొడతాడు. అంతేకాని అందులో నిద్రగాని సుఖం గాని లేవు. కేవలం అప్రమత్తతతో కూడిన నిరీక్షణ మాత్రమే..
శివుని నంది వాహనం ఎన్ని విషయాలు మనకు నిగూడంగా చెబుతున్నదో చూశారా..!
నిజానికి పరికించి చూడాలే గాని భారతీయ ఆధ్యాత్మిక శక్తిలో అంతః విశేషాలు అనంతం. అర్ధం చేసుకుంటే పరమానం దదాయకం.