*శ్రీదేవీభాగవతము - 35*

P Madhav Kumar

*తృతీయ స్కంధము - 14*

                       ✍️ ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 35*


*కంఠాధఃకటిపర్యంత మధ్యకూటస్వరూపిణీ!*

*శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 


*సుదర్శన-రాజపుత్ర సంవాదము* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*

ఈ రోజు  తృతీయ స్కంధములోని

*శశికళా మాతాపితృ సంవాదము*

*శశికళాసుదర్శనుల వివాహము*

 చదువుకుందాం......

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


*నిన్నటి భాగములో...*


యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. పొంగివస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అభ్యర్థించాడు. యుద్ధం తప్పేటట్టు లేదు. వా ప్రాణాలకే ముప్పు వచ్చేట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ని, గండం గట్టెక్కించు అన్నాడు.


🌈 *శశికళా - మాతాపితృ సంవాదం* 🌈


💫 ఆమె కంగారుపడుతూ శశికళ దగ్గరకు వెళ్ళింది. పరిస్థితి వివరించింది. తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది. నీకోసం యుద్ధం జరగడం మన కుటుంబానికి మన దేశానికి క్షేమం కాదు అంది. దయచేసి నుదర్శనుణ్ణి మరిచిపో. మరొక రాకుమారుణ్ణి ఎవరినైనా సరే వరించు. నీ ఇష్టం. కాదని మొండికేసి సుదర్శనుణ్ణే వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతణ్ణి సంహరిస్తాడు. అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు. అందుచేత అతణ్ణి వదిలేయ్. మరోకరిని వరించు. నామాట విను. నీ సుఖమూ మా సుఖమూ కోరి చెబుతున్నాను. మా తాపత్రయమంతా నీ సుఖం కోసమేకదా! ఒక్కగానొక్క కూతురివి. అల్లారుముద్దుగా పెంచుకున్నాం. గారాబంగా చూసుకున్నాం. నీ సుఖం కన్నా మేము కోరుకోవలసింది లేదు. ఆలోచించు. అన్నివేళలా హఠం పనికిరాదు. మనసు మార్చుకో. నువ్వు సుఖపడు. మమ్మల్ని సుఖ పెట్టు.


తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు. ప్రేమగా లాలనగా లాభనష్టాలు స్పష్టంగా బేరీజు వేసి వివరించాడు. శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది. దృఢనిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది.


*తండ్రీ!* ఇవన్నీ నేనూ ఆలోచించాను. కానీ వీటి అన్నిటికన్నా నా వ్రతం, నా దీక్ష నాకు ముఖ్యం. ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు. యుధాజిత్తు బెదిరింపులకు కంగారుపడుతున్నావు. అంతే తప్ప సుదర్శనుడు అయోగ్యుడని కాదు. ఆమేరకు సంతోషం. నా నిర్ణయంలో మార్పులేదు. ఉండబోదు. సుదర్శనుణ్ణి తప్ప మరెవ్వరినీ వరించను. నీకు అంతగా భయమైతే సుదర్శనుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు. బహిష్కారం విధించు. అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుంచి నిర్గమిస్తాడు. తరవాత ఏం జరగాలో అది జరుగుతుంది. మీరేమీ చింతించకండి. మా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది.


*అమ్మా!* నీ పట్టుదల నీదేనా. మా మాట వినవా? కన్న తల్లిదండ్రులం ఇంతగా బతిమాలుతోంటే ఏమిటమ్మా ఈ మొండిపట్టు. మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. సాహసం అన్నివేళలా పనికిరాదు. ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం యుద్ధానికి దిగడం ఎంతటి వాడికైనా క్షేమం కాదు. అదీకాక - సుదర్శనుడి చేతిలో పెట్టి నీమానాన నిన్ను ఎలా వదిలిపెట్టను? వివాహం చెయ్యొద్దూ! కన్నతల్లిదండ్రులు ఎవరైనా అలా వదలి పెట్టగలరా? ఇంతమందీ ఒక్కసారిగా చుట్టముడితే మీరు ఏమైపోతారు? ఆలోచించావా? చిన్నపిల్లవు. సాహసం తప్ప మరింకేమీ కనిపించడం లేదు. పోనీలే, మరొక పని చేద్దాం. మధ్యే మార్గం చెబుతున్నాను. కనీసం దీనికైనా అంగీకరించు. దీన్ని *పణస్వయంవరంగా* ప్రకటిస్తాను. అలనాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు. శివధనుస్సును ఎక్కు పెట్టి రాముడు వరించినట్టుగా, నిన్ను సుదర్శనుడు వరించనీ, అతడు అశక్తుడైతే మరొకడు గెలుచుకుంటాడు. గెలుచుకోనీ. అప్పుడు ఎవరికీ ఏ వివాదమూ ఉండదు. అందరూ అంగీకరిస్తారు. నీ వివాహం సుఖంగా జరిపిస్తాను. ఇందులో అధర్మం ఏమీ లేదు. అన్యాయం అంతకన్నా లేదు. కనీసం దీనికైనా ఒప్పుకో తల్లీ!


*తండ్రీ!* వినడానికి నీ ఆలోచన బాగానే ఉంది. కానీ సందేహాలకూ సంశయాలకూ నేను తావు ఇవ్వను. సుదర్శనుడు నా మనస్సులో స్థిరపడ్డాడు. మరొకణ్ణి వరించడం అసంభవం. అది మహాపాపం. పుణ్యపాపాలకు ఆదికారణం మనస్సే కదా! కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్యపాప చింతనలు మనస్సులో రేకెత్తితే చాలు వాటి ఫలితం వాటికి ఉంటుంది. నన్ను పణంగా (పందెపుధనం) నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమారులందరికీ నేను వశమైనట్టేకదా! ఒకడే గెలిస్తే సరే, ఇద్దరో ముగ్గురో గెలిచారనుకుందాం. అప్పుడేమవుతుంది. మరొక కొత్త వివాదం చెలరేగదా! అదీకాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు.  నువ్వు ఇంకేమీ ఆలోచించకు. దిగులు పడకు. నన్ను సుదర్శనుడికి సమర్పించు. వివాహం జరిపించు. మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది. ఆ జగన్మాత నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు దుఃఖసముద్రాలు ఇంకిపోతాయి. పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో. నా అభ్యర్ధనను నెరవేర్చు. ఇందాకటిలాగానే రాజులందరికీ నమస్కరించి, స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు.


అందరినీ విడుదులకు పంపించెయ్యి. ఈ రాత్రికి వేదమంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు. నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు. ద్రువసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెడతాడు. ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టూ, వాళ్ళు బెదిరిస్తున్నట్టూ యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది. సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జరగకూడనిదే జరిగితే నేనూ నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను. మరేమీ బెంగలేదు. నన్ను సుదర్శనుడికి ఇచ్చి నువ్వు సేనాసమేతుడవై రాజధానిలోనే నిలిచిపో. నేను ఒక్కతెనూ అతడితో వెడతాను. యుద్ధమేమయినా జరిగితే అతడే చూసుకుంటాడు. నీకూ నీ రాజధానికీ హాని ఉండదు.


ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుబాహుడిలోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది. విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టే చెయ్యడానికి నిశ్చయించుకున్నాడు.


*(అధ్యాయం - 21. శ్లోకాలు -60)*


త్వరత్వరగా స్వయంవర సభా మండపానికి చేరుకున్నాడు. అందరికీ సవినయంగా నమస్క రించాడు. గుసగుసలూ కోలాహలం సద్దుమణిగాయి. గొంతు సవరించుకున్నాడు.


*రాకుమారులారా!* మీరంతా మా ఆతిథ్యాన్ని మరొకపూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి. స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను. ప్రస్తుతం విడుదులలో మీకోసం రకరకాల విందులు ఎదురుచూస్తున్నాయి. వాటిని రవ్వంత రుచిచూడండి. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడే సమావేశం అవుదాం. ఇచ్ఛా స్వయంవరమా, పణ స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను. ఇవ్వేళ మా అమ్మాయి మండపంలోకి రానంటోంది. బహుశా రేపటికి ఒప్పించగలను. ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను. కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా! అలా చెయ్యడం ఏమంత మంచిదికాదని కూడా వా అభిప్రాయం. అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను. సెలవు.


సుబాహుడి ప్రకటనను రాకుమారులందరూ నిజమని నమ్మారు. విడుదులకు వెళ్ళిపోయారు. ఎవరి రక్షణము వారు ఏర్పాటు చేసుకుని విందులూ విలాసాలలో మునిగిపోయారు.


🌈 *శశికళా సుదర్శనుల వివాహం* 🌈


విశ్వాసపాత్రులైన వేదపండితులను రావించి ఆ రాత్రి శశికళా సుదర్శనుల వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం, కుండల ద్వయం, రెండువందల మదపుటేనుగులు, మాంఛి గుర్రాలు పూన్చిన రెండువందల రథాలు, రెండువందల ధనుస్సులు, బాణాలు నిండిన తూణీరాలూ, రెండు గోవులూ పారిబర్హంగా బహూకరించాడు. కోడల్ని చూసి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికినంతగా సంబరపడింది. సుబాహుడి భార్య సాలంకృతలైన దాసీజనాన్ని వెయ్యిమందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది. నూరు ఆడ ఏనుగులను ఇచ్చింది. రత్నాభరణాలూ దివ్యవస్త్రాలూ లెక్కలేదు. సింధుదేశోద్భవాలైన ఉత్తమజాతి అశ్వాలను రెండువేలు బహూకరించి, ధాన్యమూ ఉప్పులూ పప్పులూ వంటపాత్రలతో నిండిన రెండువందల శకటాలను సమర్పించారు. మిగతా బహుమతులను మోసుకువెళ్ళడానికి మూడువందల ఒంటెలను (క్రమేళకములు) సిద్ధపరిచారు.


అంతా అయ్యాక సుబాహుడు మనోరమాదేవికి కొంచెం దగ్గరగా వెళ్ళి వినయంగా నమస్కరించాడు.


ఉత్తమక్షత్రియ కులసంజాతా! నేను నీ దాసుణ్ణి. మనోగతం ఏదయినా ఉంటే తెలియజెయ్యి. నెరవేరుస్తాను అన్నాడు. మనోరమ కళ్ళల్లో ఆనందబాష్పాలు. పట్టరాని సంతోషంతో పరవశించిపోతోంది. ఒకవైపు ఆనందం, మరోవైపు కృతజ్ఞత. అభినందన పురస్సరంగా పలికింది.


*మహారాజా!* నీకూ నీవంశానికీ శుభమగుగాక. సకల సమృద్ధులు సమకూరుగాక. మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు. చాలు. అంతకుమించిన సమ్మానం నాకు మరొకటి ఉండదు. ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందడం లేదు. నేను వంది పుత్రికనూ కాను, మాగధ పుత్రికనూ కానాయె. అయినా నావాళ్ళని నేను పొగడటమేమిటి? మీ సంబంధంవల్ల ఇవేళ మా అబ్బాయి సుమేరు సదృశుడయ్యాడు.


రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర మీ పవిత్రత ఎంతటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. తండ్రిని కోల్పోయి, రాజ్యం కోల్పోయి, నిర్ధనుడై, కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరివాడికి ఇంతమంది రాకుమారులను కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్యవిషయమా! సమస్థాయిని చూసుకుంటారేగానీ ఇలాగ గుణవతి రూపవతి అయిన కన్యను ఎవ్వరూ మా అబ్బాయిలాంటి వాడికి ఇవ్వరు. మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అభినందిస్తున్నాను.


మనోరమాదేవి మాటలకు సుబాహుడు ఎంతో సంతృప్తి చెందాడు. మళ్ళీ నమస్కరించాడు. సవినయంగా ఒక ప్రతిపాదన చేశాడు. 


*రాజపుత్రీ!* మీరు మరోలా అనుకోకపోతే - నాదొక మనవి. ఈ కాశీరాజ్యాన్ని మీరు స్వీకరించండి. నేను సేనాపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి. వారణాసిని విడిచి పెట్టి మీరు ఆశ్రమంలోనో మరో నగరంలోనో ఉండటం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు. ఇప్పుడన్నా రాజభోగాలు తిరిగి అనుభవించండి. ఇంక ఈ రాకుమారులంటారా, వారి సంగతి నేను చూసుకుంటాను. రెండే రెండుదారులు కనపడుతున్నాయి. స్వయంగా వెళ్ళి జరిగిన విషయం సవినయంగా మనవి చేస్తాను.


సమ్మతించి వెళ్ళిపోయారో సరేసరి. కాదని కాలుదువ్వితే యుద్ధం చేస్తాను. తప్పదు గదా మరి.


జయాపజయాలు దైవాధీనాలు. నేను చేసింది ధర్మమనుకుంటారో, అధర్మం అనుకుంటారో వారి ఇష్టం. వారి ఆలోచనలు ఎటు సాగుతాయో! కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. చూద్దాం. ఏమి జరుగుతుందో.


ఈ మాటలకు మనోరమాదేవి మరింత ప్రసన్నురాలు అయ్యింది. ధైర్యం చెప్పింది. మహారాజా! అధైర్యపడకు. జగదంబికను ధ్యానించు. ఆదిపరాశక్తి భక్తులకు అపజయం ఉండదు. నీకూ నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు. అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్యా సింహాసనం అధిష్టిస్తాడు. రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో. ఆశ్రమవాసం మాకిక ఆట్టేకాలం ఉండదు. మారాజ్యం మాకు దక్కుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తాం. పరమాంబికను ధ్యానిస్తున్నాను. ఏ చింతా లేదు. మాకు సెలవియ్యి. మరి మేము బయలుదేరతాం - అంది.


అంతలోకీ తెల్లవారింది. ఎంత గుట్టుగా జరిపివా శశికళా సుదర్శమల వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది. అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీనగర ముఖద్వారం దాటి వెలుపల మకాం వేశారు. సుబాహుడు చేసినది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్ళిపోగా మిగిలినవారు అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామా అని చర్చించుకుంటున్నారు. సుబాహుణ్ణి సుదర్శనుణ్ణి సంహరించి శశికళను అపహరించుకుపోదామనే దురాలోచనల్లో ఉన్నారు. 


రాజధానిలో మంగళ తూర్యారావాలు మృదంగ ధ్వనులూ సన్నాయి మోతలూ మిన్నుముట్టాయి. యుధాజిత్ శత్రుజిత్ ప్రభృతులకు క్రోధం తారస్థాయికి చేరుకుంది.


సుబాహుడు సుహృజ్జనులతో కలిసి వీరి దగ్గరికి వచ్చాడు. రాజులు ముఖాలు బిగించుకుని మౌనంగా నిలబడ్డారు. అందరికీ నమస్కరించి సుబాహుడు -


*క్షత్రియవంశ్యులారా!* *సహృదయులారా!* *దయామయులారా!* నగరంలోకి దయచెయ్యండి. హితమో అహితమో తెలీదుగానీ మా అమ్మాయి సుదర్శనుణ్ణి వివాహమాడింది. కోపించకండి. ఉపశమించండి. ఇచ్ఛా స్వయంవరం కదా! సుదర్శనుణ్ణి వరించాను, మరెవ్వరినీ వరించను అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మంకదా! జరిపించాను. మీరంతా వచ్చి పెళ్ళి భోజనం చేసి వెళ్ళండి - అన్నాడు. సుబాహు !


చాలా గొప్ప పనిచేశావు. సంతోషం. ఇక నువ్వు దయచెయ్యొచ్చు. చెయ్యవలసిన పెళ్ళిపనులు ఇంకా చాలా ఉండి ఉంటాయి. చూసుకో. వెళ్ళు. మా నగరాలకు మేం పోతాం - అన్నారు ఆ రాకుమారులు. వీళ్ళ పన్నాగం ఏమిటో ఏమి చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు.


యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుక్కుని సేనాసమేతులైన రాకుమారులు శశికళా సుదర్శనులు భరద్వాజాశ్రమానికి తిరిగివెళ్ళే దారిలో కాపలా వేశారు. సుదర్శనుణ్ణీ మనోరమనూ చంపాలి, శశికళను అపహరించాలి - ఇదీ వీరి లక్ష్యం. లేకపోతే వీడి కూతురి పెళ్ళి చూసి వెళ్ళడానికని వచ్చామా, అలా వెడితే మన పరువేమి కానూ, సొంత రాజ్యంలో ఇక తల ఎత్తుకోగలమా - ఇవే వారి ఆలోచనలు.


*(అధ్యాయం - 22 శ్లోకాలు-48)* 


ఆ ముచ్చటా ఈ ముచ్చటా పేరు చెప్పి ఆరు రోజులపాటు శశికళా సుదర్శనులను రాజధానిలోనే (కాశి) ఉంచేశాడు సుబాహుడు. అప్పటికి చారుల ద్వారా యుధాజిత్ర్పభృతుల పన్నుగడ తెలిసింది. చతురంగ బలాలను తోడు ఇచ్చి శశికళా సుదర్శనులనూ మనోరమాదేవినీ సాగనంపాడు. వెనకగా తానూ మరింత సైన్యంతో కదిలాడు.


*(రేపు సుదర్శన - యుధాజిత్తుల యుధ్ధం)*


*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*


               *...శ్రీదేవీ భాగవతము... సశేషం...*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది 

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat