*తృతీయ స్కంధము - 16*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 37*
*కులాంగనా కులాంతస్థా కౌళినీ కులయోగినీ!*
*అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*సుదర్శన - యుధాజిత్తుల యుద్ధం*
*సుబాహు, సుదర్శన కృత దేవీస్తుతి*
*సుదర్శనుడు చెప్పిన దేవీ మహిమ* చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు తృతీయ స్కంధములోని
*సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం*
*కాశీ-అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాలు*
*దేవీనవరాత్రాలు*
*కుమారీపూజ*
చదువుకుందాం......
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *సుదర్శనుడు లీలావతిని ఓదార్చడం* 🌈
సరాసరి అంతఃపురంలోకి వెళ్ళి పినతల్లి లీలావతీదేవిని సందర్శించి నమస్కరించాడు. పుత్రుడు శత్రుజిత్తు మరణంతో శోకసాగరంలో మునిగిపోయింది. కంటికీ మంటికీ ఏకధారగా విలపిస్తోంది. ఎలా ఓదార్చాలో తోచక క్షణకాలం తటపటాయించాడు.
*తల్లీ!* నీ పుత్రుణ్ణి నేను చంపలేదు. మీ తండ్రిగారినీ నేను చంపలేదు. ఒట్టు. నీ పాదాల సాక్షిగా నిజం చెబుతున్నాను. దుర్గాదేవి చేతిలో ముక్తి పొందారు. ఇందులో నా అపరాధం ఏమీలేదు. నన్ను నమ్ము. అవశ్యంగా జరగవలసినవి కొన్ని అలా జరుగుతాయి. మన చేతుల్లో ఏమీలేదు. ప్రతీకార భావన అనేదే లేదు. జీవుడు కర్మానుసారంగా సుఖదుఃఖాలను అనుభవిస్తాడు. ఎవరుగానీ దుఃఖించవలసినది ఏమీ లేదు. నాకు నువ్వొకటి మా అమ్మ ఒకటి కాదు. ఇద్దరూ సమానమే. భేదభావం రవ్వంతయినా నా మనస్సులో లేదు. ఉండదు. నన్ను నమ్ము. చేసిన కర్మ శుభమో అశుభమో దాని ఫలితం అనుభవించక తప్పదు. సుఖాలకు పొంగిపోకూడదు, దుఃఖాలకు కుంగిపోకూడదు. అంతా దైవాధీనం. మన అధీనంలో ఏమీ లేదు. ఇది తెలుసుకున్న మనిషి ఎవరూ తనను తాను హింసించుకోడు. చెక్క బొమ్మ - ఆడించినట్టుగా ఎలా ఆడుతుందో అలాగే జీవుడూ చేసుకున్న కర్మనుబట్టి ఆడుతూ ఉంటాడు.
నేను అడవుల పాలయ్యాను. కానీ దు:ఖించలేదు. ఇది ఏదో కర్మఫలం అనుకున్నాను, అనుభవించాను. నా మాతామహుడు ఇక్కడే దుర్మరణం చెందాడు. నా తల్లి ఏకాకి అయ్యింది. పసిబిడ్డను నన్ను తీసుకుని దుర్గమారణ్యాలకు భయార్తయై పారిపోయింది. దారిలో దొంగలు దోచుకున్నారు. కట్టుబట్టలతో మిగిలింది. అన్నం మెతుకైనా లేదు. చంకలో పసిబిడ్డ. ఎలాగో భరద్వాజాశ్రమానికి చేరుకుంది. విదల్లుడూ దాదీ మాత్రం విడిచి పెట్టలేక మా అమ్మ వెంట వచ్చారు. ఆశ్రమంలో మునులూ మునిపత్నులూ దయామయులు కనక మా ఆలనా పాలనా చూశారు. కందమూల ఫలాలతో కాలక్షేపం చేశాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అప్పుడుకూడా ఏనాడూ నేను దుఃఖపడలేదు. ఇదిగో ఇప్పుడు రాజ్యం దక్కింది, భోగాలు వచ్చాయని నేను పొంగిపోవడం లేదు. నా హృదయంలో ఎవరిపట్లా వైరం లేదు. మాత్సర్యం లేదు. నన్నడిగితే ఈ రాజభోగాలకన్నా నీవారభక్షణమే (ఆశ్రమాలలో మునులు నివ్వరిధాన్యం పరిగ ఏరి తెచ్చుకుని దంచుకుని గుప్పెడేసి వండుకొని తింటారు) ఉత్తమోత్తమం. రాజభోగాలను అనుభవించినవాడు నరకానికి పోతాడు. నివ్వరిధాన్యం తిన్నవాడు స్వర్గానికి వెడతాడు.
*పిన్నీ!* మానవుడెప్పుడు తెలిసి ధర్మం ఆచరించాలి. ఇంద్రియాలను జయించాలి. లేకపోతే నరకం తప్పదు. మానవజన్మదుర్లభం. అది పరమ పవిత్రమైన భరతఖండంలో లభించడం మరీ దుర్లభం అటువంటి జన్మను పొందినందుకు ధర్మసాధన చెయ్యాలి. స్వర్గ మోక్షదమైన ఈ ధర్మసాధన మిగతా పశుపక్ష్యాది జాతులలో జన్మిస్తే కుదరదుగదా! అనుక్షణం మనం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
వయస్సులో చిన్నవాడైనా జ్ఞానంలో పెద్దవాడై సుదర్శనుడు చేసిన ఈ ధర్మ ప్రబోధంతో లీలావతి తేరుకుంది. పుత్రశోకాన్ని క్షణంలో వదిలేసింది.
జరిగిన సంఘటనలను తలచుకొని సిగ్గుపడుతూ బదులు పలికింది.
*నాయనా!* మా తండ్రి చేసిన దుర్మార్గం వల్ల నేను అపరాధిని అయ్యాను. మీ తాతగారిని చంపడం, న్యాయంగా నీకు దక్కవలసిన రాజ్యాన్ని అపహరించి నా కొడుకుకు కట్టబెట్టడం - ఇవి క్షమించరాని నేరాలు. నిజంగా నేను సిగ్గు పడుతున్నాను. అప్పుడు నా తండ్రిని గానీ, నా కొడుకును గానీ వారించలేకపోయాను. నా కొడుకు చేసినది ఏమీ లేదు. తప్పు అంతా మా తండ్రిదే. అయితే తాతగారి చెప్పుచేతలలో ఉండిపోవడం, జరిగిన తప్పును ఖండించి సరిదిద్దకపోవడం - ఇవి నా కొడుకు చేసిన అపరాధాలు. సరే, వారి వారి కర్మలను బట్టి ఇద్దరూ గతించారు. వారికోసం నేను దుఃఖించను గానీ వారు చేసిన అపరాధాలకు మాత్రం బాధ పడుతున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా పుత్రుడివి. నీ పట్ల నాకు క్రోధం లేదు. ఈర్ష్య లేదు. శోకం లేదు. హాయిగా రాజ్యపాలన సాగించు. ప్రజలను సుఖ పెట్టు. దేవి అనుగ్రహంవల్ల అకంటకంగా నీ సామ్రాజ్యం నీకు లభించింది. ధర్మబద్ధంగా పరిపాలించు. మేమంతా చూసి సంతోషిస్తాం. ఆనందిస్తాం. ఆశీర్వదిస్తాం.
꧁┉┅━❀🔯❀━┅┉꧂
🌈 *కాశీ అయోధ్యలలో దేవీ మందిర నిర్మాణాలు* 🌈
సుదర్శనుడు పినతల్లికి మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. కన్నతల్లి మందిరానికి వెళ్లారు. మంత్రి పురోహితులను ఆహ్వానించాడు. మంచిరోజు చూపి చెప్పమన్నాడు. ఒక బంగారు సింహాసనం తయారు చేయించమన్నాడు. అందులో జగదీశ్వరిని వైష్ణవీదేవిని ప్రతిష్ఠించి అటు పైని రాచకార్యాలు చేపడతానన్నాడు. రామాదులలాగా పరిపాలన సాగిస్తానన్నాడు. మన రాజ్యంలో అందరూ జగన్మాతను పూజించాలి. ఊరూరా ఇంటింటా తగిన వసతులు కల్పించండి. ఇది రాజశాసనం - అన్నాడు. మంత్రులను వీడ్కొలిపాడు.
రాజప్రాసాదంలో శరవేగంతో ఆలయ నిర్మాణం జరిగింది. బంగారు సింహాసనం సిద్ధమయ్యింది. ఒక శుభముహూర్తాన దైవజ్ఞులైన వేదపండితులు దేవీ ప్రతిష్ఠ జరిపారు. హోమాలూ పూజలూ జపాలూ భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో యథాశాస్త్రంగా జరిపాడు సుదర్శనుడు. ఆరోజు రాజ్యమంతటా మహోత్సవం జరిగింది. వేదమంత్ర ధ్వనులు, మంగళవాద్యఘోషలు సంగీతనాట్యాల రవళులు మారుమ్రోగాయి. కోసలదేశంలో అంబికాదేవి ఆనాటినుంచీ అందరికీ ఇలువేల్పు అయ్యింది.
సుదర్శనుడు ధర్మబద్ధంగా పాలన సాగిస్తున్నాడు. దిలీపుడిలా, రఘుమహారాజులా, శ్రీరామ చంద్రుడిలా పాలిస్తున్నాడు. ప్రజలకు సుఖాలూ మర్యాదలూ యథావిధిగా దక్కుతున్నాయి. ఎవరికీ అధర్మచింతనలు ఊహకైనా రావడం లేదు. గ్రామగ్రామానా దేవీ ఆలయాలు విలసిల్లాయి. నిత్యపూజలు జరుగుతున్నాయి.
కాశీలో సుబాహుడు కూడా ఇలాగే తాను దర్శించిన దేవీ ప్రతిమను చేయించి ప్రాసాదం నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ జరిపాడు. ఊరూరా దుర్గాదేవీ మందిరాలు వెలిశాయి. ప్రజలంతా దేవీ ఉపాసకులు అయ్యారు. సామంతరాజ్యాలలో ఇరుగుపొరుగు దేశాలలో దుర్గాదేవి విఖ్యాతి పొందింది. ఇలా భారతదేశమంతటా దేవి ఆలయాలూ దేవి ఉపాసనలూ వర్ధిల్లాయి. నిత్యపూజలే కాక విశేష సమయాలలో విశేషార్చనలు సాగుతున్నాయి. నవరాత్రులలో అర్చన హవనయాగాదులు ఆగమోక్త ప్రకారంగా భక్తిశ్రద్ధలతో చేస్తున్నారు. అన్ని వర్ణాలవారూ తారతమ్యాలు లేకుండా భాగస్వాములు అవుతున్నారు.
*(అధ్యాయం - 25, శ్లోకాలు- 46)*
*శౌనకాది మహామునులారా!* వింటున్నారు గదా! వ్యాసుడు చెప్పిన ఈ దేవీ మాహాత్మ్యాన్ని జనమేజయుడు శ్రద్ధగా ఆలకించాడు. దేవీ యజ్ఞం చెయ్యడం, దేవీ ఆలయం కట్టించడం, దేవీ మంత్రం జపించడం మొదలైన విశేషాలు అతడి మనస్సులో స్థిరపడ్డాయి. వాటి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆకళింపు చేసుకున్నాడు.
శరత్కాలంలో నవరాత్రోత్సవాలు జరిపించమని దేవి సుదర్శనుణ్ణి ఆజ్ఞాపించింది కదా, అవి ఎలా చెయ్యాలి, చేస్తే ఏ ఫలాలు వస్తాయి అనే విశేషాలు తెలుసుకోవాలనిపించింది. వ్యాసుణ్ణి అడిగాడు. చెబుతాను వినమంటూ ఆ కృష్ణద్వైపాయనుడు ఆరంభించాడు.
꧁┉┅━❀🔯❀━┅┉꧂
🌈 *దేవీ నవరాత్రాలు* 🙏
*జనమేజయా!* ప్రజలకు వసంత ఋతువూ శరదృతువూ చాలా గడ్డుకాలం. అవి రెండూ యమదంష్ట్రలవంటివి. రోగపీడలు వ్యాపించే ఋతువులు. జననాశనమవుతుంది. అందుకని ఆ రెండు ఋతువులలోనూ దేవీ నవరాత్రాలు జరిపితే క్షేమదాయకంగా ఉంటుంది.
చైత్రమాసం ప్రారంభదినాన గానీ ఆశ్వయుజమాసం ప్రారంభదినానగానీ నవరాత్రోత్సవాలను ఆరంభించాలి. ముందటి నెల అమావాస్య నాటికి సంబారాలన్నీ సమకూర్చుకోవాలి. హవిష్యమే అశనంగా (ప్రసాదం మాత్రమే స్వీకరిస్తూ) ఏకభుక్త వ్రతం చేపట్టాలి. (ఒంటిపూట భోజనం). ఎత్తుపల్లాలు లేని సమతలంలో మండపం ఏర్పరచాలి. ఎనిమిది బారల (షోడశహస్త ప్రమాణం) స్తంభధ్వజం స్థాపించాలి. మండపమంతటా ఎర్రమట్టితో కలిపిన పేడతో అలకాలి. దాని మధ్యలో సమకోణభుజంగా నలుచదరపు వేదిక అమర్చాలి, పొడుగు వెడల్పులు సమంగా (బారెడేసి గానీ) చేతిపొడుగున ఉండాలి. ఎత్తుకూడా అంతే. చెయ్యెత్తు ఉండాలి. దానిమీద అలంకృత పీఠం స్థాపించాలి. పందిరి (కాయమానం) వెయ్యాలి. తోరణాలు కట్టాలి. మంత్రతంత్రవేత్తలైన బ్రాహ్మణులనూ వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమినాటి తెల్లవారు జాముననే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి. ఋత్విగ్వరణం చెయ్యాలి. అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలి. నూతనవస్త్రాలు బహూకరించాలి. దేవీ పూజలో పిసివారితనం పనికిరాదు. ఉన్న స్తోమతును దాచుకోకూడదు. అలా అని లేవిబడాయికి పోకూడదు. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. తొమ్మిది మందితోగానీ ఆయిదుగురితో గానీ లేదా ఒక్కరితోగానీ దేవీజపం జరిపించాలి. ఒకరు దేవీ మంత్ర పారాయణ చెయ్యాలి. శాంతస్వభావులు వేదవేత్తలూ అయిన పండితులను ఈ పూజలకు నియోగించాలి. వేదమంత్రాలతో స్వస్తివచనాలతో సింహాసనం వేదికమీద పెట్టి తెల్లని నూతనవస్త్రం ఆస్తరణగా వెయ్యాలి: అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ, ముక్తాహారశోభిత, దివ్యాంబరధారిణి, శంఖచక్రగదా ద్యాయుధవమేత, సింహవాహనాధిష్ఠిత అయిన దేవీ ప్రతిమను ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో ఒప్పారే మూర్తిని ప్రతిష్ఠిస్తారు. నవాక్షరమంత్రార్చన జరగాలి. కలశస్థాపన చెయ్యాలి. అందులో వంచపల్లవాలను ఉంచాలి. మంత్రపరిపూతమైన శుభ్రజలాన్ని నింపాలి. బంగారమూ మణులూ రత్నాలు అందులో వెయ్యాలి. మిగతా పూజాద్రవ్యాలను వేదిక పైని కలశానికి దగ్గరగా అందుబాటులో ఉంచుకోవాలి. బాజా భజంత్రీలు ఉండాలి.
ఇలా ప్రారంభించి తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షతోగానీ, నక్తాలతోగానీ (రాత్రిపూట మాత్రమే భుజించడం) ఏకభుక్తాలతోగానీ (ఏదో ఒకపూట - పగలు భోజనం చెయ్యడం) నిత్యార్చన జరపాలి. ఇలా భక్తిశ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. రోజూ వివిధ పుష్పాలతో అలంకరించాలి. పరిమళద్రవ్యాలను ఉపయోగించాలి. నారికేళకదళీ నారంగాది ఫలాలను నివేదన చెయ్యాలి. ముగింపునాడు షడ్రసోపేతంగా సకల ప్రజానీకానికీ అన్న సంతర్పణ జరపాలి.
*జనమేజయా!* ఇందులో మరొక రహస్యం ఉంది. మాంస భోజనులు కనక ఈ ఉత్సవాలకు కంకణం కట్టుకుంటే అమ్మవారికి మాంసాలను నైవేద్యం పెట్టవచ్చు. ఇందుకోసం జరిగే మహిష-అజవరాహాల హింసను ధర్మశాస్త్రాలు హింసగా పరిగణించవు. జంతుబలి అంటారు. (అజము గొర్రె) దేవతలకోసం జంతువులను బలిచేస్తే అది వాటికి స్వర్గప్రదమవుతుంది.
త్రికోణ కుండాన్నీ త్రికోణ స్థండిలాన్నీ ఏర్పాటు చేసుకొని నిత్యమూ మంత్రపూర్వకంగా హోమాలు చెయ్యాలి. త్రికాలపూజలు జరుపుతూ పరిమళ ద్రవ్యాలతో సుగంధ బంధురపుష్పసమూహాలతో అమ్మవారిని ముంచెత్తాలి. సంగీత సాహిత్య నృత్యాది కళలను అమ్మవారి కైంకర్యానికి వినోదంగా వినియోగించాలి. అలా తమ కళలను సార్థకం చేసుకున్నవారి జన్మలు ధన్యమవుతాయి. తరిస్తారు. దేవీ అనుగ్రహానికి విశేషంగా పాత్రులు అవుతారు.
యజమానుడు ఈ తొమ్మిది రోజులపాటూ కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కటికి నేలమీద మాత్రమే పడుకోవాలి. అనారోగ్యాది కారణాలు ఉంటే తప్ప, లేకపోతే చన్నీటి స్నానమే చెయ్యాలి.
꧁┉┅━❀🔯❀━┅┉꧂
🙏 *కుమారీ పూజ* 🌈
ఇవికాక నిత్యమూ కన్యాపూజ చెయ్యాలి. శక్తిని బట్టి ఒకరినుంచి తొమ్మిదిమంది వరకూ కన్యలను ఆహ్వానించి వస్త్రాలంకారాదులు చేసి విధివిధానంగా మంత్రాలతో పూజించాలి. దీనినే కుమారీపూజ అంటారు.
*రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకూ వయస్సున్నవారే దీనికి కన్యలుగా అర్హులు. ఏడాది పిల్ల పనికిరాదు.*
*రెండేళ్ళపిల్లను కుమారి అంటారు. మూడేళ్ళ అమ్మాయిని త్రిమూర్తి అంటారు. నాలుగేళ్ళ పిల్లను కళ్యాణి అనీ, అయిదేళ్ళ కన్యను రోహిణి అనీ, ఆరేళ్ళ పిల్లను కాళిక అనీ, ఏడేళ్ళ అమ్మాయిని చండిక అనీ, ఎనిమిదేళ్ళ అమ్మాయిని శాంభవి అనీ, తొమ్మిదేళ్ళ కన్యను దుర్గ అనీ, పదేళ్ళ కన్యను సుభద్ర అనీ ఈ కుమారీ పూజలో వ్యవహరిస్తారు.*
పది సంవత్సరాలు దాటిన అమ్మాయి ఈ పూజకు అర్హురాలు కాదు. వీలయితే తొమ్మిది మందినీ ఒకేవయస్సువారిని ఏర్పాటు చేసుకోవచ్చును. వీటికి విశేష ఫలాలు ఉన్నాయి.
కుమారీ పూజవల్ల దారిద్ర్యదుఃఖాదులు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది. శత్రువులను జయిస్తారు. త్రిమూర్తిపూజ త్రివర్గ ఫలాలను ఇస్తుంది. ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది. కల్యాణీపూజ విద్యాభివృద్ధిని కలిగిస్తుంది. రాజ్య లాభం చేకూరుస్తుంది. కాళికాపూజ శత్రునాశకం. చండికా పూజ ఐశ్వర్యప్రదం. శాంభవీ పూజ నృపసమ్మోహకం. అధికారులను లొంగదీసుకోవడానికి ఇది దివ్యౌషధం. దుర్గాపూజ ఉగ్ర పద్ధతిలో అయితే సకలశత్రు వినాశకం, సౌమ్య పద్ధతిలో అయితే స్వర్గసుఖప్రదం. రోహిణీపూజ సకల రోగ నివారకం. దీర్ఘరోగాలు కూడా ఉపశమించి పరిపూర్ణంగా ఆరోగ్యం చేకూరుతుంది. సుభద్రాపూజవల్ల వాంఛితార్థాలు సిద్ధిస్తాయి. వీరిని అమ్మవారికి ప్రతిరూపాలుగా భావించాలి. శ్రీయుక్త నామ మంత్రాలతోగానీ బీజాక్షర సహితమైన నామ మంత్రాలతోగానీ (నామజపం) భక్తి శ్రద్ధలతో ఈ కుమారీపూజ జరపాలి. ఈ తొమ్మిదింటికీ తొమ్మిది ప్రత్యేక స్తోత్రశ్లోకాలను ధారణ చెయ్యాలి.
కన్యకలను నూతన వస్త్రాలతో పుష్పమాలికలతో పరిమళ ద్రవ్యాలతో సువర్ణాభరణాలతో అలంకరించి ఈ మంత్ర శ్లోకాలతో అర్చించాలి.
*(అధ్యాయం - 26, శ్లోకాలు - 62)*
కురూపిణులూ, కులహీనలూ, గాయాలతో కురుపులతో (వణాలు) ఉన్న వాళ్ళూ, రోగ వ్యాధి పీడితలూ, వికలాంగినులూ, అక్రమ సంజాతలూ ఈ పూజకు కన్యలుగా పనికిరారు. రూపవతి ఆరోగ్యవతి ఏకవంశసంజాత ప్రణవర్జిత మాత్రమే అర్హురాలు. బ్రాహ్మణ కన్యలను పూజిస్తే సర్వకార్యార్థ సిద్ధి కలుగుతుంది.
జయార్థులు క్షత్రియకన్యలను పూజించాలి. లాభార్ధులు వైశ్యకన్యలనూ శూద్రకన్యలనూ పూజించాలి. బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలనూ, వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యకన్యలనూ, శూద్రులు నాలుగు వర్ణాల కన్యలనూ అర్చించవచ్చు.
తొమ్మిది రోజులపాటూ దేవీ పూజలు చెయ్యలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు అష్టమిరోజున విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళికా జగన్మాత జన్మించిన రోజు, కోటానుకోట్ల యోగినులతో కలిసి జన్మించి దక్షాధ్వరధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమిపూజ విశేషం. గంధమాల్యాను లేపనాలతో ఫలపుష్పాపహారాలతో, హోమాలతో బ్రాహ్మణ పూజలతో పాయసామిషాది నైవేద్యాలతో (అమిషం = మాంసం) జగదంబికను సంతోషపరచాలి. తొమ్మిది రోజులపాటూ ఉపవాసాలు ఉండలేనివారు మూడు రోజులు ఉపవాసం ఉన్నా సరిపోతుంది. సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులూ అతిముఖ్యాలు. అతి పవిత్రాలు. నిత్యపూజలూ హోమాలూ కుమారీపూజలూ బ్రాహ్మణ భోజనాలూ వీటితో ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. మిగతా వ్రతాలూ దానధర్మాలూ ఇవి ఏవీ దేవీ నవరాత్రి వ్రతంతో సరికావు. సాటిరావు.
ధనధాన్య-సుఖసంతోష - ఆయురారోగ్య ప్రదమైన వ్రతం ఇదొక్కటే. స్వర్గదాయకం. మోక్షదాయకం. విద్యార్థులూ ధనార్థులూ పుత్రార్థులూ ఈ వ్రతాన్ని చేస్తే నిస్సందేహంగా గొప్ప ఫలితాలు పొందుతారు. విద్యార్థికి సర్వవిద్యలూ కరతలామలకాలవుతాయి. రాజ్యభ్రష్టుడికి అనాయాసంగా సింహాసనం లభిస్తుంది.
పూర్వజన్మల్లో ఈ వ్రతం చెయ్యనివాళ్ళు ఈ జన్మలో వ్యాధి పీడితులుగా దరిద్రులుగా పుత్రహీనులుగా బాధపడుతూఉంటారు.
గొడ్రాలు కనిపించినా వితంతువు కనిపించినా, గత జన్మలో దేవీ పూజ చెయ్యని మనిషి అని గ్రహించు. ఇహంలోనూ పరంలోనూ దివ్యభోగాలు కావాలని కోరుకునేవారందరూ నవరాత్రి దీక్షతో దేవీ వ్రతం చెయ్యాలి. చెయ్యకపోతే ఇహపరాలు రెండింటా కష్టాలు తప్పవు.
త్రిమూర్తులూ అష్టదిక్పాలకులూ సూర్యచంద్రులూ సకలదేవతలూ భక్తిశ్రద్ధలతో చండికాదేవిని అర్చిస్తున్నారంటే మానవమాత్రుడు అర్చించకపోతే ఎలాగ! స్వాహా స్వధా అనే దేవీనామాలతో యజ్ఞయాగాదులలో హోమాలు చేస్తుంటే దేవతలూ పితృదేవతలూ ఎంతగానో సంతోషిస్తారు.
బ్రహ్మదేవుడు లోకాలను సృష్టిస్తున్నాడన్నా, విష్ణుమూర్తి రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా - అంతా శాంభవీ మహిమ. ఈ సృష్టిలో దేవీ అంశలేని పదార్థం లేదు. ప్రాణి లేదు. అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాలనుంచి కూడా విముక్తి లభిస్తుంది. సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి. ఇసుమంతైనా సందేహం లేదు.
*(రేపు సుశీలుని కథ)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏
🙏 శ్రీ మాత్రే నమః🙏