-మనుజునిగా చేయవలసిన కర్మలను ఒక యజ్ఞముగా భావించి తప్పక చేయాలి. తాను యుద్ధము చేయనని చెప్పి ఒక రధసారధి పనిని శ్రీకృష్ణుడు ఎన్నుకొన్నాడు. సారధి భాద్యత కాబట్టి ప్రతిరోజూ సాయంకాలం యుద్ధ సమయము తరువాత గుఱ్ఱములకు స్నానము చేయించి, గాయములకు చికిత్స చేసి, వాటికి ఆహారమును పెట్టి, మరుచటి రోజు యుద్ధమునకు వాటిని సిద్దము చేసేవాడు. చేయు కర్మలను తక్కువ, ఎక్కువ అని భావించకూడదని తెలియజేశాడు.
నీవు ఏ పని చేస్తున్నావన్నది ముఖ్యంకాదు, ఏ భావముతో చేస్తున్నావన్నది ముఖ్యమని ఆచరించి చూపెట్టేడు శ్రీకృష్ణుడు. భగవద్గీత విశిష్ఠత ఇక్కడే వుంది. గీత ఏమిచేయాలో చెప్పదు. ఎలా చేయాలో బోధిస్తుంది.
మనుజులకు కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. చేయుపనిని ఎంతో సామర్ధ్యంతో నిర్వహించేలా చేస్తుంది. శ్రీకృష్ణుని ద్వారా గీతను ఆలకించిన అర్జునుడు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధముచేసి విజయుడై నిలిచాడు. కావున భగవద్గిత మానవ జీవితంలో, వ్యవహారమునకు వేదాంతమునకు ఒక సారధిగా నిలుస్తుంది. దీన్ని అధ్యయనం చేసి ఆచరించిన ఎంతోమంది మహానుభావులు వారివారి రంగాలలో విజయం సాధించారు.
మునుపటి భాగంలో చెప్పుకున్నట్లు, మానవుల నైజము మూడురకాలుగా ఉంటుంది. కొందరు భక్తిరసభావంతో, కొందరు క్రియాశీలంతో, కొందరు విచారణాత్మకముతో నుంటారు. ఈ మూడింటినే భక్తిమార్గమని, కర్మమార్గమని, జ్ఞానమార్గమని అనుకోవచ్చు. వీటి మోతాదు ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. ఈ మూడు ఒకదానితో ఇంకొకటి పెనవేసుకొని వుంటాయి. ఆత్మజ్ఞానము పొందుటకు ఈ మూడు అవసరమే. ఈ మూడింటి విశిష్ఠతను అర్ధము చేసుకొని తదనుగుణంగా సాధనచేయువాడు ఆత్మజ్ఞానమును పొందగలడు.
మధ్వాచార్యులంత భక్తిభావం, రామానుజాచార్యులంత నిష్కామకర్మభావం, శంకరాచార్యులంత జ్ఞానభావం కలిగియుండవలెను.
శ్రీకృష్ణపరమాత్మ, ఓ పార్ధా! ఎవరు నాకు ఇష్టమైన కర్మలు నిష్కామముతో చేయుదురో (కర్మయోగము), నిత్యము నన్నే ధ్యానించుదురో (ధ్యానయోగము), నా యందు అనన్యమైన భక్తి కలిగియుండెదరో (భక్తియోగము), దృశ్య వస్తువులందు బంధము పెంచుకొనక జ్ఞానవంతులై వుండెదరో (జ్ఞానయోగము), సమస్త ప్రాణకోటిని సమదృష్టితో చూచి వాటియెడ దయకలిగి వుండెదరో అట్టివారు నన్ను పొందెదరు. ఇది నా వాగ్దానమని వివిధ సందర్భాల్లో తెలియజేశాడు.
అంతేకాదు, ఎవరైతే మూర్ఖత్వముతో కర్మేంద్రియాలను బంధించి, ఇంద్రియ విషయాలను మనస్సుతో ఆలోచిస్తారో వారు మిధ్యాచారులు. వారు స్వయంగా నష్టపోవడమే గాక, ఇతరులకు ఏ మాత్రమూ వుపయోగపడరు. వారు నన్ను పొందడము సాధ్యం కాదు.
ఇచ్చట కర్మ చేయడంగాని, చేయకపోవడంగాని ముఖ్యంకాదు. హృదయమందు, మనస్సునందు మాలిన్యము అంతరించడమే ప్రధానము. వాటిని మనసా, వాచా, కర్మణా తొలగించకుండా ఒంటరిగా జనసంద్రమునకు దూరంగా పోయి తపమాచరించుట వలన ఉపయోగముండదు. అలాగే ఈ వాసనల నుండీ పూర్తిగా ముక్తుడైనవాడు జనసంద్రమున నున్నప్పటికీ మోక్షమును పొందగలడు.
ఇదంత సులభం కాదు. శ్రీకృష్ణభగవానుడు దీనికో ఉపాయము కూడా సూచించాడు. మొదట్లో మానవులు దుష్కర్మనుండి సత్కర్మకు మారవలెను, ఆపిమ్మట సత్కర్మనుండి నిష్కామకర్మకు మారే ప్రయత్నము చేయవలెను. దీని వలన చిత్తశుద్ధి కలిగి జ్ఞానదయమగును. జ్ఞానముచే మోక్షము లభిస్తుంది.
✍️శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).
తదుపరి భాగంలో కలుసుకుందాము. 🪷⚛️✡️🕉️🌹