🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*పందళం వలియక్కోవిల్ శాస్తా ఆలయం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
చెంగన్నూర్ నుండి సుమారు 13 కిలోమీటర్ దూరంలో పందళం రాజధానిగలదు. పురాణ ప్రకారం శ్రీ ధర్మశాస్తావారు ఈ పందళదేశ రాజుగారైన రాజశేఖరపాండ్యునికి అడవిలో పసిబాలునిగా లభించి 12 సంవత్సరముల ఇచ్చటనే పందళ రాకుమారునిగా పెరిగినారన్నది ప్రతీతి. పిదప మహారాణిగారి శిరోవేదనకు ఔషదమైన పులిపాలు నిమిత్తం అడవికి వెళ్ళిన స్వామివారు తన అవతార రహస్యము తెలుసుకొని మహిషి అను రాక్షసిని వధించి పులిమందలతో పందళరాజ్యమునకు వచ్చినారనియూ రాజభారం స్వీకరించమని కోరుకొన్న మహారాజుకు భూతనాథగీతను ప్రభోదించి సర్వము త్యజించి తాను ధరించియుండిన ఆభరణములన్నింటిని పందళరాజు గారికి అప్పగించి శబరిమలపై కోవేలగొనినారన్నది పురాణ కథ. నేటికిన్ను అందులకు ఆధారమన్నట్లు శ్రీస్వామివారు నడయాడిన ప్రదేశము , వారుస్నానమాడిన కొనేరు ఈ పందళరాజధానిలో గలదు. వారు శబరిమల ఆలయమున కొలువు తీరకముందు పందళరాజుకు ఇచ్చిన ఆభరణములు అన్నియూ ఇచ్చటనే భద్రపరచబడి ఏటేటా మకరసంక్రాంతి దినమున పందలరాజ వంశీయులు శబరిమలకు కొనితెచ్చి వారం రోజులు శ్రీస్వామి అయ్యప్పకు అలంకారము చేయించి భక్తుల దర్శినము అయినపిమ్మట మరలా వందళ రాజ్యమునకు తీసుకొచ్చి భద్రపరచి యుంచబడుచున్నది.
పందళమున వలియక్కోవిల్ అను ప్రసిద్ధి గాంచిన అయ్యప్ప ఆలయముగలదు. ఇచ్చట త్రికాల పూజలు తాంత్రరీతిగా నిర్వహించబడుచున్నది. కేరళ ఉగాది దినమగు విషు పర్వదినాన ఈ తిరువాభరణములను పందళ అయ్యప్పస్వామివారికి అలంకరించెదరు. శ్రీస్వామి వారు ఇచ్చటినుండి శబరిమలపై కోవిలగొనినారనియూ నేటి శబరిమల ఆలయము అలనాటి పందళ రాజవంశీయుల నిర్వాహణములోనే యుండినదనియూ అందురు. నేటికిన్నూ మకర మహోత్సవము అయినపిమ్మట శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయ తాళంచెవులు మేల్ శాంతి వర్యులచే పందళ రాజుగారికి ఇచ్చుటయూ తదుపరి రాజుగారు దాన్ని మేల్శాంతిగారికి అందించి మరలే పరిపాటియూ గలదు. డిసెంబర్ చివరిలో ఇచ్చట. భద్రపరచియుండు ఆభరణములు యొక ఊరేగింపులా (పాదయాత్రలా) తీసుకెళ్ళి కేరళరాష్ట్ర మంతా తిప్పి శబరిమలకు తెచ్చి అలంకరించే జైత్ర యాత్ర కన్నులపండుగగా జరగును. ఈ ఆభరణములను దాచియుంచే పెట్టెలను తిరువాభరణ పెట్టి యని మిక్కిలి శ్రద్ధాభక్తులతో పిలిచెదరు. దాన్ని దర్శించు కొనేందులకు భక్తులు తమయాత్రలో యొకభాగంగా పందళం వెళ్ళి వచ్చెదరు. పందళ రాజుగారికి శబరిమలైలోనూ యొక స్థానము కలదు. అది మాళిగైపురత్తమ్మ సన్నిధికి వెనుకభాగమున గలదు. ఈ పందళం పంచ అయ్యప్పలలో యొకటిగానూ , అలనాడు శ్రీ పరశురాముల వారిచే ప్రతిష్ట చేయబడియున్నట్లుగా చెప్పు కొందురు. పంచ అయ్యప్ప ఆలయములలో యొకటిగా లెక్కించబడిన పందళ రాజ్యమున నేడు రాజ్యాంగము , రాజ భవనములు లేకపోయినా శ్రీస్వామివారు నడయాడిన ప్రదేశము పవిత్రత మాత్రము చెక్కు చెదరక అటులనే యున్నది. ఈ తిరువాభరణ పెట్టెలను నేటికాలమున శ్రీ రామవర్మరాజ , గోదావర్మరాజ , వలియతంబిరాన్ మున్నగువారు శబరిమలకు తెచ్చే బాధ్యతను స్వీకరించి శద్ధాభక్తులతో నిర్వహించుచున్నారు. భక్తులు తమ యాత్రలో యొక భాగంగా స్వామి వారి జన్మస్థలమగు పందళం వెళ్ళి అచ్చటి స్వామి అయ్యప్పను వారి తిరువాభరణములను దర్శించి తరించగలరని మనవి.
_*రేపు శాస్తాంకోట్టై అయ్యప్పస్వామివారి ఆలయ విశిష్టత తెలుసుకుందాము*_
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*