బమ్మెర పోతనామాత్యుని భాగవత గ్రంథంలోని మధుర ఘట్టాలు - 22 .
పలికెడిది భాగవతమఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
ద్వితీయ స్కంధము.
బ్రహ్మదేవుడు, తన మానసపుత్రుడు నారదునికి పరమాత్ముని లీలలు, వివరిస్తున్నాడు:
నారదా ! సర్వోత్కృష్టమైన, వామనావతారం గురించి చెబుతాను, వినుము :
సీ. యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుఁ డదితి సం;
తానంబునకు నెల్లఁ దమ్ముఁ డయ్యుఁ
బెంపారు గుణములఁ బెద్ద యై వామన;
మూర్తితో బలిచక్రవర్తిఁ జేరి
తద్భూమి మూడు పాదమ్ము లనడిగి ప;
దత్రయంబునను జగత్త్రయంబు
వంచించి కొనియును వాసవునకు రాజ్య;
మందింప నీశ్వరుండయ్యు మొఱఁగి
తే.
యర్థిరూపంబు గైకొని యడుగ వలసె
ధార్మికుల సొమ్ము వినయోచితముగఁ గాని
వెడఁగుఁదనమున నూరక విగ్రహించి
చలనమందింపరాదు నిశ్చయము పుత్ర!
యజ్ఞ క్రతువులో ఈశ్వర స్తానం పొందిన శ్రీహరి, అదితికి కడసారి బిడ్డగా జన్మించాడు. అయితేనేమి, గుణగణాల విషయంలో, ఆయన అందరు సంతానంలో, పెద్దవాని పాత్ర పోషించాడు. అయన వామనాకారంతో, బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల నేల దానంగా పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో, ముల్లోకాలను ఆక్రమించి, తన చతురతను ప్రదర్శించి, బలిని పాతాళానికి చక్రవర్తిని చేసి, ఇంద్రుడికి స్వర్గం కట్టబెట్టాడు. ధార్మికబుద్ధిగల బలి చక్రవర్తి వద్దనుండి, రాజ్యం అపహరించాడు, యాచననే మార్గంగా ఎంచుకున్నాడు, శ్రీహరి.
పరమదాత అయిన బలిచక్రవర్తి, బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఉత్సుకతతో, తలమీద చల్లుకున్నాడు. తనతోపాటు మూడులోకాలను నారాయణుడికి ధారాదత్తం చేశాడు. విశ్వమంతట శాశ్వతమైన యశస్సు నిలుపుకొన్నాడు. ఆ దానంవల్ల దేవలోకం మీద తనకున్న ఆధిపత్యం, నిలబడదని తెలిసికూడా, గురువు మాటను సైతం లక్ష్య పెట్టకుండా, వామనరూపంలో వున్న శ్రీహరికి, సర్వం ధారాదత్తం చేసాడు.
ఓ నారదా ! అంతేకాదు. నారాయణుడు, వేరొకసారి, హంసావతార మెత్తాడు. భక్తి యోగంతో ఆత్మతత్త్వం తెలియపరచే భాగవతమనే మహాపురాణం ఉపదేశించాడు.
వేరొకసారి, మనువుగా అవతరించి తన తేజోమహిమతో అమోఘమైన చక్రం చేబూని దుర్జనులైన రాజులను శిక్షించాడు, సజ్జనులను రక్షించాడు. తన కీర్తిచంద్రికలు సత్యలోకంలో ప్రకాశింప జేశాడు.
అందరి వ్యాధులనూ పోగెట్టే, ధన్వంతరిగా, కూడా, వేరొక అవతారం దాల్చాడు. తన నామస్మరణతోనే భూమిమీది జనానికి రోగాలన్నీ పోగొట్టుచూ, ఆయుర్వేద చికిత్సా సృష్టి కర్త అయినాడు.
నారదా ! ఇప్పుడు, అరివీర భయంకరుడై, శ్రీహరి, బ్రాహ్మణకులంలో, పరశురామావతారంలో, క్షత్రియులను, నిర్జించిన తీరు వివరిస్తాను. శ్రద్ధగా విను.
మ . ధరణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి
స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం
బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ
జిర కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా !
తాపసులలో అగ్రగణ్యుడా ! కుమారా ! హైహయరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి, జమదగ్ని కుమారుడైన, పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవై యొక్కసార్లు క్షత్రియ జసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో ఊచకోత కోశాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండలమంతా వాళ్లకు దానం చేశాడు. అలా, ఆ అవతారంలో, భార్గవరాముడుగా, శాశ్వత కీర్తితో వెలుగొందాడు.
ఆతరువాత అవతారమైన, శ్రీరాముని అవతారం గురించి నీకు వివరిస్తాను :
సీ. తోయజహిత వంశ దుగ్ధ పారావార;
రాకా విహార కైరవహితుండు
కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ;
శుక్తి సంపుట లసన్మౌక్తికంబు
నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ;
కార విస్ఫురిత పంకరుహసఖుఁడు
దశరథేశ్వర కృతాధ్వరవాటికా ప్రాంగ;
ణాకర దేవతానోకహంబు
తే.
చటుల దానవ గహన వైశ్వానరుండు
రావణాటోప శైల పురందరుండు
నగుచు లోకోపకారార్థ మవతరించె
రాముఁడై చక్రి లోకాభిరాముఁ డగుచు.
శ్రీరామచంద్రుడు, సూర్యవంశమనే పాల సముద్రంలో, పౌర్ణమి చంద్రుని వంటి వాడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్యపు చిప్పలో పుట్టిన, మేలి ముత్యము. తనను నమ్ముకున్నవారి, దుఃఖాన్ని పోగొట్టే, సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల యందు మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దట్టమైన
అరణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు.
లోక కల్యాణార్థం, శ్రీరాముడుగా, చక్రధారి శ్రీ మహావిష్ణువు, జగదభిరాముడై అవతరించాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అన్నగా జన్మించాడు. భూలోకంలో పరమ పవిత్రుడుగా, పాపాలనే కలుపు మొక్కలను, కోసివేసే కొడవలి వంటివాడుగా నిలబడ్డాడు.
సీ. కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ;
పద ఫాల భుజ రద పాణి నేత్రఁ
గాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ;
జంఘోరు కుచ మధ్య జఘన కంఠ
ముకుర చందన బింబ శుక గజ శ్రీకార;
గండ గంధోష్ఠ వాగ్గమన కర్ణఁ
జంపకేందుస్వర్ణ శఫర ధనుర్నీల;
నాసికాస్యాంగ దృగ్భ్రూ శిరోజ
తే.
నళి సుధావర్త కుంతల హాస నాభి
కలిత జనకావనీ పాల కన్యకా ల
లామఁ బరిణయ మయ్యె లలాటనేత్ర
కార్ముకధ్వంస ముంకువ గాఁగ నతఁడు.
శ్రీరాముడు శివుని ధనుర్భంగం చేసి, దానినే, కన్యాశుల్కంగా చెల్లించాడా అన్నట్లుగా, చిగురాకుల వంటిపాదములు, చంద్రరేఖ వంటినుదురు, తామరతూడుల వంటి భుజములు, మల్లెమొగ్గల వంటి పలువరస, పద్మముల వంటి చేతులు;తమ్మిపూల వంటినేత్రములును కల సీతను, పరిణయమాడాడు.
కారణాంతరముల వలన, కొన్నాళ్ల తరువాత, శ్రీరామచంద్రుడిని దశరథుడు అడవులకు పొమ్మన్నాడు. లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తున్న రాముడి వెంట వెళ్ళారు. అలా రఘువంశ లలాముడైన ఆ శ్రీరాముడు సివంగులు, సింహాలు, అడవిపందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించే అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు.
రాజుల లందరిలోను నీతిసంపన్నుడు, దయాసముద్రుడు అయిన ఆ శ్రీరాముడు ఆ దండకారణ్యంలోని మునులకు, రాక్షసపీడ తొలగిస్తానని, అభయాలు యిచ్చాడు.
కం . ఖరకర కుల జలనిధి హిమ
కరుఁ డగు రఘురామవిభుఁడు గఱకఱితోడన్
ఖరుని వధించెను ఘనభీ
కర శరముల నఖిల జనులుఁ గర మరుదందన్.
సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన ఆ రామచంద్రుడు, జనులందరు ఆశ్చర్యపడగా, కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి, ఖరుడనే రాక్షసుని, వధించాడు.
కం. .హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని
హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్;
హరివిభునకు హరిమధ్యను
హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై.
సింహపరాక్రముడైన శ్రీరామచంద్రుడు, సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరునిగ స్వీకరించాడు. ఇంద్ర పుత్రుడైన వాలిని నేలగూల్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని, సింహం వంటి నడుము గల అతని భార్యను అతనికి అప్పగించాడు.
అటుపిమ్మట, సీతాపహరణం చేసిన రావణుని సంహరింపదలచి, వానర సేనలను వెంటబెట్టుకొని లంకవైపు పయనించాడు. దక్షిణ సముద్రతీరం చేరాడు. దాటుటకు వీలుగా, సముద్రుడు దరి ఇవ్వలేదని అలిగి శ్రీరామచంద్రుడు...
మ. వికటభ్రూకుటిఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం
బకుడై చూచిన యంతమాత్రమున నప్పాథోధి సంతప్తతో
యకణగ్రాహ తిమింగిలప్లవ ఢులీ వ్యాళప్రవాళోర్మికా
బక కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్.
మహావీరుడు రాముడు నొసట కనుబొమలు ముడివడగా, కోపం వల్ల ఎరుపెక్కిన నేత్రాలతో సముద్రం వైపు చూసాడు. అలా చూసేసరికి సముద్రం, నీటికోళ్లు, తాబేళ్లు, పాములు, మొసళ్లు, తిమింగిలాలు, పవడపు తీగలు, తరంగాలు, కొంగలు, కన్నెలేళ్లు, చక్రవాకాలు మొదలైన జలజంతువులతో సహా, నీళ్లు ఆ వాడియైన చూపులకే ఇంకిపోయాయి.
అప్పుడు సముద్రుడు దయాసముద్రుడైన రామభద్రుడికి శరణాగతు డయ్యాడు. రాము డతనిపై దయచూపి యథాప్రకారం ఉండమని అనుగ్రహించాడు. నలుడనే వానర ప్రముఖునిచే వంతెన కట్టించి రాముడు సముద్రం దాటాడు.
మ. పురముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం
కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధగో
పుర శాలాంగణ హర్మ్య రాజభవనప్రోద్యత్ప్రతోళీ కవా
ట రథాశ్వద్విప శస్త్ర మందిర నిశాటశ్రేణితో వ్రేల్మిడిన్.
పూర్వము శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేసినట్లు, రాముడు పెద్దపెద్ద గోపురాలు, శాలలు, ముంగిళ్లు, మేడలు , రాజగృహాలు, రచ్చలు, తలుపులు, రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షసగణాలుతో నిండివున్న లంకానగరాన్ని చిటికలో భస్మీపటలం చేశాడు.
ఈ విధంగా ఐరావత గజం వలె, తెల్లని కీర్తితో ప్రకాశించిన శ్రీ రాముడు, సమస్త భువనాలనూ వేధించి బాధించిన, రావణుని హతమార్చాడు. అతని తమ్ముడైన విభీషణుణ్ణి లంకాధీశునిగా చేశాడు.
సీ. ధర్మ సంరక్షకత్వప్రభావుం డయ్యు;
ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి
ఖరదండనాభిముఖ్యముఁ బొంద కుండియు;
ఖరదండ నాభిముఖ్యమున మెఱసి
బుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ;
పుణ్యజఁనాంతక స్ఫురణఁ దనరి
సంతతాశ్రిత విభీషణుఁడు గాకుండియు;
సంతతాశ్రిత విభీషణత నొప్పి
తే.
మించెఁ దనకీర్తిచేత వాసించె దిశలు;
దరమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ
జారుతరమూర్తి నవనీశచక్రవర్తిఁ
బ్రకటగుణసాంద్రు దశరథరామచంద్రు.
ఆయన ధర్మాన్ని రక్షించినవాడు అనే మహత్వం కలిగి కూడ ధర్మవిధ్వంసకుడై ప్రకాశించాడు, అనగా శివధనుర్భంగం చేశాడన్నమాట. ( ధర్మమూ రెండు విధాలుగా వాడారు పోతన గారు. ఒకటి ధర్మమూ, రెండవది శివధనుస్సు. )
ఖరదండనలో అభిముఖుడు కాకపోయినా ఖరదండనలో అభిముఖుయ్యాడు, అంటే కఠినశిక్షలు విధించడానికి విముఖుడైన ఆ రాముడు ఖరుడనే రాక్షసుణ్ణి దండించడానికి సుముఖు డయ్యాడు. ( ఖర్మనుగాకఠిన దండన, ఖరుడు అనే రాక్షసుడు ) పుణ్య జనరక్షకుడై కూడ పుణ్యజనులను హతమార్చాడు, అనగా పుణ్యాత్యులను రక్షించి రాక్షసులను శిక్షించాడన్నమాట. ( పుణ్య
జనులనగా, పుణ్యాత్ములు, రాక్షసులు అని కూడా వచ్చే అర్ధం ) ఆశ్రితవిభీషణుడు కాకపోయినా ఆశ్రితవిభీషణుడయ్యాడు, అనగా ఆశ్రయించిన వారిపట్ల భయంకరుడు కాడు, కాని విభీషణుని కాశ్రయం ఇచ్చినవాడయ్యాడు. ( ఇక్కడ కూడా, విభీషణ పదం రెండు విధాలుగా ) తన విశాల యశస్సును దశదిశల వ్యాపింపజేసి సుప్రసిద్ధు డయ్యాడు. మహాసుందరుడూ, మహారాజులలో మేటి, సుగణాభిరాముడూ అయిన ఆ దశరథ రాముణ్ణి కీర్తించడానికి లోకంలో ఎవరికిని సాధ్యం కాదు.
' అటువంటి శ్రీరాముని అవతారం లోకపావనమై, మనలాంటి వారందరకూ, అనుగ్రహకారణ మయింది. ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను, విను. ' అని బ్రహ్మదేవుడు, నారదునికి చెప్పసాగారు.
( ఈ సమయంలో, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, చెప్పిన అనేక అవతారాలు, క్లుప్తంగా వున్నా, తరువాతి స్కంధాలలో, విపులంగా చెప్పబడ్డాయి. కాబట్టి, మిత్రులు కూలంకష చర్చ జరుగలేదని, అనుకోవద్దు. ఏ స్కంధంలో వున్నది, ఆ స్కంధంలో మననం చేసుకోవాలి కదా ! )
స్వస్తి.
పోతనామాత్యుని అనుగ్రహంతో, మరికొంత రేపు.