బమ్మెర పోతనామాత్యుని భాగవత గ్రంథంలోని మధుర ఘట్టాలు - 21.
పలికెడిది భాగవతమఁట,
పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
ద్వితీయ స్కంధము.
బ్రహ్మదేవుడు, తన మానసపుత్రుడు నారదునికి పరమాత్ముని లీలలు, వివరిస్తున్నాడు:
కుమారా ! ఇప్పుడు నరనారాయణుల అవతా క్రమం గురించి విను.
కం. గణుతింపఁగ నరనారా
యణు లన ధర్మునకు నుదయ మందిరి; దాక్షా
యణియైన మూర్తి వలనం
బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్.
మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు గలవారు, మిక్కిలి పవిత్రమూర్తులైన నరనారాయణు లనేవారు ధర్మానికి అధిష్ఠానమైన ధర్ముడికి, దక్షుని కుమార్తె అయిన మూర్తి అనే ఆమె యందు జన్మించారు.
అలా అవతరించిన నరనారాయణులు, బదరికావనంలో గొప్ప తపస్సు చేయసాగారు. అందువలన, ' తన పదవికి ప్రమాదం వాటిల్లుతుంది ' అని ఇంద్రుడు భయపడ్డాడు. ఇంద్రుడు, దేవకాంతలను పిలిపించి ' నరనారాయణుల తపస్సు భగ్నం చెయ్యండి ' అని చెప్పి పంపాడు.
ఆ అప్సరసలు కూడా, తాము చెయ్య వలసిన కార్యం యొక్క మంచి చెడులు ఆలోచించకుండా, కేవలం ప్రభువు ఆజ్ఞనే పాటించవలెననే ఉత్సాహంతో, మన్మధుని సేనా నాయకురాళ్లవలె, నరనారాయణులు వద్దకు, బదరీవనానికి, బయలుదేరారు.,
మ. నరనారాయణు లున్న చోటికి మరున్నారీ సమూహంబు భా
స్వరలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ
బరిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్
భరితధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై.
నరుడు, నారాయణుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి, దేవకాంతలు విలాసంగా వచ్చారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే అందచందాలతో, శృంగార భంగిమలతో,
పరిహాసపు చతురోక్తులతో, ఆటలాడుతూ, పాటలు పాడుతూ విహరించారు. అలా విలాసలీలలతో తపోవనంలో విచ్చలవిడిగా విహరిస్తున్న అప్సరసలను నరనారాయణులు చూసారు. కాని ఏ మాత్రం చలించలేదు. కామానికి లోను కాలేదు. నిశ్చింతులై, నిర్మోహులై వాళ్లు, నిశ్చల ధ్యానంతో మహా తపస్సులోో నిమగ్నులై వుండిపోయారు.
తాము ఆ సమయంలో అప్సరలపై, ఏ మాత్రం కోపం చూపించినా, తమ తపోనిష్ఠకే నష్టమని తెలిసి, గొప్ప సత్వగుణంతో, నరనారాయణులు ఆ సుందరాంగులపై, ఏ మాత్రం కోపం చూపలేదు.
కేవలం, నరనారాయణులు, వారి మహిమ మాత్రం చూపించదలచారు సమాధానంగా. వెంటనే, నారాయణుడు తన ఊరు భాగాన్ని, గోటితో వేగంగా గీరాడు. అతని తొడలోనుండి అనేక మంది, అప్సరసలు, ఊర్వశితో సహా, ఉదవించారు. ఊరువు నుండి ఉద్భవించింది కాబట్టే, ఆమె ఊర్వశి అయింది.
కం. ఊరువులందు జనించిన
కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్
వారల రూప విలాస వి
హారములకు నోడి రంత నమరీజనముల్.
నారాయణుని ఊరువు నుండి పుట్టడంవల్ల ఆమె ఊర్వశి అని పేరుగాంచింది. ఇంద్రుడు పంపగా వచ్చిన అప్సరసలు, ఊర్వశి మొదలైన వాళ్ల అందచందాలు, హావభావాలు, వినోదవిహారాలు చూసి, సిగ్గుతో, అవమానపడి, ఓటమిని ఒప్పుకుని, అక్కడనుండి వెళ్లిపోయే ప్రయత్నంలో వున్నారు.
ఆ నరనారాయణులు తలుచుకున్నంతనే, సృష్టి, స్థితి, లయాలు చేయగలరు. అంతటి మహానుభావుల తపస్సుకు భంగం కలిగించడానికి చేసిన తమ శృంగారవిలాసాలు, కృతఘ్నుడికి చేసిన ఉపకారాలలా నిరుపయోగ లయ్యా యని వారు గ్రహించారు.
నరనారాయణులు, ఇంద్ర పదవి కొరకై చేస్తున్న తపస్సు కాదని వారు గ్రహించారు. ఇంద్రుని వంటి, వానికి ఇలా తమను పంపడం తగదని వాపోయారు వాళ్లు సిగ్గుతో పరితపించారు. ఆ ఊర్వశినే తమకు నాయకురాలుగా చేసుకొని వచ్చనదారినే వెళ్ళిపోయారు.
మహాశివుడు, కోపంతో ఒకప్పుడు, మన్మధుని దహించివేస్తె, నరనారాయణులు కోపాన్ని కూడా జయించి, కామాన్నీ దగ్గరకు రానీయకుండా, కృతకృత్యులయ్యారు. అలాంటి నరనారాయణుల అవతారం, మూడు లోకాలకూ ఆదర్శప్రాయమై, జనులను పవిత్రులను చేసింది.
ఇక ధృవావతారం వివరిస్తాను, విను.
సీ. మానిత చరితుఁ డుత్తానపాదుం డను;
భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనగ
నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున;
జనకుని కడనుండి సవితితల్లి
దను నాడు వాక్యాస్త్రతతిఁ గుంది మహిత త;
పంబు గావించి కాయంబుతోడఁ
జని మింట ధ్రువపదస్థాయి యై యటమీఁద;
నర్థి వర్తించు భృగ్వాది మునులుఁ
తే.
జతురగతి గ్రింద వర్తించు సప్తఋషులుఁ
బెంపు దీపింపఁ దన్ను నుతింప వెలసి
ధ్రువుఁడు నా నొప్పి యవ్విష్ణుతుల్యుఁ డగుచు
నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు నున్నవాఁడు.
ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదు డనే రాజుకు, సద్గుణాలతో, ధ్రువుడు కుమారునిగా, జన్నించాడు, ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్న తనంలో ఒకనాడు తండ్రివద్ద ఉన్నప్పుడు, సవతితల్లి సురుచి, అతణ్ణి నిందావచనాలతో నొప్పించింది.
దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించింది. భగవంతుడు సాక్షాత్కరించి అతణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా ఆకాశంలో మహోన్నతమైన ధృవస్థానంలో స్థిరపడ్డాడు. ఆ స్థానానికి పైన వుండే భృగువు మొదలైన మహర్షులూ, క్రింద వుండే సప్తర్షులూ, ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అప్పటినుండి, అతడు, ధ్రువుడు అనే పేరుతో ప్రకాశించి, విష్ణువుతో సమానుడైనాడు. చిరంజీవిగా నక్షత్ర లోకంలో వుండిపోయాడు.
నారదా ! ఇప్పుడు, పృథుచక్రవర్తి అవతారం విను.
ఉ . వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం
డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ
బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్
థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై."
వేనుడనే మహారాజు ఒకప్పుడు, అనుకోకుండా, బ్రాహ్మణుల తిరుగులేని శాపాల వలన, తన రాజ్య సంపదను, పరాక్రమాన్ని, తేజస్సును కోల్పోయాడు. నరకలోకం సంప్రాప్తమయింది, ఆ మహారాజుకు.
అట్టి, శాపగ్రస్తుడైన మహారాజుకు, కుమారునిగా, పృథుడు అనే పేరుతో, విష్ణువుా జన్మించి, తండ్రిని పున్నామనరకం నుండి రక్షించాడు. పృధు చక్రవర్తిగా, ఉండగా, భూమాతను, పవిత్రమైన గోమాతగా, ఆవిర్భవించజేసి, ఆమె ద్వారా, అనేకమైన అమూల్యమైన వస్తువులను లోకానికి అందించి, మహోపకారం చేసాడు, ఆ అవతారంలో.
బ్రహ్మదేవుడు, ఇంకా, నారదునికి, వృషభావతారం గురించి తెలియబరుస్తూ, ' నారదా ! అగ్నీ0ధ్రుడనే వాడికి నాభి అనే కొడుకు పుట్టాడు. నాభి భార్య సుదేవి. అమెకు మేరుదేవి అని మరోపేరు కూడా వున్నది. ఆమెకు శ్రీహరి, వృషభావతారుడై జన్మించాడు. అతడు చలనంలేకుండా వుండే, జడశీలమనే యోగ ధ్యానంలో నిరంతరం సంచరిస్తూ ఉండేవాడు. తాను ఏకాంతవాసంతో, ముక్తిమార్గాన్ని ఆచరిస్తూ, అనేకమందికి మోక్ష జిజ్ఞాస కలిగించాడు. ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని తన్ను గూర్చి మహర్షులు ప్రశంసించేటట్లు మెలగాడు.
మరింక హయగ్రీవుని అవతార విశేషాలు చెప్తాను శ్రద్దగా విను, నారదా !
చం. అనఘచరిత్ర! మన్మఖము నందు జనించె హయాననాఖ్యతన్
వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం
డనుపమ యజ్ఞపూరుషుఁడునై భగవంతుఁడు దత్సమస్త పా
వనమగు నాసికాశ్వసనవర్గములం దుదయించె వేదముల్.
నారదా ! పుణ్య చరిత్రుడా ! మేలిమిబంగారు కాంతికలవాడు, వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, సాటిలేని యజ్ఞపురుషుడు హయగ్రీవునిగా, దేవదేవుడు, నేను ( బ్రహ్మ దేవుడు ) చేసిన యజ్ఞంలోనుండి అవతరించాడు. సర్వాన్నీ పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముకుపుటాలలోని శ్వాసవాయువులనుండి వేదాలు వెలుగు చూశాయి.
ఇప్పుడు మత్స్యావతారం గురించి వివరిస్తాను, నారదా ! వినుము.
ఘనుఁడు వైవస్వతమనువుకు దృష్టమై;
యరుదెంచునట్టి యుగాంత సమయ
మందు విచిత్రమత్స్యావతారము దాల్చి;
యఖిలావనీమయం బగుచుఁ జాల
సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే;
కార్ణవంబైన తోయముల నడుమ
మన్ముఖశ్లథ వేదమార్గంబులను జిక్కు;
వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి
తే.
దివ్యు లర్థింప నా కర్థిఁ దెచ్చి యిచ్చి
మనువు నెక్కించి పెన్నావ వనధి నడుమ
మునుఁగకుండంగ నరసిన యనిమిషావ
తార మేరికి నుతియింపఁ దరమె ? వత్స !
ప్రళయకాలంలో సమస్తము జలమయమైపోయింది. ఆ పరిస్థితి ముందే తెలుపబడిన వైవస్వతమనువు ఒక పడవపై ఎక్కి కూర్చున్నాడు. అంతట భగవంతుడు, విచిత్రమైన మత్స్యావతార మెత్తాడు. భూతలానికి ఆశ్రయమైన, నారాయణుడు, ఎల్లప్రాణులకూ నివాసభూతుడైనాడు. నా వదనంనుండి జారిపోయిన వేదశాఖలు, కలిసిపోకుండా, విభజించి దేవతల కోరికమేరకు, మళ్ళీ నాకు ప్రీతితో అందజేశాడు. వై వస్వతమనువు అధిష్ఠించిన నావ సముద్రంలో మునిగిపోకుండా కాపాడాడు. నాయనా ! ఆ మత్స్యావతార మహత్యాన్ని వివరించడం ఎవరికి సాధ్యం !
తదుపరి అవతారమైన, కూర్మావతారం గురించి చెబుతాను, వినుము.
మ. అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా
గముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁ గవ్వపుంగొండ వా
ర్థి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిం దాల్చెఁ దత్పర్వత
భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియింపం జేయఁగా నారదా!
నారదా ! పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందరగిరిని కవ్వంగా జేసుకొని క్షీరసాగరాన్ని మథించారు. ఆ కవ్వపు కొండ కడలి నడుమ మునిగిపోయింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు తన వీపుదురద తొలగించుకోవటానికా అన్నట్లు, గిరగిర తిరుగుతున్న పర్వతాన్ని, వీపుపై మోసి, క్షీరసాగర మధనానికి ఏ ఆటంకం లేకుండా తోడ్పడ్డాడు.
ఇప్పుడు నృసింహావతారం గురించి, వినుము.
మ. సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా
ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి
స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ
కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై.
ఒకప్పుడు హిరణ్యకశిపుడు, అనబడే, రాక్షసుడు, దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి, శ్రీహరి చూచాడు. వా ణ్ణి ఫరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకొన్నాడు. వెంటనే కోరలతో భీతికొలిపే నోరు, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. వాడిగోళ్లతో, ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు.
మరిప్పుడు, ఆదిమూలావతారము వివరము తెలుపుతాను. ఆలకించు
మ. కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై వేయి వ
త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్
హరి నీవే శరణంబు నా కనినఁ గుయ్యాలించి వేవేగ వా
శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా!
ఓ మహర్షి ! గజేంద్రుడు మొసలిచేత పట్టువడి దుఃఖించసాగాడు. వేయి సంవత్సరాలు దానితో పెనగులాడుతూ, రక్షణకై విశ్వేశ్వరుని, మొరపెట్టుకొన్నాడు. నీవే నాకిక దిక్కు అని ఆర్తుడై ఆక్రందనం చేశాడు. తక్కిన దేవతలు విశ్వమయులు కారు. కాబట్టి అతని ఆపద పోగొట్ట లేకపోయారు. శ్రీహరి ఆదిమూల స్వరూపుడై వచ్చి, పరమోత్సాహంతో మకరిని చంపి కరిని కాపాడాడు.
( ఈ సమయంలో, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, చెప్పిన అనేక అవతారాలు, క్లుప్తంగా వున్నా, తరువాతి స్కంధాలలో, విపులంగా చెప్పబడ్డాయి. కాబట్టి, మిత్రులు కూలంకష చర్చ జరుగలేదని, అనుకోవద్దు. ఏ స్కంధంలో వున్నది, ఆ స్కంధంలో మననం చేసుకోవాలి కదా ! )
స్వస్తి.
పోతనామాత్యుని అనుగ్రహంతో, మరికొంత రేపు.