*సత్యకునిచే వధింపబడిన వజ్రమాలి*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
ఒకానొక సమయమున యమునానది తీరమున వజ్రమాలియను రాక్షసుడు జన్మించియుండెను.
పరాక్రమవంతులై యుండియూ , తమ రాక్షస వంశజులకు పాతాళలోకమున దాక్కుని , జీవించు
దుర్భరస్థితి వాటిల్లినదని మిక్కిలి దుఃఖితుడై , కఠోరతపస్సుచేసి బ్రహ్మ యొక్క వరముచే తన వారికి సద్గతి కలుగజేయవలెనని సంకల్పించెను. తపస్సుచేసి బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా
మరణములేని జీవితమును ప్రసాదింపుమని కోరెను. బ్రహ్మదేవునికి కూడా ఒకనాడు ఆయువు
ముగియవలసినదే కదా ! అందులకై ఈ వరము తప్ప వేరు వరము ఏదైననూ కోరుకొమ్మనెను.
*“అఖిలేశ్వరుడైన శ్రీమహాశాస్తా యొక్క శక్తి తప్ప , వేరు ఎవరి వలననూ నాకు మరణము ప్రాప్తించరాదు”*
అను వరమును పొందెను.
ఈ వరము కారణముగా , శాస్తా మరియొక లీలావినోదము గావించబోవు విషయమును
గ్రహించిన బ్రహ్మ , రాక్షసునికి కోరిన వరమును ప్రసాదించెను. వరము పొందిన పిదప అతడు ఆగునా ? వజ్రమాలి దేవలోకమునకేగి వారిని బాధింపసాగెను. ఇక వానిని అడ్డుకునేవారు లేరు కదా ! త్వరలోనే దేవతలు తమ లోకమును వదలి , దేవేంద్రునితో సహా అజ్ఞాతవాసము చేయు అగత్యము ఏర్పడినది. దేవలోకము రాక్షసుల వశమైనది.
తనకంటూ ఒక ప్రత్యేకమైన నగరమును ఏర్పరచుకున్న వజ్రమాలి , అసురగురువైన శుక్రాచార్యుని పర్యవేక్షణలో అసురేంద్రునిగా పట్టాభిషక్తుడయ్యెను. ముల్లోకములందునూ రాక్షస పరిపాలన
కొనసాగినది. వజ్రమాలి తలచినట్లుగానే రాక్షసులు ఉన్నతమైన స్థితిని పొందిరి. ఆ గర్వముచే వారు ముల్లోకములనూ బాధించసాగిరి.
ఇదంతయూ ముందే గ్రహించిన లోకపాలకుడైన శాస్తా , వజ్రమాలిని అణచుటకు తన యొక్క
శక్తి వలననే సాధ్యమగునని తలచి , భార్య యగు ప్రభావతి మూలముగా తన శక్తి స్వరూపమైన *'సత్యకుడు'* అను మహావీరుని కుమారునిగా పొందియుండెను.
తన ప్రియపుత్రుని ఆశీర్వదించు నిమిత్తమై , శాస్తా అందమైన విల్లంబులను , అక్షయ తూణీరములను ప్రసాదించెను. ఆ సమయమున అప్పుడే వికసించిన పూవువలె ప్రకాశించుచూ , ఎనిమిదేళ్ళ బాలునిగా , మంగళ స్వరూపునిగా , చేత విల్లంబులు పూనిన వీరస్వరూపునిగా , శాస్తా యొక్క అనుంగు పుత్రునిగా సత్యకుడు భాసిల్లెను. శాస్తా యొక్క పరిపూర్ణ శక్తి అతడిలో నిండియుండెను.
స్వామి యొక్క కొలువునందు సత్యకుడు కొలువై యుండెను.
వజ్రమాలి యొక్క బాధలను తట్టుకొనలేని అమరులు , బ్రహ్మదేవునితో మొర పెట్టుకొనిరి. వజ్రమాలికి వరమును ప్రసాదించినది బ్రహ్మదేవుడే కదా ! వారి ప్రార్థనలు విన్న బ్రహ్మదేవుడు
*“దేవతలారా ! శాస్తా యొక్క శక్తి వలన మాత్రమే వజ్రమాలికి మరణమన్న సంగతి తెలిసినదే కదా ! కాబట్టి ఆర్యమూర్తియైన శాస్తా మాత్రమే దీనికి దారి చూపడగలవాడు. దయాసాగరుడైన ఆ స్వామిని ప్రార్థించినచో , అతడే మీకు విమోచన కలుగజేయును”* అని తెల్పెను.
దేవతలందరూ స్వామి సన్నిధిని చేరి , వజ్రమాలి వలన తమకు కలుగుచున్న బాధలను
విన్నవించిరి. తరుణోపాయము తెలుపుమన్నట్లుగా తన కుమారుని చూచిన శాస్తా , *'ప్రియపుత్రా ! తక్షణమే వెడలి , దుష్టతనముతో ప్రవర్తించు వజ్రమాలిని అంతమొందించుము”* అని ఆదేశించెను.
తండ్రి ఆదేశానుసారము యుద్ధమునకు బయలుదేరిన సత్యకుడు , అందమైన ఒక రథమును అధిరోహించగా సాక్షాత్తూ ఇంద్రుని కుమారుడైన జయంతుడే రధ సారధిగా బయలుదేరెను.
చిరుప్రాయపు బాలుడు తనపై దండెత్తి వచ్చుట చూచిన వజ్రమాలి హేళన చేయుచూ యుద్ధరంగమున ప్రవేశించి , అంతలోనే దిగ్ర్భాంతి చెందెను. సత్యకుడు యుద్ధరంగమునంతయూ కడువేగవంతముగా కలియదిరుగుచూ , బొంగరమువలె తిరుగుచుండెను. అతడి అంబులపొది నుండి పదునైన బాణవర్షము కురియసాగెను.
అసుర సైన్యముపై అవలీలగా దండెత్తి , బంతాటవలె క్రీడించిన సత్యకుడు ఈ వినోదమంతయూ
తనకు సర్వసాధారణమే సుమా అన్నట్లుండెను. వీరావేశంతో యుద్ధమునకు దిగిన అసురసేన బలగర్వముతో ముందు పోరాడిననూ , సత్యకుని ధాటికి ఆగలేక భయపడి పారిపోసాగిరి.
చివరగా పోరాడుటకై వచ్చినవాడు వజ్రమాలి. కొంత సేపు పదునైన అస్త్రములను ప్రయోగించిన సత్యకుడు , వజ్రమాలిని ఇక ఉపేక్షించుట తగదని భావించెను. మరుక్షణమే సత్యకుని అస్త్రము
వజ్రమాలిని ఖండించగా , అతడి శరీరము భూమి పైననూ , ఊపిరి ఆకాశముననూ ఊగిసలాడసాగినది.
అట్టివిధముగా వజ్రమాలి సత్యకునిచే వధింపబడెను.
దేవతలందరూ పుష్పవర్ణము కురిపించి , దేవదుందుభులు మ్రోగుచుండగా సత్యకునికి జయజయ
ధాన్యములు చేసిరి. పలు విధముల స్తుతించిరి.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*