శ్రీ మహాశాస్తా చరితము - 49 మత్స్యావతారుని గర్వభంగము

P Madhav Kumar

*మత్స్యావతారుని గర్వభంగము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


ఒకసారి దేవతలకు , అసురులకు ఘోరమైన యుద్ధము జరిగెను. సదా కాపాడి రక్షించువాడైన
నారాయణమూర్తి అండవలన దేవతలు సులువుగా యుద్ధమున గెలుపొందినవారైరి. ఓటమిని ఎదుర్కొనిన అసురులు చేయునది లేక యుద్ధ రంగము నుండి తప్పించుకుని పారిపోసాగిరి. మాధవుడు వారిని వెన్నంటి తరమసాగెను.

అట్లు తప్పించుకుని పారిపోయిన అసురులు భృగు మహాముని ఆశ్రమమును చేరిరి. ఆ
సమయమున మహర్షి లేకపోవుటచే , ఆయన భార్య అయిన *'శయాతి'* కాళ్ళ పైబడి శరణుగోరిరి.

వెన్నంటి వచ్చిన నారాయణుని చూచిన మునిపత్ని , *"పరంధామా ! వీరు మంచివారో , చెడ్డవారోగాని , మమ్ము అభయము కోరి వచ్చినవారు. కాబట్టి నాధుడు వచ్చువరకూ , వీరిని వధియించక వేచియుండుము”* అంటూ వారించినది. కానీ మహావిష్ణువు అందులకు అంగీకరింపక *“చెడ్డవారికి సహాయము చేయువారు కూడా చెడ్డవారే”* అంటూ ఆమె ఎంత వారించిననూ వినక వారిని వధియించెను. అంతటితో ఊరుకొనక , తనను వారించిన శయాతిపై ఆగ్రహము పూని ఆమె శిరస్సును ఖండించిరి.

కొంత సేపటికి ఆశ్రమమునకు తిరిగి వచ్చిన భృగుమహర్షి ఆశ్రమ వాకిట కనిపించిన భీభత్సమును చూచి దిగ్ర్భాంతి చెంది , జరిగిన దానిని తన దివ్య దృష్టి ద్వారా వీక్షించి తెలిసికొని ఆగ్రహము బూనెను. *“నా భార్య మరణమునకు కారణమైన నారాయణునికి ఇదే నా శాపము. ఈ దుష్టకార్యమునకు ఫలితముగా అతడు పలు జన్మలు ఎత్తిననూ , నా వలెనే అతడు కూడా తన భార్యను వదలి యుండు దుస్థితి ఏర్పడుగాక”* అని శపించెను.

మహర్షి యొక్క శాపవృత్తాంతమును విన్న నారాయణుడు పరుగు పరుగున ఈశ్వరుని
ప్రసన్నుని చేసికొనుటకై తమమాచరించగా పరమశివుడు ప్రసన్నుడాయెను. పరమశివుని అభ్యర్ధనతో
శాంతమందిన భృగుమహర్షి తన శాపమును వెనుకకు తీసికొనుట సాధ్యము కాదనియూ , మాధవుడు పది జన్మలు ఎత్తిననూ , తన శాపము ప్రకారము కనీసము , ఒక జన్మయందైనను భార్యను ఎడబాసి ఏకాంతజీవనము గడుపుట తప్పదని వక్కాణించెను. ఇదంతయూ విన్న
నారాయణుడు ఇతంతయూ లోకకల్యాణార్థము కొరకేనని గ్రహించెను. పదిజన్మలను పది
అవతారములుగా దాల్చ నిశ్చయించెకొనెను.

తన అవతార లక్ష్యము నెరవేరిన పిమ్మట , అవతారము చాలించు సమయమున మునుపటి
అవతార విశేషములు జ్ఞప్తికి రాబోదన్న సత్యమును గ్రహించెను.

*"మహాదేవా ! భూలోకమున నేను ధరించబోవు పది అవతారములు కాలమున ఒక్కొక్క అవతారమునూ చాలించు సమయమున , నన్ను నేను మరచియుండు సమయమున , తమరే నాకు నిగ్రహా , అనుగ్రహశక్తి ప్రసాదించవలసినది”* అని ప్రార్థించగా , పరమశివుడు *'అట్లే అగుగాక'* అని
అంగీకరించెను.

ఒకానొక సమయమున *“సోముఖాసురుడు' అను రాక్షసుడు అనేక తపములనాచరించి , వరములను పొందియున్నవాడై , విచక్షణా జ్ఞానము లేనివాడై బ్రహ్మదేవుడు అలసటగా నిదురించు సమయమున , అతడి యొక్క చతుర్వేదములను దొంగిలించెను. బ్రహ్మదేవుని యొక్క సృష్టికి మూలాధారములైన చతుర్ వేదములు లేకపోవుటచే సృష్టికార్యమునకు అంతరాయము కలిగినది. సముద్రమున దాగియున్న రాక్షసుని వద్దనుండి వేదములను గ్రహించు నిమిత్తమై మహావిష్ణువు మత్స్యావతారమును ధరించెను.*
అవలీలగా రాక్షసుని వధియించి , వేదములను బ్రహ్మదేవునకు అప్పగించెను. ఆగిపోయిన సృష్టికార్యము మరల కొనసాగినది. కానీ అవతారలక్ష్యము నెరవేరిన పిమ్మట శాపవసమున మునుపటి దంతయూ మరచినవాడై , రాక్షసవధ అనంతరము గర్వముబూని , తన వలననే ఇంతటి గొప్ప కార్యము చేయబడినదని గొప్పలు పోయెను. మత్స్యరూపమున నుండి సముద్రము నంతయూ అతలాకుతలము
చేయసాగెను. ఎదురుగా వచ్చిన జీవులనన్నిటినీ పట్టి భక్షించసాగెను. దేవతలలు , ఋషులు సైతము భయంకపితులై బ్రహ్మదేవునితో సహా పరమశివుని వద్దకు పోయి మొరపెట్టుకొనిరి.

వీరి యొక్క దీనావస్థ చూచిన పరమశివుడు , మహాశాస్తా మాత్రమే ఈ కార్యము చేయగల
సమర్ధుడు , మత్స్యము యొక్క గర్వమును అణచగల శక్తి శాస్తాకి మాత్రమే కలదని తలచి , శాస్త్రాని వేడగా , సమ్మతించిన స్వామి కార్యాచరణకై బయలుదేరెను.


*దేవేనాభి సమాధిష్ఠః శాస్తా యోగి తధాజ్ఞయా!*
*కైవర్తతాం సమాసాధ్య మాధవం మత్స్యరూపిణం||*

మహాయోగీశ్వరునివోలె ప్రకాశించుతూ , భవసాగరమును కడతేర్చు నావికునివంటి వాడైన
స్వామి , తేజోవంతుడై ఒక జాలరి వలె వేషము బూని , మత్స్యమును పట్టుకొనుటకై సముద్రము
నందు ప్రవేశించెను. మహాపరాక్రమశాలియైన శాస్తా బాలక్రీడవోలె అతిలాఘవముగా ముమ్మూర్తులలో ఒకరైన మహావిష్ణు అవతారమైన మత్స్యమును అణగదొక్కెను. మిక్కిలి ప్రకాశముగా వెలుగొందుచూ , పద్మారాగ మణులతో శోభిల్లుతున్న మత్స్యము యొక్క రెండు కనుగ్రుడ్డులను , తన యొక్క పదునైన
గోళ్ళతో పెకిలించివేసెను. స్వామి యొక్క కరస్పర్శచే మాయతొలగి , తన యొక్క అవతార వైశిష్ట్యము జ్ఞప్తికి రాగా , మత్స్యమునకు గర్వభంగమై తక్షణకర్తవ్యము గోచరించినది. దేవతలందరూ తమను
కాపాడిన మత్స్యసంహారమూర్తియైన శాస్తాని వేనోళ్ళ కొనియాడిరి.

మత్స్యము యొక్క పద్మారాగమణుల వంటి కనుగ్రుడ్లను , తన తండ్రికి కానుకగా సమర్పించెను.
*“వినిగృహ్యాక్షియుగళం కురువింద మణిప్రభం*
*నఖాగ్రేణ సమాతాయ శివాగ్రే వినివేదయన్”*

తమ్ము అనేక బాధల నుండి కాపాడి రక్షించిన దివ్యమంగళ స్వరూపుడైన శాస్తా ప్రసాదించిన మణులను గైకొనుమని దేవతలందరూ కోరగా తన కుమారుని యొక్క పరాక్రమమునకు గుర్తుగా
గైకొనిన పరమేశ్వరుడు , తన మెడయందు ధరించిన కపాలమాలయందు మణులుగా పొదుగుకొనెను.
మత్స్యావతారమూర్తియునూ , అవతార విశేషము గుర్తుకురాగా , గర్వభంగము పొందినవాడై , శాస్తాకి ,
పరమశివునికి నమస్కరించి వైకుంఠ నాధునిలో ఐక్యమందెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat