*'కృత్య' యను రక్కసిని అనుగ్రహించిన కరుణాకరశాస్తా*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
అసురేంద్రుని కుమార్తెయైన *'సురస'* అనునది శుక్రచార్యునికి పలు శుశ్రూషలు చేయుచూ అతడి అభిమానమునకు పాత్రురాలైనది. అసురులకే స్వంతమైన *'మాయాజాల'* కళను శుక్రాచార్యుని వద్ద అభ్యసించినది. అందు ప్రావీణ్యమ నందుటచే ఆమె *'మాయ'* అనియే పిలువబడినది. మహాబల
పరాక్రమవంతమగు అసురకులమునందున్న , మాయ తన మాయోపాపముచేత కాశ్యప మహామునిని
మోహించి , అతడి మూలముగా శూరపద్ముడు , తారకాసురుడు సింహముఖుడు అను మహావీరులైన రాక్షసులను , అజముఖి యను రాక్షసిని బిడ్డలుగా పొందెను.
కఠోర తపస్సు నాచరించిన ముగ్గురూ ఈశ్వరుని శక్తితో తప్ప వేరు ఎవరి వలననూ తమకు ఎదురులేనట్లు వరమును పొందిరి. వరమును పొందిన గర్వముతో దేవతలను ఎదిరించి పోరాడి ,
దేవలోకమును తమ వశము చేసికొనిరి. దేవతలు రాక్షసుల బానిసలుగా కొనియాడబడు దుస్థితికి
వచ్చిరి. శూరపద్ముని సోదరియైన అజముఖి కామక్రీడల యందు ఆసక్తి కలదై , తన ఇచ్చ వచ్చిన
రీతిలో , తనకు నచ్చినవారితో కామవాంఛలు తీర్చుకొనుచుండినది. సుందరాంగులు పలువురిని మోసగించి తెచ్చి తన సోదరులకై వశము చేయుచుండినది.
శూరపద్ముడు ముల్లోకములను తమ వశము చేసికొనియుండగా , దేవతలు పెక్కు కష్టములు
అనుభవించుచుండిరి. ఇంద్రుడు మొదలగువారు మహారాజునకు చేపలు పట్టి తెచ్చు సేవకునివలె
మారియుండిరి. చేయునది లేక పలు కష్టములను భరించుచుండిరి. ఒకనాడు ఇంద్రాణిని చూసి మోహించిన శూర పద్ముడు ఆమె యందు ఇచ్చబూనెను.
ఈ అసురుల నుండి తప్పించుకున్న దేవతలు అజ్ఞాతవాసము చేయసాగిరి. అట్లు తప్పించుకున్న దేవేంద్రుడు భూలోకమునకు పారిపోయి *'గోముక్తీశం'* అను శైవ క్షేత్రమున తలదాచుకొనెను.
అజ్ఞాతవాసము తీరుటకు పరమశివుడే దిక్కు అనుచూ అచటనే ఉండి శివుని పూజింపసాగెను.
ఆ ప్రాతమంతయూ రావిచెట్లతో దట్టముగా నిండియుండెను. తినుటకు వేరు ఆహారము
ఏదియూ దొరకని స్థితిలో కేవలము ఆ రావిచెట్ల విత్తనములను మాత్రమే భుజించుచూ , ఈశ్వరునికై
ప్రార్థించసాగెను. రావిచెట్లునకు *'పిప్పలం'* అను పేరు ఉండుటచే , ఆ విత్తనములను భుజించిన
ఇంద్రుడు *'పిప్పలాదుడు'* అను పేరు పొందిన వాడయ్యెను.
ఆ సమయము దుర్గుణముల ఆకృతి కలిగిన అజముఖి అన్నిలోకములనూ ఇచ్చ వచ్చిన రీతి తిరుగాడు సమయము. మోహావేశముచే తిరుగాడు ఆమె ఆ ప్రదేశమునకు వచ్చి చేరినది. శూరపద్ముడు తీవ్రమైన శివభక్తుడు. కానీ అతడి సోదరి అయిన అజముఖి ఏ మాత్రమూ నియమనిష్టలు లేనిదై యుండెను. ఇచ్చ వచ్చిన రీతి తిరుగాడుచుండెను.
అటుల తిరుగాడుచుండగా అజ్ఞాతవాసము చేయుచున్న దేవేంద్రుని చూచినది. ఎంత అజ్ఞాతవాసము
చేయుచున్ననూ , దేవలోకపు అధిపతి కదా ! అతడి సౌందర్యము ఏ మాత్రమూ చెదరక యుండెను. ఇంద్రుని చూచినంతనే మదమోహితురాలైనది. ఆమెను చూచి దేవేంద్రుడు పారిపోగా , అతడిని వెన్నంటి తరుముతూ వెళ్ళి బలత్కారముగా ఇంద్రునితో రమించి , అతడి వలన గర్భవతియై ,
కృత్యయను రాక్షసికి జన్మనిచ్చినది.
అజముఖి గుణములనే పుణికి పుచ్చుకున్న కృత్య బాల్యమునుండియే ప్రజలను బాధించసాగినది.
జన్మించినది మొదలు ఆకలి ఆకలి యంటూ అదీ ఇదీ యనునది లేక , ఏది కనబడిననూ
భక్షించసాగినది. ఊరూరా తిరుగాడుచూ , కొండలను పిండిచేయుచూ , అచటనుండు తపమాచరించు
ఋషులను , వారి కుటుంబమును బాధించుచూ తిరుగసాగెను.
ఈమె బాధలను తట్టుకొనలేని ఋషులు మహాశాస్తా వద్ద మొర పెట్టుకొనిరి. స్వామిని ప్రసన్నము చేసుకొనుటకై పెద్ద ఎత్తున హోమములు నిర్వహించిరి.
లోకపరిపాలనకై కంకణము కట్టుకున్న స్వామి , ప్రజలు బాధింపబడుట చూచి దానికి ముగింపు చేయ సంకల్పించెను. ఎంత రాక్షసి అయిననూ , ఆమె ఇంద్రుని వలన జన్మించినది కాబట్టి ,
పరమశివుని యొక్క అభిప్రాయము తెలిసికొనగోరి , వేగములో తనకు తానే సాటి అయిన వాయుదేవుని దూతగా పంపెను. వాయుదేవుడు తెలిపిన వృత్తాంతమును విన్న పరమశివుడు రాక్షసిని చంపుటకై ఒక ఉపాయము తెల్పెను.
కృత్యవలన కలుగు బాధలనుండి విముక్తి పొందవలెనన్నచో , ఆమె మానవలోకమున నుండుట కన్ననూ, సముద్రమునందు జీవించుటయే ఉచితము అంటూ తన కుమారునికి సందేశము పంపెను. వాయుదేవుడు తెచ్చిన వార్త వినిన శాస్తా ఉపాయమును అమలు పరచుటకై కృత్య ఉండు
నివాసమునకు వచ్చెను. స్వామిని చూచినంతనే ఆమె కోపముతో బుసలు కొట్టినది. అనేక విధములైన మాయోపాయములను ప్రయోగించినది. స్వామియందు అవన్నియూ చెల్లునా ? స్వామి యొక్క చిరునగవు తాకినంత మాత్రముననే అన్నియూ చెదరిపోయినవి.
ఇక ఆలస్యము చేయుట తగదని ఎంచిన శాస్తా తనచేతనున్న దండమును ఆమెపై ప్రయోగించెను.
ఆమె తక్కువ తిన్నది కనుకనా ? ఎన్నో రీతులుగా దానిని ఎదుర్కొన సాగెను. ఆఖరికి శక్తి కోల్పయినదై పారిపోసాగెను. ఆమె ఎచటకి వెళ్ళిననూ ఆ దండము ఆమెను వెన్నంటి తరుమసాగెను.
స్వామి ఆయుధమునకు తిరుగుకలదా ? ఇక పారిపోవుట వీలుకాదని ఎంచిన కృత్య , స్వామిని
శరణాగతి కోరి పాదములపై పడెను. శరణాగత వత్సలుడైన స్వామి కరుణించి తన దండమును తిరిగి తీసుకొనెను.
కృత్య యొక్క దుష్ట చర్యలను ఖండించిన స్వామి *“ఇక నీవు ఈ భూలోకమున ఉండుట ఉచితము కాదు , నీ వుండు చోటు ఈ సాగరమునందే”* అంటూ రాక్షసిని సముద్రమున పారవైచెను.
సముద్రమున స్నానము చేయువారు కనీసము రాళ్ళనైననూ ఆహారముగా వేయవలసినదిగా
ఆజ్ఞాపించెను.
ఘోరమైన ఆకలితో అలమటించు కృత్యకు ఆహారముగా , స్నానము చేయువారు కొన్ని
గులకరాళ్ళను పడవేయుట నియమముగా పెట్టెను. అట్లు స్నానము చేయువారి పుణ్యములో
కొంతవరకైననూ ఆమెకు చేరునన్న సదుద్దేశముతో ఈ నియమమును అమలుపరచెను. ఆనాటినుండి
ఈనాటివరకూ కృత్య సముద్రమునందే అమరియున్నది. శాస్తా విధించిన నిబంధన ప్రాకరము సముద్రస్నానమును ఆచరించువారు
*“పిప్పలాత సముత్పన్నే కృత్యే లోక భయంకరీ|*
*పాషాణం తే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పితం”*
అంటూ ఆమెకు ఆహారార్థము గులకరాళ్ళను పడవేయుట ఆచారమైనది.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*