దీపావళి.. నరకాసురుణ్ణి వధించిన ఆనందంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకొనే పండుగ.
ఇంటర్నెట్‌డెస్క్: దీపావళి.. నరకాసురుణ్ణి వధించిన ఆనందంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో చేసుకొనే పండుగ. ఆ తరవాతి కాలంలో.. దీపాల పండుగగా, టపాసులు కాలుస్తూ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా నిర్వహించుకొనే వేడుకగా మారింది. శ్రీకృష్ణుడు, సత్యభామ నరకుణ్ణి వధించారని అందరికీ తెలిసిందే. కానీ ఎక్కడ వధించారో తెలుసా.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదీ పరివాహక ప్రాంతమైన నడకుదురులోనే!
సత్యభామ యుద్ధం చేసింది ఇక్కడే..
ద్వాపరయుగంలో నరకుడు ప్రాగ్నోషికపురం అనే ప్రాంతాన్ని పాలించేవాడు. నరకుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి, తల్లి వల్ల తప్ప మరొకరి వల్ల మృత్యువు సంభవించకూడదనే వరాన్ని పొందుతాడు. ఒకనాడు నరకుడు వేటకు వెళ్లగా జంతువుని చంపడానికి వేసిన బాణం గురితప్పి ద్విముఖుడు అనే బ్రాహ్మణుడికి తగిలి మరణిస్తాడు. విషయం తెలుసుకున్న నరకుడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి ఏం చెయ్యాలో చెప్పమంటూ గురువును ఆశ్రయిస్తాడు. జరిగింది తెలుసుకున్న గురువు కృష్ణానదీ తీరంలో భూమి నుంచి ఉద్భవించిన శివలింగం ఉంది. ఆ స్వామిని పుష్కరకాలంపాటు అర్చించడం ద్వారా ఈ దోషం నుంచి విముక్తి పొందగలవని చెబుతాడు. దీంతో నరకుడు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న నడకుదురు చేరుకుని పృథ్వీశ్వరస్వామిని ఆరాధిస్తూ ఉంటాడు. ఆ కాలంలోనే తనకున్న రాక్షస ప్రవృత్తి వల్ల ఆ ప్రాంతంలోని మహిళలను బంధించి, హింసించసాగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన వారంతా తమను రక్షించాలని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. సత్యభామా సమేతుడై అక్కడకు వచ్చిన స్వామి.. ఆ స్త్రీలందరినీ ఆ రాక్షసుడి బారిన నుంచి రక్షిస్తాడు.
అందుకు ఆగ్రహించిన నరకాసురుడు శ్రీకృష్ణ భగవానుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. ఆ యుద్ధంలో శివుడి వరప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కొద్దిసేపు స్పృహ కోల్పోతాడు. దీంతో ఆగ్రహించిన సత్యభామ కదనరంగంలోకి దూకి నరకుడిని వధిస్తుంది. అందుకే ఈ ఆలయానికి నరకోత్తరక్షేత్రంగా పేరొచ్చింది. ఆశ్వయుజ శుద్ధ చతుర్దశినాడు నరకుని పీడ వదిలింది కాబట్టి ఆ రోజును నరక చతుర్దశి అని పిలుస్తారు. ప్రజలంతా ఆనందోత్సాహాలతో బాణసంచాలు కాల్చారు. అలా దీపావళి పర్వదినం వచ్చింది. కాలక్రమంలో నరకొత్తూరు, నకరదూరుగా ప్రస్తుతం నడకుదురుగా ప్రసిద్ధి చెందింది. నరక సంహారానికి గుర్తుగా నేటికీ ఇక్కడ నరకచతుర్దశి నాడు నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు.
నరకాసుర సంహారం అనంతరం శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై.. ఇక్కడ వెలసిన లక్ష్మీనారాయణులను పాటలీ పుష్పాలతో పూజలు చేశాడని పురాణ కథనం. ఆ తరవాత శ్రీకృష్ణుడు దేవవనం నుంచి పాటలీ వృక్షాలను తెచ్చి నడకుదురులో నాటాడట. శ్రీకృష్ణుడు పూజించినట్టు చెప్పే లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఇక్కడి కార్తీక వనంలోని ఓ గుడిలో ఉన్నాయి.
అరుదైన పాటలీవనం
దేశంలో పాటలీ వృక్షాలు చాలా అరుదు. కాశీ, నడకుదురు ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు కాశీలో కూడా పాటలీ వృక్షాలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. పాటలీ వృక్షాలను వేరొకచోట నాటినా అవి పెరిగిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ చాలా పాటలీ వృక్షాలు వనంలా పెరుగుతున్నాయి. కార్తీక మాసంలో పూసే పాటలీ పుష్పాలతో పృథ్వీశ్వర స్వామికి పూజలు చేస్తారు. పృథ్వీశ్వరుని పూజకు కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఆలయం చెంతనే ఉన్న కార్తీక వనంలో వందలాదిగా ఉన్న ఉసిరి చెట్లు వేల మందికి ఆతిథ్యాన్నిస్తాయి. కార్తీకంలో ఇక్కడి వనాల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో అరుదైన ఉసిరి, పాటలీ వృక్షాలతో నిండిన ఈ వనాల్లో భోజనాలు చేయడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు.
నడకుదురు ఎలా చేరుకోవచ్చు..
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో ఉన్న శ్రీపృథ్వీశ్వరస్వామి ఆలయం విజయవాడకు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుంచి నడకుదురుకి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. కరకట్ట మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సు ప్రతి అరగంటకు ఒకటి అందుబాటులో ఉంటుంది. విజయవాడ నుంచి బందరు రోడ్డు మార్గంలో కూచిపూడి మీదుగా ప్రయాణించి కూడా నడకుదురు క్షేత్రానికి చేరుకోవచ్చు.