సమాధానం ఉండే ప్రశ్న - ప్రశ్నే.

P Madhav Kumar


కానీ సమాధానం లేని కేవల ప్రశ్న, ప్రశ్న కాదు,

అది దైవస్వరూపమే.


ఆ సమాధానం లేని కేవల ప్రశ్న "నేనెవడను" అనేదే.


"నేనెవడను" అన్న ప్రశ్నే

బ్రహ్మవిష్ణువుల యెదుట శివజ్యోతి స్తంభంగా వెలసింది.


వెలసింది అంటే అప్పుడే వెలసింది అనికాదు,

బ్రహ్మవిష్ణువులకు అప్పుడే తెలిసింది అని.


దేశకాలములకు అతీతమైన పరమాత్ముడే 

ఆ స్తంభం.


సృష్టి అనే అంతవంతమైన తీగకు ఆలంబన 

ఆ అనంతమైన స్తంభం.


ఆ స్తంభం యొక్క అంతు(అంచు) కనుగొనాలని బ్రహ్మవిష్ణువులు చేసిన ప్రయత్నమే సైన్స్ లో తొలిప్రయోగం.


క్రిందకు తవ్వుతూ ఒకడు(విష్ణువు)

పైకి ఎగురుతూ ఒకడు(బ్రహ్మ)

అన్వేషణ ప్రారంభించారు.


ఉనికే లేని దేశకాలాలు వారి వ్యర్థప్రయత్నాన్ని చూసి ఎగతాళి చేశాయి.


విష్ణువు సిగ్గుపడి యథాస్థానం చేరుకున్నాడు.

"నాకు తెలియదు" అన్న పరమసత్యాన్ని ఆవిష్కరించాడు. శివుడు సంతోషించాడు.

కాలాన్నే చక్రంగా శివుని చేత బహుమానంగా పొంది చక్రహస్తుడైనాడు.


"కనుగొన్నాను" అనే ఓ పెద్ద అబద్ధంతో

 బ్రహ్మ అహాన్ని అలంకరించుకుని

దొంగసాక్ష్యాలతో తిరిగొచ్చాడు.

'గుడిలేని దేవుడు'గా శివుని చేత శాపం పొందాడు.

తన తలవ్రాతను తానే అలా వ్రాసుకున్నాడేమో!


కాబట్టి విజ్ఞానశాస్త్రంలో "తెలుసు" అనడం గొప్ప.

అధ్యాత్మికశాస్త్రంలో "తెలియదు" అనడం గొప్ప.

* * *

"నాకు తెలియదు" అని 

సిగ్గుపడకుండా చెప్పేవాడు - జ్ఞాని.


"నాకు తెలుసు" అని 

సిగ్గులేకుండా చెప్పేవాడు - అజ్ఞాని.

* * *

"నాకు తెలియదు" అన్నా

"భగవదిచ్ఛ" అన్నా

రెంటి అర్థం ఒక్కటే.

* * *


"నాకు తెలియదు" అన్న స్థాయికి శిష్యుణ్ణి ఎదగనిచ్చేవాడే నిజమైన గురువు.


"నాకు తెలుసు" అనే బరువును శిష్యుని బుర్రలో పెట్టేవాడు కపటగురువు.  


జ్ఞానం పెరిగేకొద్ది మనం అజ్ఞానులమో తెలుస్తుంది...అంటారు వివేకానంద.

* * *

"అల్లా మాలిక్" అని బాబా అన్నా


"అప్పా! నీ ఆజ్ఞమేరకు వచ్చాను" అని రమణుడు అన్నా.


"అంతా జగజ్జనని ఇచ్ఛ" అని రామకృష్ణులు అన్నా


తమ అల్పత్వాన్ని, తెలియనితనాన్ని బాహాటంగా తెలియజేయడానికే...


అందుకే వారి బోధలన్నీ శరణాగతి వైపుకే దారి తీస్తాయి...


"నాకేమీ తెలియదు" అని ఉత్తినే మాట వరుసకు అంటే చాలదు, త్రికరణశుద్ధిగా నాకేమీ తెలియదు అని ఉండాలి.


పైకి "అప్రయత్నంగా" కనిపిస్తే చాలదు.

త్రికరణశుద్ధిగా అప్రయత్నంగా ఉండాలి.


బరిణెలోకి ఏనుగును పట్టించలేం అని తెలిసి

అప్రయత్నంగా ఉండడమన్నమాట.


అంతేగాని పైకి చెప్పి...లోపల ప్రయత్నం చేయడం కాదు.


అప్పుడే అది నిజమైన శరణాగతి అవుతుంది.

అంతేగానీ భగవాన్ అన్నట్టు ప్రతిరోజా బోర్లాపడి లేస్తుండడం శరణాగతి కాదు...


పరిమితులను గుర్తించడం ఒక ప్రజ్ఞ.

ప్రకృతిలోని సహజ పరిమితుల నుండి నువ్వు విముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నావ్. అదే నీ దుఃఖానికి, బాధకి కారణం....అంటారు UG.


* * *


84లక్షల జీవరాసుల్లో ఒక్క మనిషి తప్ప

మిగతా అన్ని జీవరాసులూ

ప్రకృతి శాసనాన్ని ఎదిరించక, ఏ సందేహమూ లేక బ్రతికేస్తున్నాయి...చచ్చిపోతున్నాయి...


ఒక్క మనిషే ప్రకృతి శాసనాన్ని అధికమించడానికే ప్రయత్నిస్తుంటాడు.


బాహ్యంగా చేసే ప్రయత్నానికి సైన్స్ అని పేరు.

ఆంతరంగా చేసే ప్రయత్నానికి తపస్సు అని పేరు.


వైజ్ఞానికంగా మార్స్ పైకి రాకెట్ తో దూసుకెళుతున్నా సరే...

 

సౌకర్యవంతమైన వస్తువులు ఇంటి నిండా నింపేసుకున్నా సరే...


ఇంకా ఏదో అసంతృప్తి...ఏదో అస్పష్టత...

అంతరాంతరాలలో ఏ మూలో నలుగుతున్న సంశయం...గంభీరమైన విచారం...


ఇది మనిషికి అనాది నుంచి వస్తున్న స్వాభావ వారసత్వం కాబోలు...


ఈ తత్కాలిక ఐహిక సుఖాల నుంచి 

ఈ మానసికవ్యధ నుంచి తప్పించుకుని 'శాశ్వతానందం' పొందే దిశగా మనిషి చేసే ప్రయాణమే ఆధ్యాత్మికం అయ్యింది.


* * *


పుట్టాలని పుట్టలేదుగాని, పుట్టాడు.

చావాలని చావడు గాని, చస్తాడు.


ఎందుకు పుట్టాలో, ఎందుకు చావాలో

చచ్చేలోపు కనుగొనే ప్రయత్నమే ఆధ్యాత్మికం అయ్యింది.


ఈ శరీరమే నేనని మోసుకు తిరుగుతుంటాడు... శరీరంలోపల ఏం జరుగుతుందో(అనాటమీ) తెలియదు.


ప్రతిదానికీ నేను-నేను అంటూ తెలిసినట్టే వ్యవహరిస్తుంటాడు.

కానీ నేను(ఆత్మ) గురించి ఏమీ తెలియదు.


తెలుసు-తెలియదు ఈ రెంటి మధ్య ఊగిసలాడుతుంటాడు మనిషి.


భౌతికత-ఆధ్యాత్మికత ఈ రెంటి మధ్య 

ఊగిసలాడుతుంటాడు మనిషి.


* * *

ఈ ఊగిసలాటను పోగొట్టే ఉపాయాన్ని సద్గురుసన్నిధిలో పొందవలసిందేగానీ ఇక వేరే మార్గం లేదు. 


పరిపూర్ణానుభవాన్ని పొందే అటువంటి ఉపదేశాన్ని నేను సద్గురు సన్నిధిలో పొందాను...


అది మీకు పనికొస్తుందేమో చదవండి...


* * *

నాలుగు పావలాలు కలిస్తే రూపాయి అయినట్టు


ఒకటవ పావలా - వ్యక్తి(నేను)

రెండవ పావలా - సంసారం(నాది)

మూడవ పావలా - జగత్తు.

నాల్గవ పావలా - జగదీశ్వరుడు.


ఈ నాల్గింటిలో ఒకటవభాగమైన వ్యక్తిగా(ఒక పావలాగా) మాత్రమే తానుండడం వల్లనే

అనగా వ్యష్టిభావనే తన అసంతృప్తికి కారణం.


* * * 


1. నేను అంటే ఈ తనువు మాత్రమే తానని  

ఉన్నవాడు - పావలా(బ్రహ్మచర్యాశ్రమం)


2. నేను అంటే 'తను, సంసారం' 

నేనని ఉన్నవాడు - అర్థరూపాయి(గృహస్థాశ్రమం)


3.నేను అంటే 'తను, సంసార, ప్రపంచములు' కలిపి నేను అని ఉన్నవాడు - ముప్పావురూపాయి

(వానప్రస్థాశ్రమం)


4. నేనుఅంటే 'తను, సంసార, ప్రపంచ, దైవములు' కలిపి నేను అని ఉన్నవాడు-రూపాయి (సన్న్యాసాశ్రమం)


పూర్ణానుభవం అనేది 'రూపాయి'కి తప్ప 

నాల్గు పావలాలలో ఏ ఒక్క పావలాకూ కలుగదు.

ఏ ఒక్క పావలా పూర్ణం కాదు. మిగతా మూడుపావలాలతో కలిస్తేనే పూర్ణం.


కాబట్టి పావలాగా ఉన్న నీవు 

రూపాయిగా విస్తరించడమే మోక్షం.


పావలాగా ఉన్నప్పుడూ 'తెలియదు' అని ఉంటాడు.

రూపాయిగా ఉన్నప్పుడూ 'తెలియదు' అని ఉంటాడు.


మొదటి 'తెలియదు' - జ్ఞానము లేక.

రెండవ 'తెలియదు' - అన్యము లేక.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat