ఏమి కావాలి నీకు ? ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం!

P Madhav Kumar


ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం

సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.

దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.

 షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "

 పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు భూతం ప్రత్యక్షం అయ్యింది."ఏమి కావాలి నీకు" అని అడిగింది.

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.

 భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.

నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.

 ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.

 వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.

 ఏమి కావాలి నీకు అని అడిగింది.

 పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.

 ఎన్నని అడగగలడు, అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా అని ఆలోచించిన పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి గుర్తుకు వచ్చాడు, అతడేదైనా పరిష్కారం చూపుతాడేమో అని అతని దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.

 భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు.భూతం అలసిపోయిస్థంభం ప్రక్కన నిద్రపోతోంది.

 తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.

ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.

 ఈ కధ మనది.

 ఈ కధ మనకు ఏమి నేర్పుతుందో చూద్దామా

 మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది.ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని .

 ఆ వృద్ధ సన్యాసి (అంటే మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం "మంత్రం" (దైవ నామ స్మరణ) ఎక్కడం దిగడం మంత్రం జపం.జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన చేయటం) అనునిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.

 అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.

 మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయాయంత్రం. అంతే కాక దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా

 మహోజ్వల జ్యోతి రూపం. మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.

ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.

 ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat