🌷🌷వసంత పంచమి🌷🌷

P Madhav Kumar

 


వసంత పంచమి / శ్రీ పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయని మన సనాతన హిందూ ధర్మంలో నమ్మకం. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు.


'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో తెలియజేయడం జరిగినది .


వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (ఫిబ్రవరి ) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి . శాస్త్రం, కళలు, విజ్ఞానం. హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.


"సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్ 

కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్

 వహ్ని శుద్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్ 

రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్..."


  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను.


వసంత పంచమి విశిష్టత :- సరస్వతీదేవి మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.


''చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా'' అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.


అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.


ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితోకూడిన వంటలను నారికేళము, అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.


ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా. వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు.


''వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి'' ఇలా అనేక నామాలున్నప్పటికీ ''సామాంపాతు సరస్వతీ.... '' అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.


సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.


జ్ఞానశక్తికి అధిష్టాన దేవత - సరస్వతీమాత. జ్ఞాన, వివేక దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార ,శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్థమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ అయిన జగన్మాతను ముగ్గురమ్మల మూలపుటమ్మ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది.


వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది .


సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది.. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదా మాతే శక్తిదాయిని..


కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు..


ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.


చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత వేడుకలను తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్ పంచమి జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి

 ఉంటాయి. రోజంతా చండీవాహనం. వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు.


వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు .


ఆదిశంకరుడు తాను అపారమైన వాఙ్మయాన్ని, తత్వవిజ్ఞానాన్ని ఈ తల్లి కృప చేతనే పొందినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా శారదానుగ్రహం వలన మనమందరం సమగ్ర జ్ఞానంతో ఎదగగలమని చాటాడు. గాయత్రిగా, సావిత్రిగా, పరాశక్తిగా శ్రుతులు పేర్కొన్న సర్వచైతన్య స్వరూపిణి శారదాదేవి. అందుకే వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని పూజిస్తే జ్ఞానవంతులవుతారన్న నమ్మకం అనాది నుంచీ వుంది.


పూర్వం ‘యాకుందేందు...’ అన్న శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీ. వాక్కుకీ, జ్ఞానానికీ చదువుకి ఆమె అధిదేవత. వేదాల్లో కూడా సరస్వతీ సూక్తాలున్నాయి. ప్రాణశక్తిగా, జ్ఞానశక్తిగా ఉపాసించే దేవతను అంబితమే, నదీతమే, దేవితమే అని శ్రుతి కీర్తించింది. అలాంటి సరస్వతీదేవిని ఆమె పుట్టినరోజు నాడు అర్చించే అవకాశం మనకు వసంత పంచమి (శ్రీపంచమి) రూపంలో వచ్చింది. దానిని సద్వినియోగం చేసుకుందాం.

      


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat