*శివుడు జ్ఞానమూర్తి- శక్తి ఆనంద స్వరూపిణి. జ్ఞానానందాలు విడిగా ఉండవు. “అతని సంతతానందశక్తి ఆ సరసిజాక్షి"* అని శ్రీనాథ మహాకవి మాట.
*ఈ శివశక్తుల ఏకతత్త్వమే గణపతి - అంటే - జ్ఞానానంద సమాహార స్వరూపం.*
ఈ తత్త్వాన్నే వివిధ ఉపాసనా పద్ధతులుగా, కథలుగా, రూపాలుగా వివరించాయి పురాణాది శాస్త్రాలు. గణపతి ఎక్కడ ఎప్పుడు ఎలా ఆవిర్భ వించినా శివశక్తిమయునిగానే వ్యక్తమవుతాడు.
ధర్మగతికి, దేవకార్యాలకీ ఆటంకాలు ఎదురై, జగత్ స్థితికి అవరోధాలు కలిగినప్పుడు ఆ విఘ్నాలను పరిహరించడానికై పలు రూపాలతో వినాయ కుడు ఆవిర్భవించినట్లుగా ఎన్నో కథలున్నాయి. అందుకే ఆ స్వామికి ఎన్నో అవతారాలు.
ఒకప్పుడు జగదంబ భండాసురునితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుని సోదరుడు విశుక్రుడు ఒక విఘ్నయంత్రాన్ని తయారుచేసి ప్రయోగించాడని బ్రహ్మాండ పురాణ గాథ. ఆ యంత్రం పేరు *'జయవిఘ్నశిల'.* దానిలో ఎనిమిది విఘ్నశక్తులున్నాయని ఆ కథ చెబుతోంది.
అవి :
*1. అలస (సోమరితనం)*
*2. దీన*
*3. కృపణ (బేలతనం)*
*4.నిద్ర*
*5. తంద్ర (కునుకుపాటు)*
*6. క్లీబ*
*7. ప్రమీలిక*
*8. నిరహంకార*
ఈ నామాల ఆంతర్యాన్ని పరిశీలిస్తే - ఈ శక్తులు ప్రగతికి అడ్డుతగిలే గుణాలేనని స్పష్టమవుతుంది. దీని బట్టి పురాణకథల సంకేతవాదం మనకు చెప్పే పాఠాలు అవగతమవుతాయి.
ఏ కార్యరంగంలోనైనా పై ఎనిమిది అడ్డంకులు - సోమరితనం, దిగులు, బేలతనం, నిద్ర, కునుకు, కర్తవ్యందాకా వచ్చేటప్పటికి వెనుదీయడం (క్లీబ), సంకోచించడం (ప్రమీలిక), 'నావల్ల ఏమీ కాదు' అంటూ తనపై తనకు నమ్మకం లేని తనం. వ్యక్తిత్వ వికాసానికి ఇవి శత్రువులు. వీటిని ప్రయోగించగానే శక్తి సేనలు జడమయ్యాయి. నిర్వీర్యమయ్యాయి.
మనలో నున్న అఖండ ఆత్మచైతన్యం వలన పని చేసే అంతర్గత శక్తులే శక్తిసేనలు. అవి పై ఎనిమిది దుర్గుణాల వల్ల స్తంభించబడడమే ఈ గాథలో ఆంతర్యం.
ఆ సమయంలో అమ్మవారు (లలితాదేవి) పరమేశ్వరుని చూసి, ఆ దర్శనం వల్ల కలిగిన స్పందనతో మందహాసం చేసిందిట. వెంటనే ఆ మందహాస తేజం నుండి గణపతి ఆవిర్భవించాడని ఆ పురాణ కథ.
శివశక్తి స్పందన వల్ల కలిగిన ఒక ఆనందచైతన్యమే విఘ్నేశ్వరుడు. అదే “నవ్వు” నుండి ఉద్భవించడంలోని ఉద్దేశం.
అలా వెలువడిన మహాగణపతి అవలీలగా విఘ్నయంత్రాన్ని పిండి చేశాడు. ఎనిమిది విఘ్నశక్తుల్నీ సంహరించాడు. - ఈ ప్రాచీనగాథలోని గొప్ప భావాల్ని పరికిస్తే గణపతి భావం అవగతమవుతుంది.
*జ్ఞానానంద శక్తి నుండి ఉత్సాహం, కార్యశీలత వంటి దివ్యశక్తులు కలుగుతాయి. ఇవి ఎలాంటి విపరీతాలనైనా తొలగించి, సిద్ధిని ప్రసాదిస్తాయి.*
*తేటపడిన సారాంశం:* *గణపతి ఆనందరూపుడు. సంతోషాన్ని ప్రసాదించడమే ఆయన అనుగ్రహం.*
హాస్యరసానికి గణపతిని అధీశునిగా చెప్పడంలోనూ ఇదే ఆంతర్యం. అలాగే, *'మోదకం'* ఆయనకు నైవేద్యం... అనడంలోనూ ఇదే భావం. *ఆమోదం, ప్రమోదం, ఋద్ధి, సిద్ధి, పుష్టి, తుష్టి, కాంతి, సుముఖ (మంచి పనులకు అనుకూలత), దుర్ముఖ (చెడు పట్ల విముఖత)...* ఇవన్నీ గణపతి శక్తులుగా శాస్త్రం వర్ణిస్తోంది.
*‘మోదం’ అంటేనే ఆనందం.*
ఒక కార్యం ప్రారంభించేటప్పుడు 'భయం, సంశయం, సంకోచం, ఉద్వేగం' వంటి వికారాలు లేకుండా; ఉత్సాహంగా, 'తప్పక సిద్ధి లభిస్తుంది' అనే సకారాత్మక (Positive) భావనతో కూడిన ఆనందాన్ని *‘ఆమోదం’* అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే ఆనందాన్ని *'ప్రమోదం'* అని భావించవచ్చు.
ఆనందపు ఈ రెండు భావాలే గణపతి శక్తులు. 'పూర్ణ’త్వానికి సంకేతాలుగా మోదకాలు, ఉండ్రాళ్ళు, లడ్లు... వంటివి గణపతికి నైవేద్యాలుగా - ఆయన వలన మనకి ప్రసాదాలుగా లభిస్తాయి. పరిపూర్ణానంద తత్త్వమే గణపతి స్వరూపం... ఆ అనుభవమే మనకు ప్రసాదం.
పంచభూతాలలో భూమియందున్న ఈశ్వరశక్తిని గణపతిగా ఆరాధించడం మరియొక శాస్త్రకథనం.
ఈ పృథ్వీతత్త్వంలోని చిచ్ఛక్తినే, *'మూలాధారశక్తి'* గా యోగశాస్త్రం చెబుతోంది. ఈ ‘మూలమై’న చక్రానికి అధిష్ఠానం గణపతి. యోగపరంగా ఆదిదైవమితడే. ఈ భూతత్త్వ ప్రతీకగానే మట్టితో స్వామి ప్రతిమను చేయడమనే సంప్రదాయం వచ్చింది. ఈ పుడమిలోనే మిగిలిన నాలుగు భూతతత్త్వాలు లీనమై ఉన్నాయి. ఈ భూమిపై, భూమివలన- పార్థివ శరీరంతో బ్రతికే మనం, ఈ తత్త్వంలోనే ఈశ్వరతత్త్వాన్ని ఆవిష్కరించు కోవాలి. ఆ ప్రక్రియే గణపతి ఉపాసన.
వేదాంత పరంగా... బ్రహ్మజ్ఞానాన్ని గ్రహించకుండా అడ్డుకునే *'వక్ర’* మైన మాయాశక్తే *‘విఘ్నం’.* దానిని తొలగించి, తన పరతత్త్వాన్ని ప్రత్యక్షం చేసే విఘ్న నాశకుడు, మాయ కు నాయకుడు విఘ్నేశ్వరుడు.
అతడు సచ్చిదానందమూర్తి. నిర్మలమైన, పూర్ణమైన అఖండానందాన్నే తన స్వరూపంగా వ్యక్తం చేస్తున్న గణేశునికి వందనం. 🙏
🌷🌷🌷🌷