మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.
ఓసారి బ్రహ్మ , విష్ణువు , పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని , ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ , విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి , దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని , ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.
జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ , రుద్రజపం , శివాలయంలో ఉపవాసం , వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు , అష్టమి తిథితో కూడిన సోమవారం , కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు , అన్ని ఆశ్రమాలవారు , స్త్రీలు , పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.
మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం , లోపల , బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.
భక్తి భావంతో గీత , వాద్య , నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు , శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం , ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.
చందనం , నూకలు లేని బియ్యం , నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు , పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి. భవుడు , శర్వుడు , రుద్రుడు , పశుపతి , ఉగ్రుడు , మహాన్ , భీముడు , ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం , కొబ్బరి , తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.
రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు , యవలు , కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.
మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను , అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.
నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు , పెసలు లాంటి ధాన్యాలను , శంఖ పుష్పాలకు , మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ , మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం , మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.
నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని , ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు , సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ , విష్ణు , పార్వతులకు వివరించి చెప్పాడు ఈ కథను.
*_శివరాత్రి జాగారం , ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా ?_*
శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివ నామ స్మరనతో మారుమోగిపోతున్నాయి. శివారాధనలో లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.
*అసలు శివరాత్రి విశిష్టత ఏమిటి ? ఆ రోజు ఉపవాసం ఎందుకుంటారు ? జాగారం ఎందుకు చేస్తారు ? జాగారం ఎవరు , ఎప్పుడు ప్రారంభించారు ?* అంటే దానికి ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హాలాహలం పుట్టింది. హాలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలనూ దహించేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులందరూ భయాందోళన చెందారు. హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుడిని శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి , గొంతులో బంధించి అలా గరళకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి , నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరుపొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుడిని తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోపశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు.
అయినా , శివుడిని హాలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హాలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి , జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ , జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. నిజానికి శివారాధన పురాణాలకు ముందు నుంచే ఉనికిలో ఉంది.
క్రీస్తుపూర్వం 3వేల ఏళ్ల నాడే సింధులోయ నాగరికత విలసిల్లిన కాలంలో శివుడిని పశుపతిగా ఆరాధించేవారు. క్రీస్తుపూర్వం 1500-1200 నాటికి చెందిన రుగ్వేద శ్లోకాలలో రుద్రుడి పేరిట శివుని ప్రస్తావన కనిపిస్తుంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దికి చెందిన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత సిద్ధాంతాల ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఉపనిషత్తు భగవద్గీత కంటే మునుపటిది. అయితే , ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న శైవారాధన పద్ధతులు , సంప్రదాయాలు మాత్రం క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుశకం 100 సంవత్సరాల మధ్య ప్రారంభమై ఉంటాయని గావిన్ ఫ్లడ్ వంటి చరిత్రకారుల అంచనా.
శివారాధనలో మూర్తి రూపం , లింగరూపంలోనూ పూజిస్తారు. లింగ రూపమే ప్రధానమైనది. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. మహాశివరాత్రి పర్వదినాన శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు , పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. దేశంలోని 12 శివుని ప్రసిద్ద ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు , భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి , భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో , చింతనలో గడిపి , రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం , జాగారం ముఖ్యం.
*శివరాత్రి ఎలా జరుపుకోవాలి?*
సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
*ఉపవాసం*
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
*జీవారాధాన*
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
*మౌనవ్రతం*
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.
*అభిషేకం*
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
*జాగరణ*
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
*మంత్ర జపం*
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.