⚜️ ఇంజిప్పారకోట ⚜️
అళుదానది దాటినచో తదుపరి భక్తాదులు ఇంజిప్పార కోట్టయను స్థలమునందు విశ్రాంతి పొందుదురు , చరిత్రకాలమున పాండ్యదేశమందలియు , కేరళతీర మందలియు బందిపోటుగా చలామణియైన ఇంజిప్పార మల్లన్ యొక్క స్థావరముగా వెలసిన ఈ స్థలము శత్రువులు సులభముగా కనిపెట్టలేని ఒక కంచుకోటగా యుండినదనియు , దుర్మార్గులు , బందిపోట్లు , దేశబహిష్కృతులు
గుమికూడి నివసించే గుడారముగును , ఈ స్థలము నాటి కాలములో ప్రసిద్ధిగాంచి నదిగా యుండెను. నేటి కాలమునందు నీటి సరఫరా తక్కువగా యుండినను ధారాళముగా భక్తులు ఇరుముడులను దించుకొని విశ్రమించుటకు తగిన స్థలముగా ఎంచబడుచున్నది. ఇచ్చటను అయ్యప్ప సేవా సంఘమువారు భక్తులకొరకై శొంఠినీరు (చుక్కు వెళ్ళం) సరఫరా చేసి భక్తులదాహము తీరుస్తున్నారు. లోయలో సుమారు రెండు మూడు కిలోమీటర్ల దూరముదిగి మంచి నీరుకొని తెచ్చి వాటిలో శొంఠికలిపి , కాచి వడగట్టి భక్తులకు వినియోగించుచున్నారు.
వనయాత్రవలనను , ఎడతెగని నడక వలనను అతి సులభ ముగా భక్తులకు వ్యాధులు సోకే అవకాశాలు నిండిన వనమార్గములో ఔషధ తుల్యమైన ఈ చుక్కువెళ్ళము ఎంతో ఉపయోగకరమైనదియు , అత్యావశ్యమైనదియు అగును. అట్టి దాహశాంతి తీర్చే అఖిలభారత అయ్యప్ప సేవాసంఘమువారిని ఎంతకొని యాడినను సరిపోదు. విద్యుత్ సరఫరాలేని ఈ స్థలములో పెట్రోమాక్సు దీపపు కాంతితో పలు అంగళ్ళలో వేడి వేడి కప్పగడ్డ , గంజి , ఛాయ , పండు , బరోటా మున్నగు
ఆహారపదార్థములు ధారాళముగా లభించు చున్నందున చీకటి పడ్డ పిమ్మట ఆ స్థలమును చేరుకొనే భక్తాదులు ఆకలితీర్చుకొని ఆ రాత్రి అచ్చట బసచేసి మరుసటి దినము ఉషఃకాలమున లేచి తమ నడకను ప్రారంభింతురు. అళుదామిట్ట ఈ స్థలముతో పూర్తి అగును. అతి తక్కువకాలము లోనే ఈ స్థలము ఒక మంచి తావళముగా రూపుదిద్దుకొన్నది. ఇచ్చటకూడా అయ్యప్ప సేవాసమాజము మిక్కిలి శ్రద్ధతో భక్తులకు సేవ చేయుచున్నది. ఇచ్చట నీరు లభించుట కష్టమే అయిననూ కాఫీయో , టీయో అవశ్యమైన వారికి సంతృప్తిగా లభించుచున్నది. అన్ని తావళములందునూ వ్యాపారస్థులు అధికమైనందున సమృద్ధిగా ధనము తీసికెళ్ళిన వారికే అచ్చట స్థానము. వ్యాపారస్తుల అనుగ్రహము అట్టివారిపై మాత్రముకలుగును. *“ధనమూలం ఇదంజగత్"* అను సామెత మరి ఊరకనే వచ్చినదా ? ఈ ఇంజిప్పారకోట వద్ద శూరటెంకాయలు
కొట్టుట , టపాకాయలు పేల్పించుట , సర్పపు పాటలను పాడించుట మొదలగు సాంప్రదాయములను కన్ని అయ్యప్పస్వాములు కోట్టయిల్ శాస్తా యొక్క సంకల్పము చేసికొని ఆయన ప్రీతికై చేయించుట శ్రేయస్కరము.
🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏