🔱 శబరిమల వనయాత్ర - 48 ⚜️ పందళరాజ దర్శనం ⚜️

P Madhav Kumar


⚜️ పందళరాజ దర్శనం ⚜️


శబరిమల చరిత్రలో మరచిపోలేని వ్యక్తిగా చిరస్మరణీయం పొందిన వారు పందళరాజు. హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి వారిని పసిబాలునిగా పంబా తీరమున కనుగొని తన రాజ్యమునకు తీసుకెళ్ళి మణికంఠుడను నామకరణముచేసి , 12 సంవత్సరములు తన కొలువులో యువరాజుగా యుంచి , కపటమైన రాణి శిరోవేధన దీర్చుటకు పులిపాలు తెచ్చుటకు అడవికి వచ్చిన మణికంఠుడి అవతార ఉద్దేశ్యమగు మహిషి మర్దనము ముగిసిన పిమ్మట పులిమందలతో వచ్చిన మణికంఠునితో పందళరాజు రాజ్యభారము వహించమనగా తన అవతార ఉద్దేశ్యము తీరినదియు తనకు శబరిమలలో ఆలయము నిర్మించమనియు ఆజ్ఞాపించిన దేవకుమారుడగు అయ్యప్ప ఆనతి మీరక పందళరాజు ప్రస్తుత శబరిమల ఆలయమును నిర్మించుటయే కాక అలనాడు యువరాజుకు తాను అలంకరింపజేసిన స్వర్ణాభరణములను యువరాజైన మణికంఠుడు తనకే తిరిగి ఇచ్చి వాటిని మకర సంక్రాంతినాడు శబరిమలకు తెచ్చి అలంకరించమని ఆదేశించెను.


నాటినుండి నేటివరకు ఆ ఆనతిని శిరసా వహిస్తున్న పందళరాజ వంశీయులు అలనాటి ఆభరణములను భయభక్తితో పందళమునుండి శబరిమలకు మోసుకొచ్చి స్వామివారికి మకర సంక్రాంతి దినము నుండి ఏడు దినములు అలంకరింపజేసి ఆనందించెదరు. ఆ ఏడు దినములు మాళిగాపుర సన్నిధిలో ఒకవైపు పందళరాజు విడిదిలో వారు బస చేయుదురు. వారిని మనము అచ్చట దర్శనము చేసుకొనవచ్చును. మకర విళక్కు ఉత్సవం చివరి దినమున శ్రీ స్వామివారికి కళశాభిషేకము (చందనాభిషేకం) నిర్వహిస్తారు. అదేవేళ శ్రీ స్వామివారి పెంపుడు తండ్రియగు పందళ రాజ వంశీయులు శ్రీ స్వామి అయ్యప్పను దర్శించుకొని కాసేపు ఏకాంతములో స్వామివారితో తమ విన్నపములను చెప్పుకొనే అవకాశమును కల్పిస్తారు. అందుకని ఇంకెవ్వరిని సన్నిధానములో యుంచక పందళరాజు మాత్రమే స్వామిసన్నిధిగా ఏకాంతములో సంభాషించుకొనేట్లు ప్రత్యేకముగా సెక్యూరిటీని ఏర్పాట్లు చేసెదరు. మేల్ శాంతి వర్యులు మాత్రము సన్నిధానము లోపలి భాగాన తలపుకు ఆనుకొని నిలబడి వారిరువురికి సాక్షిగా యున్నట్లు భావనలో నిలబడియుందురు. ఏటేటా జరిగే ఈ అద్భుత సన్నివేశము నేటికిని స్వామి అయ్యప్పకు పందళరాజులకు గల సంబంధ బాంధ్యవ్యాలను చాటిచెప్పే విధముగా యుండును. శబరిమల యాత్ర మరియు అయ్యప్ప చరిత్రలో ప్రధాన పాత్రధారియైన పందళరాజు వంశీయులకు శబరిమలలో ఒక ప్రత్యేక స్థానము కలదన్నందులకు ఇది నిదర్శనమగును. ప్రస్తుత దేవస్వం బోర్డువారు పందళ రాజు గారికి ప్రత్యేక మర్యాదలు బహుమతులు సమర్పించుకొందురు. చివరిదినం ఆలయం మూసి వేయునపుడు ఆలయ తాళంచెవులను పందళరాజు చేతికిచ్చి ఇప్పటికి ఆ ఆలయం పందళ రాజధాని కట్టుబాట్లలోనే యున్నదని తెలుపుకుందురు. పిదప 18 మెట్లు దిగి ఆభరణములను తిరిగిపుచ్చుకొని తమ

పందళరాజదానికి వెళ్ళే మునుపు శబరిమల ఆలయ తాళంచెవులను అచ్చటి మేల్ శాంతి వర్యులకు రాజుగారు ఇచ్చివెళ్ళే పరిపాటి నేటికిని కొనసాగుచూనే యున్నది.


🙏🌻ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat