దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రిమీద కొలువై భక్తుల కోరికలు కోరించే తడవుగా వారి కొరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి. ఒకసారి ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాము.
స్థల పురాణం:
పూర్వం కీలుడనె యక్షుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకొమ్మని అడగగా అమ్మా నువ్వు ఎపుడూ నా హృదయ స్ధానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు. అదివిన్న అమ్మ చిరునవ్వుతో సరే కీల నువ్వు ఎంతో పరమపవిత్రమైన ఈ కృష్ణానది తిరంలో పర్వతరూపుడవై ఉండు నేను కృతాయుగంలో అసుర సమ్హరం తరువాత నీ కోరిక చెల్లిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యింది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురుచూడసాగాడు. తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషున్ని వదించి కీలుడి కిచ్చిన వరం ప్రకారం మహిషవర్ధిని రూపంలో కీలాద్రిపై వెలసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాదిదేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలవబడింది. అమ్మవారు కనకవర్ణశోభితరాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది.
ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరున్ని కూడా కొలువుంచాలనే ఉద్దెశంతో బ్రహ్మదేవుడు శివున్ని గురించి శతాశ్వమేదయాగం చేశాడు. దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ స్వరూపంతో వెలిసాడు. అలా వెలసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లికదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని గాధ.
మరో గాధ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్రతపస్సు చేయగా తనని పరిక్షించడానికి శివుడు కిరాతకుడుగా వచ్చి అర్జునితో మల్లయుద్దం చేసి అర్జునుని భక్తుని మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. స్వామి ఇక్కడ మల్లయుద్దం చేసాడు కావున మల్లికార్జునుడిగా పిలవబడుతున్నాడు.
ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు జోతిర్లింగం అదృశ్యంగా ఉండడాన్ని గమనించి అమ్మ ఆలయ ఉత్తరభాగన మల్లికార్జునున్ని పునఃప్రతిష్టించారు. మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీ చక్రయంత్ర ప్రతిష్ట చేసి శాంతింపచేసారు. అప్పటి నుండి అమ్మ పరమశాంత స్వరూపినిగా భక్తులను కనువిందు చేస్తుంది.ఇక్కడ మరో విశేషమేమిటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై వున్నారు. కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతి పాత్రమైనవి శరన్నవరాత్రులు. ఈ రోజుల్లో గనుక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.ఈ దసరా తోమ్మిది రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు.
అమ్మవారి శ్రీ చక్రం:
శ్రీ చక్ర అధిష్టాన దేవత శ్రీ దుర్గాదేవి . ఈ దుర్గాదేవి మహిషాసుర సంహారానంతరం, అదే స్వరూపంతో ఇక్కడ స్వయంభువుగా రౌద్రరూపంతో వెలసింది. ఆనాటి వీర శాక్తేయులు దేవికి వామాచార పద్ధతిలో జంతుబలులు, నరబలులు నివేదించి పూజలు చేసేవారు. దాంతో దేవీ మూర్తి మరింత ఉగ్రరూపాన్ని ధరించింది. దానివల్ల పూజల్లో ఏ చిన్నతప్పు జరిగినా కొండ క్రింద ఉన్న బెజవాడ (విజయవాడ) నగరంలో ఏదో ఒక ఉపద్రవం వచ్చిపడుతూ ఉండేది. ఈ స్థితిని గమనించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని శాంతి స్వరూపిణిగా మార్చి ఇక్కడ తమ మంత్ర శక్తితో శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించారు.
నిత్యార్చనలు, కుంకుమార్చనలు అన్నీ దేవి మూలవిరాట్ కాక అమ్మవారి ప్రతిరూపమైన శ్రీ చక్రానికే జరుగుతుంటాయి. తరతరాలుగా పూజలందుకునే శ్రీ చక్రం ఎంతో మహిమోపేతమైంది. ఇంద్రకీలాద్రిపై బ్రహ్మాది దేవతలతో పూజలందుకునే అమ్మ శ్రీ కనకదుర్గగా కీర్తింపబడుతుంది. అలాంటిది ఆ పర్వతం మీద పరమేశ్వరుణ్ణి కూడా కొలువు వుండేలా చేయాలనే సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమ నిష్టతో శతాశ్వమేథయాగాన్ని చేయగా, అతని భక్తి శ్రద్దలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు. ఇంద్రకీలాద్రి మీద దివ్యజ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన జటాజూట దారి బ్రహ్మాను అనుగ్రహించాడు. ఆ విధంగా బ్రహ్మచే ప్రథమంగా మల్లికా పుష్పాలతో అర్పించబడిన కారణంగా స్వామికి మల్లేశ్వరుడు అనే పేరు వచ్చింది. కాలక్రమంలో కలిప్రభావం వల్ల జ్యోతిర్లింగం అంతర్నిహితమై ఉండటాన్ని చూసిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో మల్లేశ్వర లింగాన్ని పునః ప్రతిష్టించారు. అనాటి నుంచి మల్లేశ్వర స్వామికి కూడా ఎంతో వైభవంతో జనులందరిచేత అర్చించబడుతున్నాడు. చరిత్ర ప్రసిద్ధి పొందిన పట్టణం విజయవాడ.🙏