శ్రీ కామాఖ్యదేవి ఆలయం - అస్సాం : గౌహతి

P Madhav Kumar


⚜ శ్రీ కామాఖ్యదేవి ఆలయం


💠 హిందువులు పార్వ‌తీ దేవిని ఆరాధించే దేవాల‌యాల‌లో  కొన్ని స్థలాల‌ను శ‌క్తిపీఠాలు అంటారు. 

మన దేశంలో అత్యంత శక్తిమంతమైన అష్టాదశ శక్తి పీఠాల్లో అసోంలో కొలువై ఉన్న కామాఖ్యాదేవి క్షేత్రం ఒకటి. 


🔅 పురాణ గాథ 🔅


💠 దక్షప్రజాపతి పరమేశ్వరుణ్ని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు, వచ్చిన కూతురిని అవమానిస్తాడు. సహించలేని ఆమె యజ్ఞ గుండంలో దూకి అగ్నికి ఆహుతై పోతుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. విరాగిలా మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండటం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీమహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అమ్మవారి యోని భాగం గౌహతీ వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. 

ఈ ప్రాంతంలోనే కామాఖ్యదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. 


💠 కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని , శివుడు ఇక్కడ అమ్మవారితో కామకేళిలో తేలియాడుతూ ఉంటాడని అంటారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు.

అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. 

గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. 

సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది.


💠 ఏటా వేసవికాలంలో 3 రోజులపాటు,

అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ 3 రోజులు ఆలయం మూసి ఉంచుతారు.

 ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు. 4 రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ నివసించేవారు దీనిని 'అంబుబాషి’ సమయం అని అంటారు. 

5వ రోజు దేవాలయం తెరుస్తారు. 

అంబుబాషి రోజులలో  గౌహతిలో అమ్మవారి దేవాలయములతో పాటు మిగతా దేవాలయములు అన్ని మూసే ఉంచుతారు.


💠 అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. 


⚜ స్థల పురాణం ⚜


💠 పూర్వం కూచ్‌ బెహర్‌ రాజా విశ్వసింహ 

నీలాచలంపైకి వస్తాడు. 

దగ్గరలో కనిపించే మట్టిదిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. 

తన రాజ్యంలో కరవు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు. అనుకున్నట్లుగానే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టిదిబ్బ తవ్విస్తుండగా కామాఖ్యాదేవి రాతిశిల బయటపడుతుంది. 

ఆ తల్లిని అక్కడే కొలువుదీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు.


💠 ఈ ఆలయాన్ని కాలపహార్‌ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయటంతో చిలయ్‌రాయ్‌ పునర్నిర్మించారు. 

తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదానికి ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. ఆలయ ప్రవేశాన్ని కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.


💠 మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలులు సర్వసాధారణం. మరెక్కడా లేనివిధంగా ఇక్కడ మహిషాలను సైతం బలిస్తారు.

ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక, పావురం మొదలగునవన్నీ నలుపు రంగులో ఉండాలి. అమ్మవారికి అన్నీ నల్లటి జంతువులనే బలి ఇవ్వాలి. ఇదే ఇక్కడ ఆచారం. ఆడ  జంతువులను వధించరాదని నియమము.

 

💠 సంధ్యావేళ దాటిన తరవాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడా ఉంది. అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు.


💠 అమ్మవారి ఆలయ ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఇది ఎంతో శక్తిమంతమైందని భక్తుల విశ్వాసం. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. ఇందులో నీరు ఎరుపురంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మ వారి యోని స్రావిత పవిత్ర జలలాతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మ హత్యా పాతకమైనా నివారణ మవుతుందని విశ్వాసం.


💠  ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాల భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినియై దర్శనమిస్తుంది. 

పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది.

 ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు.


💠 గౌహతి రైల్వేస్టేషన్‌ నుంచి 6 కి.మీ దూరం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat