⚜️ తిరువాభరణం ⚜️
మకరజ్యోతి కనిపించే ముందు శ్రీ అయ్యప్పస్వామి వారికి తిరువాభరణములు' అలంకరించటం సాంప్రదాయం. ఆనాడు పందళ మహారాజు రాజశేఖరునకు ఇచ్చిన మాట ప్రకారము నేటికీ ఈ కార్యక్రమమును ఆ రాజవంశీయుల పర్యవేక్షణలో జరుగును. పందళంలోని రాజవంశీయుల కుటుంబములో ఈ తిరువాభరణపు పెట్టెలు వుంటాయి. పందళం వెళితే మనం చూడవచ్చును. మకర సంక్రాంతికి ముందుగా దేవస్థానం అధికారులకు పందళం రాజవంశీయులు వారి ఆధీనంలోని తిరువాభరణపు పెట్టెలు స్వాధీనం చేస్తారు. తరువాత ఒక సంవత్సరకాలము పూర్తి
నియమనిష్టలతో వుండే వాహకులు ఈ తిరువాభరణపు పెట్టెలు మోస్తారు. మొదట శబరిమలైకి 88 కి.మీ. దూరములో నున్న పందళంలోని *“వెలయకోయికెల్ ధర్మశాస్తా"* ఆలయంలో వుంచి పూజలు చేసి ,
జనులదర్శనానికి వుంచుతారు. జనవరి
12 మధ్యాహ్నాం పోలీసు బందోబస్తుతో పూజచేసిన తర్వాత తిరువాభరణాల ఊరేగింపు ప్రారంభమౌతుంది. మొదటి రోజు రాత్రి *“అయిరూరు పుదియన్ కావు"* దేవాలయంలో గడపుతారు. జనవరి 13 ఉదయమే పూజ జేసి ప్రారంభమైన ఊరేగింపు మధ్యాహ్నానికి *"పెరువట్టాల్"* దేవస్థానంలో కాసేపు విశ్రాంతి తీసికొని , పూజ అయిన తర్వాత ముందుకు సాగుతుంది. ఆ రాత్రి *'లాహ'* ఎస్టేట్ లో విశ్రాంతి తీసుకుంటారు. జనవరి 14 ఉదయం పూజచేసి , కొంత ప్రయాణం చేసిన తర్వాత *“నీలక్కల్"* శివమందిరంలో కొద్దిసేపు ఆగి , పూజ అయిన తర్వాత *"సిరియాన వట్టమ్* (శ్రీ మణికంఠుడు బాలుడుగా దొరికిన స్థలము) లో కాసేపు విశ్రమించి సాంప్రదాయక పూజలు చేసి , అడవిదారి ద్వారా శబరి పీఠాన్ని చేరుతారు. అక్కడ దేవస్థానం అధికారులు పూజలు చేసి , తిరువాభరణం ఊరేగింపుకు స్వాగతం పలుకుతారు. ఊరేగింపు వాయిద్యగోష్టులతో , శరణుఘోషలతో వైభవంగా సాగుతుంది.
ఈ తిరువాభరణం పెట్టెలు శబరి పీఠమునకు కొద్ధిసేపటిలో వస్తాయనగా ఆకాశంలో రెండు గరుడ పక్షులు ఎగురుతూ కన్పిస్తాయి. అవి అలా గాలిలో ఎగురుకుంటూ పోయి సన్నిధానము చేరి , స్వామి వారి దేవాలయ శిఖరముపై ప్రదక్షిణ చేసి తిరిగి వెళ్ళిపోతాయి. సాక్షాత్తూ అనంత పద్మనాభస్వామి తనవాహనమైన గరుత్మంతునిపై , తన కుమారుని దర్శించుకోవటానికి వత్తురని భక్తుల విశ్వాసము.
ముఖ్యంగా పేట తుళ్ళిలో ప్రముఖులైన అలంఘాట్ వారు ఈ గరుడపక్షలు ఆకాశములో కన్పించనిచో వాళ్ళు ఇరుముడులు స్వామి వారికి నివేదించరట . అనంత పద్మనాభ స్వామి , అంటే శ్రీ మహావిష్ణువు రాలేదు కనుక ఇరుముడిని సమర్పించటంలో విలువేముందని వాళ్ళు వెళ్ళిపోతారట. నిజంగా అనుభవములో చాలా మందిని విచారిస్తే శబరిమలలో ఇతర సమయములలో అలాటి పక్షుల జోడి కన్పించదు. మరి విచిత్రంగా , భగవల్లీలగా , నేనున్నానని ప్రత్యక్ష సాక్ష్యం భగవంతుడు ఇస్తున్నాడన్నట్లుగా ఆ గరుడపక్షులు ఆ సమయంలో రావటము శబరిగిరీశునికి ప్రత్యక్ష నిదర్శనం కాక ఇంకేముంటుంది ? ఆ పక్షులు వెళ్లిపోతుండగానే దారిలో గల భక్తులు తిరువాభరణపు పెట్టెలు వస్తున్నాయని తెలుసుకొని , శరణుఘోష దద్దరిల్లుతుండా , ఎక్కడికక్కడే స్వామివారికి హారతులివ్వాలని కర్పూర జ్యోతులు వెలిగించి శరణాలు చెబుతు దారి పొడవునా ఉత్కంఠతో నిలుచుని ఎదురు చూస్తుంటారు. ఆ పెట్టెలు రాగానే వాటిని దర్శించాలని , తాకాలని , ఒకరికొకరు పోటీపడి ముందుకు నెట్టుకుంటూ శరణఘోషలు చేస్తూ ఒళ్ళు మరిచిపోయి కేకలు వేస్తు పరుగులు తీస్తుంటారు. ఇక ఆభరణాల పెట్టెలు మోసేవారికి చూస్తుంటే మహాశ్చర్యం వేస్తుంది. అంతటి పెద్ద పెట్టెలను అవలీలగా మోస్తూ చేతులతో పట్టుకోకుండా విన్యాసాలు చేస్తు వారు పరుగులతో వస్తుంటే , చూసేవారి శరీరము
గగుర్పొడుస్తుంది.
సన్నిధానంలో మధ్యాహ్నం 12 గంటలకే దర్శనము నిలిపివేసి , పదునెట్టాంబడి వరకు శుభ్రముచేసి ముగ్గులు పెడతారు. భక్తులు దారికిరువైపులా శరణుఘోష సల్పుతూ కర్పూర జ్యోతులు ప్రకాశింపచేస్తుండగా తిరువాభరణపు పెట్టెలు తీసుకువచ్చి పదునెట్టాంబడి నధిరోహించి , స్వామివారి దేవళములో ప్రవేశించగానే తలుపులు మూస్తారు. కొద్ధి సేపు పూజ అనంతరము సరిగా 5-15 నుండి 6 గంటలు సంధ్యా సమయములో భళ్ళున గలగలమంటూ గంటలు మ్రోగుచుండగా తలుపులు తెరుచుకుంటాయి. స్వామికిక కర్పూర హారతి ఇస్తూ స్వామిని సేవిస్తుంటారు. సరిగా అదే సమయములో కాంతమలలో కొండశిఖరముపై జ్యోతి దర్శనం అవుతుంది. జ్యోతిదర్శనమునకు కొద్ది నిముషముల ముందుగా ఆకాశంలో , కాంతమల కొండ శిఖరముపై ఒక నక్షత్రము కన్పిస్తుంది. కొద్దిసేపు ఆ నక్షత్రము కన్పించి కనుమరుగవగానే జ్యోతి కనిపిస్తుంది. ఎపుడైతే నక్షత్రం కనిపిస్తుందో అది సంకేతంగా భావించి స్వాములందరూ శరణుఘోష బిగ్గరగా చెబుతూ , తమ వద్దగల కర్పూర జ్యోతులను స్వామికి అర్పించటానికి వెలిగించి సిద్ధంగా వుంటారు. ఊపిరి బిగపట్టి , గుండెలు పగిలే ఉత్కంఠతో జ్యోతి దర్శనం కోసం ఏ మాత్రం చూపు మరల్చకుండా ఆ కాంతమల శిఖరము వైపే దృష్టి సారించి ఉంటారు. జ్యోతి కనిపిస్తుంది. ఒకటే కోలాహలం శరణుఘోష , కర్పూర జ్వాలలు , మేళాలు , తాళాలు , ఒకటేమిటి ? శరణుఘోషతో శబరిమల ప్రతి ధ్వనించిపోతుంది. ఓ క్షణం కనిపించిన జ్యోతి అదృశ్యమై పోతుంది కొద్ది క్షణాలలో మరలా కన్పిస్తుంది. ఇనుమడించిన భక్త్యావేశంతో స్వాములు శరణుఘోష సల్పుతూ , కర్పూర జ్యోతులు వెలిగించి తనవితీరా జ్యోతిని దర్శించుకున్న తృప్తితో యిక బయలుదేరుతారు. కొద్ది విరామం తరువాత తిరువాభరణములతో
అలంకరించిన స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆఖరిసారిగా దర్శించుకొని , తిరిగి మిమ్ము దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించు స్వామి ! అంటూ ప్రార్థించి వెనుతిరుగుతారు. నిజంగా జ్యోతిదర్శనం మాటలకు అందని ఓ గొప్ప మధురానుభూతి ! ప్రతివారి హృదయములోను యాత్ర పరిపూర్ణ ఫలిత మొసంగిన తృప్తి ఏర్పడును.
పిదప కన్నెస్వాములు వచ్చి యున్నారా యని పరిశీలించుటకు బయలుదేరు మాళికాపురం అమ్మవారి ఊరేగింపులో పాల్గొని , మకర విళక్కు అను దీపమును , అమ్మవారి పట్టపుటేనుగును దర్శించి , ఇరుముడితో స్వామివారి దర్శనమునకుపోయి , తిరువాభరణము లతో స్వామివారిని దర్శించి , మెట్ల మీద తిరుగుపడి కాయ కొట్టి వెనకవైపుగా స్వామివారిని చూస్తు పయనమయ్యెదరు.. (మహిషిని సంహరించగానే , మహిషి శరీరము నుండి లీలావతి ఉద్భవించి అయ్యప్ప స్వామి వారిని , వివాహమాడ వలసినదిగా కోరినదనీ ఆయన అందుకని నిరాకరించి , తన కోవెలలో మంజమాతగా పూజలందుకోవలసినదని , ఏ సంవత్సరము తనను దర్శించుటకు కన్నెస్వాములురారో అపుడు ఆమెను వివాహం చేసుకుంటానని మాటయిచ్చాడని ఐతిహ్యం. (అందుకే ఈ సాంప్రదాయాన్ని అక్కడ కొనసాగిస్తున్నారట).
🙏🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌸🙏