ఈ పదునెనిమిది మెట్లు బోధించేది ఏమిటి ?
జ్ఞానేంద్రియములు ఐదు అవి
శ్రోత్ర ,
త్వక్ ,
చక్షు ,
జిహ్వ ,
ఫ్రూణులు.
*కర్మేంద్రియములు ఐదు.* అవి
వాక్ ,
పాణి ,
పాద ,
ఉపస్త ,
వాయువు.
పంచకోశము ఐదు అవి
అన్నమయ ,
ప్రాణమయ ,
మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు ,
*త్రిగుణములు మూడు.* అవి
సత్వ ,
రజ ,
స్తమోగుణములు. మొత్తము కలిపి ఈ
పదునెనిమిదిని జయించి , ఆ మెట్లను అధిరోహించిన వారికి మాత్రమే కలుగు
జ్ఞానమే ఉన్నతియనియు , ఒకటే అనియూ , గోచరింపచేయు *"సత్"* లేక *"ఆత్మ"* లేక *“పరబ్రహ్మ సాక్షాత్కారము".*
ఇదియే శ్రీ స్వామి అయ్యప్ప ముంగిట వెలసియున్న పదునెనిమిది మెట్ల
అంతరార్థము. పై చెప్పబడిన పదునెనిమిదియు. పద్దెనిమిది మెట్లుగా తత్వార్థ బోధనా సోపానములై ప్రశోభిల్లు చున్నది. వీటిని అధిరోహించగనే *“తత్వమసి"* (అదియే నీవైయున్నావు) అను వేదవాక్యమును వివరిస్తూ ప్రకాశిస్తున్నాడు స్వామి అయ్యప్ప.
నిత్యమై , సత్యమై తాను మాత్రమే శాశ్వతముగా గల సచ్చిదానంద స్వరూపుడై యున్నాడు స్వామి అయ్యప్ప. మానవుడు జన్మతః కామ , క్రోధాదులనబడు పదునెనిమిది దుర్గుణ పూరితుడట. ఏటేట మండల కాల దీక్షతో శ్రీ స్వామి అయ్యప్ప
కొండకు యాత్ర జేసి ఆ పావన పదునెట్టాంబడి దాటువేళ ఒక్కొక్క దుర్గుణము వదలి ఒక్కొక్క సత్వగుణము అభ్యాసమై పదునెనిమిది సంవత్సరములు యాత్ర చేసినవారు సిద్ధపురుషులై *“ముముక్షువు"* లగుతారనుట అనాదిగా శబరి యాత్రీకులలో యుండు విశ్వాసము. పదునెనిమిది సంవత్సరములు ఆ పదినెట్టాంబడిని దాటి శ్రీస్వామి వారిని దర్శించిన వారు తమ పదునెనిమిదో యాత్రలో ఒక కొబ్బరి చెట్టును శబరిమలకు తెచ్చినాటుదురు. నేడు శబరిమలలో మనకు కనిపించే కొబ్బరి
చెట్లన్నియు ఇలా పదునెనిమిది సంవత్సరములు త్రికరణశుద్ధిగా (మనోవాక్కాయ కర్మలా) యాత్ర చేసిన మహనీయులు నాటినవే. ఇచ్చట మనము శబరిగిరి యాత్రకు దీక్ష లేక చేయు అయ్యప్ప స్వామివారి దర్శనమునకు గల వ్యత్యాసమును విడమరచి తెలుసుకొనగలిగిన బాగుండును. శబరిగిరీశ్వరుడైన శ్రీ అయ్యప్పస్వామివారిని దర్శించుటకు భువిపైన చీమ మొదలు బ్రహ్మాండము వరకు ఎల్లరూ అర్హులే. ఇందులకు ప్రత్యేకమైన నిష్టా నియమము లేవియు అవసరము లేదు.
సరాసరి వారి వారి శక్తి కొలది కేరళదేశము వెడలి పంబలో స్నానమాడి సన్నిధానపు ఉత్తర , పశ్చిమమెట్ల ద్వారా ఎక్కి శ్రీ స్వామి వారిని దర్శించి ధన్యులు గావచ్చును. కాని పావన పదునెనిమిది మెట్ల నధిరోహించి వెళ్ళి శ్రీస్వామివారిని
దర్శించేందుకు మాత్రమే మాలాధారణ , మండలకాల బ్రహ్మ చర్యము , ఇరుముడి అవశ్యకమని చెప్పబడియున్నది. అలా మండలకాలము వ్రతదీక్ష యుండలేనివారు శ్రీ స్వామి దర్శనార్ధులై వచ్చువారు వెనుక మెట్ల ద్వారా దర్శించవచ్చుననియే చెప్పబడినది. కాని అర్ధమండలం పావు మండలం అని దీక్ష వుండి శబరియాత్ర చేయువారిపై శ్రీ అయ్యప్పస్వామివారు ఆగ్రహించకపోయినా ఆ పదినెట్టాంబడి దేవతలు *"అహో ! ఇతడు మండల కాలవ్రత దీక్షలేక శ్రీ స్వామివారి పాదంసోకిన నాపై కాలుమోపినాడే యని అలిగిపోవుటకు అవకాశ మివ్వకూడదనియే పెద్దల ఆకాంక్ష , అలా మండలకాల బ్రహ్మచర్య వ్రతధారులై ఇరుముడిమోసి కాలినడకగా శబరికొండకు
చేరు భక్తాదుల మధ్య యవ్వనదశలో యున్న స్త్రీలు కనిపిస్తే వారికి వ్రతభంగము (దర్శన స్పర్శన మాత్రముచే) కలుగుటకు అవకాశ మున్నది గనుకనే ఋతుచక్రం ఆగని స్త్రీలు శబరిగిరికి రాకూడదను విధిని ఏర్పరచియున్నారు.
అదియుగాక ఈ వనయాత్ర మిక్కిలి కఠినమైన కష్టనష్టాలతో గూడినది కావున సున్నితమైన స్త్రీ శరీరము ఈ కష్టములను ఓర్చుకోలేదను సదుద్దేశ్యమే ఇందులోని సూక్ష్మభావం. అంతేగాని స్త్రీలను నిషేధవస్తువుగా భావించి శబరిమలై వ్రతదీక్షకు నిషేధించారనుటలో ఎట్టి వాస్తవం లేదు. మండల కాల బ్రహ్మ చర్యముతో ఇరుముడి మోసివచ్చే వారికే ఆ పదునెట్టాంబడిని అధి రోహించే అర్హత కలదు అన్నారు. ఇది ఆ పదునెనిమిది దేవతలకు మనం చూపించే మర్యాద. మర్యాద అన్నది ఇచ్చిపుచ్చుకొన వలసిన విషయము గనుక మిక్కిలి భయభక్తి విశ్వాస ఆచార అనుష్టానములతో క్రమంగా మండలకాల బ్రహ్మచర్య వ్రతమాచరించి స్వామి కోవెల ముంగిట దేవతా మెట్లుగా వెలసియున్న పదు నెనిమిది దేవతలపై కాలుమోపి అధిరోహించి శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించి తరించే మర్యాదస్తులకు జీవితమున సకల సౌభాగ్యములతో గూడిన గౌరవమైన జీవితం లభిస్తుందనుటలో ఎట్టి సందేహము లేదు.
🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🪷🙏