🙏🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం-2*
*ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా!*
*రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా!!*
🙏🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
*"ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం."*
*జగత్సృష్టివేళ-సృజనస్వరూప,*
*రక్షణవేళ -పాలనస్వరూప,* *సంహారవేళ - రౌద్రస్వరూప.*
*పరా - పశ్యంతీ - మధ్యమా - వైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనుక త్రిమూర్తిసంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్‌శక్తిని అనుగ్రహించుగాక !*
ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి, నరనారాయణులకు శిరసు వంచి, సరస్వతీదేవినీ వ్యాసమహర్షినీ అభినుతించి పురాణం ప్రారంభించాలి.
నైమిశారణ్యంలో సమావిష్టులైన బుషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు.
సూతమహర్షీ! నువ్వు వందల సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి. మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణుకథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన - ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమూ
అనాయాసంగా భుక్తిముక్తిప్రదమూ అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు.
శౌనకాది మహామునీశ్వరులారా ! అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు. కనక *సర్వశాస్త్రసారమూ పరమపావనమూ దేవీభాగవతం* వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలూ తీర్థాలూ వ్రతాలూ మిడిసిపడేది. ఈ దేవీభాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి. గాఢ కిల్బిషతమస్సులకు పొద్దుపాడుపు. వినిపిస్తాను.
సూతమహర్షీ ! తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం. విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ఎన్ని రోజుల్లో వినాలి ? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరెవరు విన్నారు ? ఏమేమి ఫలాలు పొందారు ? ఎవరు వినిపించారు ?
మునీశ్వరులారా ! విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేనివారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి
తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు. చదివించాడు. వాటిలో దేవీభాగవతం - ఉత్తమోత్తమ పురాణం. భుక్తిముక్తిప్రదం. దీన్ని స్వయంగా
వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు.
ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిన్మహారాజు. ఒక మునిశాపం కారణంగా తక్షకసర్పదష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీభాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు. తొమ్మిదిరోజులు దీక్షగా జరిగింది ఈ పురాణశ్రవణం. అటు పైని దేవీయజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్యరూపధరుడై దేవీసాలోక్యం పొందాడు. తండ్రికి ఉత్తమగతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్జి అర్చించి ఆనందాన్నీ అపూర్వమైన సంతృప్పిని పొందాడు.
🙏 *ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధపురుషార్థాలనూ తేలికగా ప్రసాదించే పురాణరాజం దేవీభాగవతం. ఈ దేవీగాథను భక్తితో విన్నవారికి సకలసిద్ధులూ కరతలామలకాలు. అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి. ఒకరోజు విన్నా, ఒకపూట విన్నా, ఒక ముహూర్తంసేపు విన్నా, క్షణకాలం విన్నా, భక్తితో వింటేచాలు, వారికి ఇంక ఏ దుర్గతీ దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ - సర్వతీర్థ - సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణశ్రవణంతో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణశ్రవణమొక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు అన్ని ధర్మాలూ ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచారవిహీనులు అవుతారనీ, అల్ప్బాయుష్కులనీ గ్రహించిన వ్యాసభగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. దీన్ని రవ్వంత గ్రోలితేచాలు అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు. వంశాలు అజరామరం అవుతాయి.*
ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి - ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చు. మానవులైతే చాలు అందరు వినవచ్చు.
*మాసానాం నియమో నాత్ర దినానాం నియమో౬పి వా!*
*సదా సేవ్యం సదా సేవ్యం దేవీభాగవతం నరైః!!*
(దే. భా. మా. 1-30)
దేవీ నవరాత్రాలలో నవాహయజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు, గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి
పరమపవిత్రులవుతారు. ఉగ్రతపస్సులతో గానీ, తీర్ధసేవలతో గానీ, రకరకాల దానాలతో గానీ, యజ్ఞయాగాదులతో గానీ లభించని పుణ్యఫలం ఈ నవాహదీక్షతో లభిస్తుంది. గంగ -గయ - కాశి - నైమిశం - మథుర - పుష్కరం - బదరికాశ్రమం - ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహభాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని *దేవీమఖం - దేవీయజ్ఞం* అన్నారు.
ఆశ్వయుజమాసంలో శుక్షపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమినాడు శ్రీమన్మహాదేవిని హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్రాహ్మణుడికి ఈ దేవీభాగవత గ్రంథాన్ని బహూకరిస్తే ఆ పుణ్యఫలం ఇంతాఅంతా కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీసాలోక్యం పొందుతాడు. దేవీభాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని గానీ, శ్లోకభాగాన్నిగానీ, ఒక పుటనుగానీ, పుటలో కొంత భాగాన్ని గానీ నిత్యమూ భక్తితో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అటువంటిది, మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్ళకునభయం,
దుస్స్వప్నభయం, మహామారీభయం, మరణభయం - సమస్తమూ తొలగిపోతాయి. బాలగ్రహ - భూతప్రేత పీడలన్నీ దేవీభాగవతం పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధపురుషార్ధాలతో విజయపరంపరలతో ఆ గృహమూ ఆ గృహస్థుడూ, ఆ వంశమూ ఆ వంశస్థులూ తరతరాలకూ విరాజిల్లుతారు.
శ్యమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెదుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకూ తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అటమటించిన వసుదేవుడు దేవీభాగవతాన్ని నవాహదీక్షగా ఆలకించాడు. అది ముగిసే సరికి
శ్రీకృష్ణుడు విజయలక్ష్మీ సనాథుడై తిరిగివచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణశ్రవణం. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు. నిర్ధనులకు సంపదలు లభిస్తాయి. రోగిష్టులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గొడ్రాళ్ళు సంతానవతులవుతారు. దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్ధం. అ ఇంటిలోని వారంతా పరమపావనులు. వారికి ఏ కష్టమూ ఏ దుఃఖమూ ఎప్పుడూ రాదు. అపజయమనేదే ఉండదు.
*అష్టమి - నవమి - చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించినవారు మహాదేవికి అత్యంతప్రియులూ ఆప్తులూ అవుతారు.* ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణీపతి అవుతాడు. వైశ్యుడు అనంతసంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడూ పరమపూజ్యుడూ అవుతాడు.
*(శ్రీ స్కాందపురాణం - మానసఖండం - శ్రీదేవీభాగవత మాహాత్మ్యం. అధ్యాయం - 1, శ్లోకాలు - 50).*
సూతుడు ఇలా చెప్పేసరికి శౌానకాదిమహర్షులు మరొక ప్రశ్న వేశారు. సూతర్షీ! శ్యమంతకమణి
అన్నావు, ప్రసేనుడన్నావు, శ్రీకృష్ణుడన్నావు, అపవాదు అన్నావు ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవీభాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజెయ్యి - అని అభ్యర్థించారు. సూతుడు సరే అని వివరించాడు -
మహర్షులారా! భోజవంశంలో పుట్టిన సత్రాజిత్తు ద్వారవతిలో ఉంటూ సూర్యుణ్ణి ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. సూర్యుడిచ్చిన శ్యమంతకమణిని సగర్వంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన సుధర్మసభలో అందరి ఎదుటా అతిథిమర్యాదలు జరిపి సమ్మానించాడు. ఆ సందర్భంలో అతడు తన శ్యమంతకమణిని గురించి అందరికీ వివరించాడు, దాన్ని సూర్యుడు బహూకరించాడనీ, రోజుకి ఎనిమిదిబారువుల బంగారం ప్రసవిస్తుందనీ, రోగపీడలను తొలగిస్తుందనీ చెప్పాడు. అందరూ విని అనందించి అభినందించి పంపించారు.
సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం ఆ మణిని మాంసంముద్ద అనుకుని ప్రసేనుణ్జి సంహరించి అపహారించింది. ఆ సింహాన్ని భల్లూకరాజు జాంబవంతుడు మట్టుబెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశంచాడు. అక్కడ తన బాలుడికి క్రీడావస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్లిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు. మణికోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు. అది ఆనోటా ఆనోటా పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది. ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్ళి
ప్రసేనుడిని అన్వేషించాడు. మృతదేహం కనిపించింది. దాని ప్రక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. అటు పైని భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్త బిందువులతో వాటిని పోల్చుకుంటూ
గుహదగ్గరికి చేరుకున్నారు. పౌరులనందరినీ అక్కడే ఆగిపొమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడూ గుహలోకి ప్రవేశించాడు. మణితో క్రీడిస్తున్న బాలుణ్ణి చూశాడు. ఆ మణిని అందుకోబోయాడు. దాది చూసింది. భయపడి అరిచింది. జాంబవంతుడు గుహలోపలి నుంచి ఒక్కదూకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు. మూడు నవరాత్రుల కాలం ఘోరయుద్ధం సాగింది.
గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు పన్నెండురోజులపాటు వేచి వేచి విసుగెత్తి ద్వారకకు
వెళ్ళిపోయారు. జరిగినదంతా అందరికీ చెప్పారు. పౌరులు తలకొకరకంగా భావించారు. సత్రాబిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుణ్ణి పోగొట్టుకున్నామని విలపించారు.
వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది. ఎంతగానో దుఃఖించాడు. బంధువులందరు' శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంనుంచి కోలుకోవడం ఎలాగ ? మళ్ళీ మామూలు మనిషిని కాగలనా ? అని
వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారదమహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురువెళ్ళి నమస్కరించి తెచ్చి అతిథిమర్యాదలు జరిపాడు. నారదుడు కుశలప్రశ్నలు వేసి,
ఏమిటి కారణం అదోలా ఉన్నావు, చింతావ్యాకులితంగా కనపడుతున్నావు చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగినదంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు - నా ప్రియపుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులుపడుతున్నాను.
చాలా రోజులు గడిచిపోయాయి. మావాడి జాడ తెలియడం లేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు
మహానుభావా ! - అని వసుదేవుడు ప్రార్థించాడు.
వసుదేవా ! దిగులుపడకు. జగదంబికను ఆరాధించు. వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది.
మహర్షీ! ఎవరు ఈ జగదంబిక ? ఆవిడ ప్రభావం ఏమిటి ? ఎలా ఆరాధించాలి ? నువ్వు
కృపామూర్తివి. వివరంగా చెప్పి నన్ను ఈ శోకసముద్రం నుంచి ఉద్ధరించు.
వసుదేవా ! క్లుప్తంగా చెబుతాను, ఆలకించు. దేవీమహిమ అనంతం. ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానందరూపిణి. *నిత్య. సత్య. పరాత్పర.* ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వల్లనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. మధుకైటభుల బారినుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణాకటాక్ష మహిమయే. ఈ సంసార బంధానికీ బంధవిముక్తికీ కారణం ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి. పరవిద్యాస్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహదీక్షతో దేవీభాగవతం పురాణశ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీముందు ఉంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివినవారికీ విన్నవారికీ ముక్తి అనేది తంగేటి జున్ను.
నారదా ! నీ మాటలు వింటూంటే జ్ఞాపకం వచ్చింది. అవును. నాకు తెలిసిన ఒక దేవీమహిమ చెబుతాను, విను. దేవకీదేవికి ఎనిమిదవ సంతానంగా జన్మించినవాడి చేతిలో కంసుడు మరణిస్తాడు అని అలనాడు అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్నూ దేవకినీ కారాగారంలో బంధించి, పుట్టిన శిశువును పుట్టినట్టు ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్ళు విలపించింది. అప్పుడొక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రుడినైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు, అదే తరణోపాయం, ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. నేను కారాగారంలో ఉన్నాను, ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నురాలిని చెయ్యి అని అభ్యర్థించాను. గర్గుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమయ్యింది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీమహావిష్ణువు దేవకీవసుదేవులకు అష్టమగర్భంగా జన్మిస్తాడు. పుట్టినవెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి, అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిలిలో పరుండబెట్టాలి. ఈ పని చెయ్యవలసింది మీ ఆనకదుందుభియే (వసుదేవుడే). కంసుడు ఆడ శిశువును
నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఈ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా! ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యం. దీనికి తిరుగులేదు - అని దుర్గాదేవి ప్రసన్నచిత్తంతో పలికిందిట. గర్గుడు మథురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులం ఎంతో సంతోషించాం. ఆ తరవాత అన్నీ ఆ తల్లి చెప్పినట్టే జరిగాయి.
నారదా ! అప్పటికిప్పుడు మళ్ళీ దేవీమహిమను గురించి వింటున్నాను. అందుచేత, దయచేసి నువ్వే ఆ దేవీభాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుణ్ణి నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టంకొద్దీ ఈ రోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోక పురాణశ్రవణం చేయించు.
వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచిరోజున మంచి ముహూర్తాన దేవీభాగవత పురాణప్రవచనం ఆరంభించాడు. నిర్విఘ్న పరిసమాప్తికోసం బ్రాహ్మణులు వినాయక పూజలు చేసి నవాక్షరమహాదేవీ మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు పఠించారు. *ప్రథమ స్కంధంతో ఆరంభించి నవాహదీక్షతో పన్నెండు స్కంధాలూ ప్రవచనం పూర్తిచేశాడు నారదుడు.* వసుదేవుడు భక్తిశద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. తొమ్మిదవ రోజున పురాణం పూర్తికాగానే ప్రసన్నచిత్తంతో నారదుడికి పూజాసత్కారాలు జరిపాడు.
గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. విశ్లథితాంగుడై నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుడిని భగవంతుడుగా గుర్తించగలిగాడు. భక్తితో శిరసువంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్ళమీద పడ్డాడు. మహానుభావా ! గుర్తించాను. నువ్వు భగవంతుడివి. నా రాముడివి, సముద్రానికి సేతువు నిర్మించి లంకాపట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషం గుర్తుకి వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే. శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశాను. క్షమించు. మనసారా క్షమించు. నేను నీ భృత్యుణ్ణి. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు.
బుక్షరాజా | శ్యమంతకమణి కోసం నేను ఈ బిలంలోకి వచ్చాను - అన్నాడు ముక్తసరిగా శ్రీకృష్ణుడు. అనడమేమిటి జాంబవంతుడు మణితోపాటు తన కన్యామణి జాంబవతిని కూడా కృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ధ్యపాద్యాదులతో అర్చించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారవతికి చేరుకున్నాడు.
దేవీభాగవత శ్రవణం పూర్తిచేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్ళకి గుమ్మంలో
శ్రీకృష్ణుడు శ్యమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు
పులకించింది. కన్నుల్లో ఆనందబాష్పాలు, శ్రీకృష్ణుడి రాకతో నారదుడూ సంతోషించి, అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు.
శౌనకాది మహామునులారా ! ఇది హరిచరిత. దీన్ని చదివినవారికీ విన్నవారికి అపవాదులు
అపయశస్సులూ తొలగి సుఖసంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరికలన్నీ తీరతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది.
*(శ్రీస్కాందపురాణం - మానసఖండం - శ్రీదేవీభాగవత మాహాత్మ్యం. అధ్యాయం - 2, శ్లోకాలు - 82)*
దేవీ భాగవత మాహాత్మ్యాన్ని తెలియజెప్పే మరొక ఇతిహాసం ఉంది. అదికూడా వినిపిస్తాను శద్ధగా వినండి అంటూ సూతమహర్షి కొనసాగించాడు.
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
🙏 శ్రీ మాత్రే నమః🙏
*శ్రీదేవీభాగవతము - 2*
September 16, 2023
Tags