శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 12 వ భాగము

P Madhav Kumar


షెహజాదా పునర్జీవితుడగుట:


శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి తమ యాశ్రమపరివారము ను తోడ్కొని ఆశ్రమస్థాపన కు అనువైన ప్రదేశమును వెదకుటకై కుంభకోణము నుండి బయలు దేరిరి. వారు హుబ్లీనగరమును  

జేరిరి. హుబ్లీ ప్రదేశము అత్యంత సుందరము. ఫలవృక్షములతో, ఉద్యాన వనములతో, పచ్చని పంట పొలములతో, స్వచ్ఛ జలాశయములతో నిండి భూతలస్వర్గము వలె నుండెను. ఆప్రదేశములోనే కృష్ణపురమను గ్రామము కలదు. ధార్వారు ప్రాంత మంతయు సవణూరు నవాబు పాలనలో నుండెను. 


కృష్ణపురములో నవాబు ఒక సుందరోద్యానవనము ను నిర్మించి దానిలో వసంత మహలును కట్టించెను. నవాబు వేసవి కాలములో ఈ వసంత మహలులోనే కుటుంబ సహితముగ నివసించును.


మఠపరివారము విడిదిచేయుట:


అది మండువేసవి. శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి తనపరివారముతో పయ నించుచు నవాబు యొక్క ఉద్యానవనమునకు అపరాహ్ణవేళ అరుదెంచిరి. మఠపరివారము విడిది చేయుటకు   అనువైన ప్రదేశమును వెదకుచు నవాబు యొక్క ఉద్యానవనము అందుకు దగినదనిభావించి దానిలో ప్రవేశించెను. శ్రీరాఘ వేంద్ర స్వామి యెట్టి సంకోచము ను లేక తన పరివారము తో ఉద్యానవన ప్రవేశము చేయుచుండగ వన  రక్షకులు అడ్డగింపక ఆయన దివ్యరూపమును వీక్షించుచు నిలువబడిరి, ఆమహాత్ముని తేజోమయ విగ్రహమును గాంచి మహమ్మదీయ   సైనికులు  అత్యంత ఆశ్చర్యచకితు లైరి. కానీ యెందులకో వారిముఖము లన్నియు గ్లాని చెందియున్నవి. వారందరు చింతాకాంతులై దీనులై గోచరించిరి.


శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి ఒక విశాల వటవృక్ష ఛాయలో ఆసీనులు కాగా పరివారము పూజకొఱకు ప్రసాదము కొఱకు నేర్పాటుగావింపసాగిరి. ఆ వసంతమహలులో విడిది చేసియున్న నవాబు ఆయన భార్య ఉద్యానవన ములో నుండి వచ్చుచున్న శబ్దములను విని మహలు పైభాగమునుండి వీక్షించిరి. ఉద్యానవనములోని వృక్షములను స్పృశింపక తమ నిత్యారాథనా కృత్యములలో సంలగ్నులై యున్న వైష్ణవులను గాంచిరి. వటవృక్ష ఛాయలో ఆశీనుడై యున్న స్వామినిగాంచి అతడు సామాన్యుడు కాడని యతీంద్రులని గ్రహించిరి. ఆ సమయమున వారు తమ ఏకైక పుత్రుడు మరణింపగా అపార దుఃఖ సాగరములో మునిగి యుండిరి. ఈ మహాత్ము నాశ్రయించిన తమ పుత్ర వియోగదుఃఖము ఉపశ మింప గలదని  భావించి ఆ దంపతులు మహలును వీడి ఉద్యానవనమున కేతించి శ్రీవారికనేక సలా ములర్పించి దుఃఖింప నారంభించిరి. 


అపారదుఃఖముతో విషణ్ణ వదనులై తనసమక్షమున నిలువబడియున్న నవాబు

దంపతులను గాంచి శ్రీవారు వారిని పుత్రపౌత్రా భివృద్ధిరస్తు యని ఆశీర్వ దించి, వారి దుఃఖమునకు కారణమడిగిరి. స్వామి వారి ఆశీర్వచనము లాలకించి  వారు  అమిత దుఃఖితులై దుఃఖాశ్రువులు కారుచుండగ నవాబు స్వామితో నిట్లు విన్నవించుకొనెను. "అల్లాహ్ కే బందా! నేనీ రాజ్యమునకు ప్రభువును, నాకెందఱో బేగములు (రాణులు) కలరు. కాని నాకు ఒక్కడే కుమారుడు కలడు. అతడే షెహజాదా. ఈ సామ్రాజ్యమునకతడే ఉత్తరాధికారి. వేసవి కాలమును చల్లని ప్రదేశ  మైన యీ వసంత మహలులో ఆహ్లాదముగ గడుపవలెనని నా పట్టపు రాణితోను రాజకుమారుని తోను గలసి ఈ మహలునకు   అరుదెంచి తిని. మహాత్మా! అల్లా కరుణ నాపై నుండి తొలగిపోయెను. నిన్నటి దినమున ఉద్యానవన ములో ఆటలాడు చున్న మాచిన్నారి షెహజాదా పాము కాటుకు గుఱియై విలవిలలాడుచు అసువు లను బాసెను. మా హకీము కూడ అతడు  మరణించెనని నిర్ణయిం చెను.      తదనంతరము 

ఉద్యానవనములోనే  వానిని సమాధిచేసితిమి. మేమందరము  అపార దుఃఖసముద్రమున మునిగి యున్నాము. అల్లా  -ప్రతినిధులైన మీమాట (ఆశీర్వచనము) పొల్లు పోవునా? యని పల్కి రాజు అతని పరివారము దుఃఖింప నారంభించిరి.


శ్రీరాఘవేంద్ర  తీర్థస్వామి నవాబు పల్కిన పల్కుల నాలకించి ఒక క్షణము మౌనము వహించి రాజా! యేమైననేమి మా ఆశీర్వ చనము వ్యర్థము కాదు. సర్వేశ్వరేశ్వరుడు నిన్ను కరుణించెను. మీ షెహజాదా మరణింపలేదు. వాని శరీరము ను తక్షణమే సమాధి నుండి వెలుపలికి దీయుడని పల్కెను.


శ్రీవారి యమృతవచన ముల నాలకింపగనే నవాబు, బీగము, వారి పరివారము ఆ ప్రదేశ మందు సమావేశమైయున్న సకలజనులు పరమాశ్చర్య చకితులైరి. నవాబు దుఃఖమంతయు మటు మాయమయ్యెను. అల్లా యే ఈ యతీంద్రుని స్వరూపముతో అఱుదెంచి నాడని భావించి నవాబు కొందఱి సేవకుల సాహాయ్యముతో సమాధిని తవ్వి మృత దేహమును దెచ్చి శ్రీవారిచరణముల చెంత నుంచెను. ఆ ప్రదేశమున వారందరూ ఈమృతశరీరము మఱల సజీవమగుట సంభవమా యని చింతింప నారంభించిరి. 


శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి ఆసనము నుండి లేచి కమండలములోని గంగా జలమును హస్తమునం దిడుకొని శ్రీకృష్ణమహా మంత్ర పూతములైన మంత్రాక్షతలను ఆ జలములందు చేర్చి గరుడ మంత్రమును పఠించుచు ఆదిశేషుని ధ్యానించిన వాడై ఆమంత్రాక్షతలను షెహజాదా శవముపై జల్లెను.


ఆహా! ఏమి ఆశ్చర్యము! మంత్రజలస్పర్శచే మృత దేహము పునర్జీవనమును బొంది ఉచ్ఛ్వాస, నిశ్వాసల నొనరించుచు నిద్ర మేల్కాంచిన వానివలె కళ్ళుదెఱచి చూచెను. ఈ హఠాత్పరిణామ మునకు ఆప్రదేశమున సమావిష్టు లైయున్న సకలజనులు అమితాశ్చర్యముతో ఆనందమును పట్టలేక భగవద్భక్తుని మహిమలను వేనోళ్ళ కీర్తించిరి.


నవాబు తాను రాజునన్న విషయము మఱచి ఆనందోత్సాహముతో నృత్య మొనరించెను. రాజు, రాణి తదితర పరివారమంతయు అనేక పర్యాయములు శ్రీవారికి సాష్టాంగ దండ ప్రణామ ముల నర్పించిరి.


వారందఱు సజలనయన ములతో 'మహాత్మా ! మీరే మాకు నిజమైన తండ్రి. మా షెహజాదాకు ప్రాణ దానమొనరించి నా రాజ్యమును గాపాడిరి. ఇందులకు మేము మీ కేమి ప్రత్యుపకారము జేయగల వారము' యని  అనేక విధముల వేడుకొనిరి.

నవాబు అనేక నజరానా లను, ధనమును, స్వామి వారికి అర్పించి స్వీకరింప వలసినదిగా ప్రార్థించిరి. అంతటితో నాతడు తృప్తిచెందక వసంత మహలును, ఉద్యానవన మును కృష్ణపురగ్రామ మును ఇంకను తదితర గ్రామములను శ్రీవారి కర్పించుకొని తన అమితానందమును వ్యక్త పరచెను. నాటి నుండి నవాబు స్వామివారి శిష్యుడై ఆయన సేవల నొనరించి చరితార్థు డయ్యెను. కొన్ని దినములు తన పరివార ముతో శ్రీవారు వసంత మహలునందే యుండి నవాబుసేవలను స్వీకరించి మఱల ప్రయాణమునకు సిద్ధమైరి. నవాబు ఆయన రాణులు, షెహజాదా, తదితర పురవాసులందఱు సజల నయనములతో స్వామివారికి వీడ్కోలు నొసంగిరి.


భగవంతునికన్న భగవద్భ క్తుడే మహా మహిమా న్వితుడు.  శ్రుతులకుగూడ అగోచరుడైన ఆ పరబ్రహ్మ ము సచ్చిదానంద విగ్రహుడై భక్తాధీనుడై యుండును. కావుననే పరమ భాగవతోత్తము డైన శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి సంకల్పమాత్రము చేతనే మరణించిన షెహజాదా పునర్జీవితుడైనాడు. నేడు కృష్ణ పురము తదితర గ్రామములన్నియు శ్రీవారి ఆశ్రమాధీనములో లేవు. 1857 వ సం. న ఆ ప్రాంతపునవాబు ఈగ్రామ ములను బ్రిటీషు ఇండియా వారికి సంక్రమింపజేసెను.


ఆశ్రితజన రక్షణము: 


శ్రీరాఘవేంద్రతీర్ధ స్వామి దివ్యపాదారవిందముల నాశ్రయించిన వారి చెంత మృత్యువైనను తలవంచక తప్పదు. కృష్ణ పురము నుండి బయలుదేరి శ్రీవారు తమ పరివారముతో పయనించుచు గదక్ తాలూకాలో కిరీటగిరి యనుగ్రామమును  జేరిరి. ఆగ్రామములో నివసించి యున్న గ్రామాధికారి వెంకట దేశాయి శ్రీవారి భక్తుడు, మహాధనవం తుడు. ఆగ్రామమునకే గాక ఆ తాలుకాకు కూడ అతడు అధికారి. అతడు శ్రీవారికి స్వాగతము బల్కి పరివారముతో పాటు గురుదేవులకు తన గృహములోనే ఆతిధ్యము నొసంగెను.


స్వామివారి ఆగమన వార్తను గ్రామములో కూడ తెలియబరచి ప్రజలందరినీ  స్వామివారిని దర్శించు టకు, తన ఆతిథ్యమును స్వీకరించుటకు ఆహ్వానిం చెను. మఱుసటి దినముననే ఆ ఉత్సవము ను తిలకించుటకు అశేషముగ ప్రజలు వెంకటదేశాయి గృహము జేరిరి. వెంకట దేశాయి స్వామి వారి పూజ, ఆరాధనలకు సమస్తమును సిద్ధము       ఒనరించి వచ్చిన జనులకు సమారాధన మొనరించు టకు సంభారములను సిద్ధము జేయుచుండెను. అది మామిడి పండ్ల కాలము.  ఆగృహస్థు అసంఖ్యాకముగ పండిన మామిడి పండ్లను తెప్పించి వాటిరసమును దీయించి భోజనములో వడ్డించుటకు ఒక పెద్ద గంగాళములో పోయించి గది యందు  ఉంచెను. భార్యాభర్తలిద్దరు స్వామివారికి సేవల నొనరించుటలో సమారాధ నమునకు సంబంధించిన ఏర్పాట్లలో ఉదయము నుండి లగ్నమైయుండిరి. వారికి రెండు సంవత్సర ముల వయస్సు గల్గిన కుమారుడు కలడు. ఆ బాలుడు అడుకొనుచు మామిడిపండ్ల రసమును పోసి యుంచిన గదిని ప్రవేశించి బాల్య చాపల్య ముచే గంగాళములో తొంగి చూచుచుండగా కాలుజారి  దానియందు పడి మరణించెను. ఎవరిపనులలో వారు సంలగ్నులై యున్న కారణమున ఈ దారుణ సంఘటనను ఎవరూ గుర్తించలేక పోయిరి. ఉదయమునుండి కుమారు ని గానక తల్లి గృహమంతయు వెదకి తుదకు తన భర్తకు  ఆ విషయమును దెల్పెను. ఆయనకూడ తనకు తెలియదని పల్కి పత్నితోగూడి వెదక నారంభించెను. తుదకు వారు గదిలో గంగాళము లో పడి మరణించిన తమ  కుమారుని గాంచి కింకర్తవ్యతా విమూడులై అపారదుఃఖ పారావార మున బడిరి.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

12 వ భాగము  

సమాప్తము.** 

🎾

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat