శ్రీ రాఘవేంద్ర కల్పవృక్షము 13 వ భాగము

P Madhav Kumar


అంతదుఃఖములోగూడ ఆ మాతృమూర్తి ధైర్యముతో గది తలుపులను మూసి తనభర్తతో నిట్లు పల్కెను. “నాథా! ఇప్పుడు మన మేమిచేయవలెను? ఎందఱో బ్రాహ్మణులు కుటుంబ సహితముగ భుజించుటకు సిద్ధముగ నున్నారు. గురుదేవులు పూజల నొనరించుచు న్నారు. ఇపుడీ మరణ విషయము బహిర్గతమై నచో భుజింపక అందరు మరలి  పోయెదరు. ఈ యపరాహ్నవేళలో స్వామి తమ శిష్యులతో  గూడ మనగృహమును వీడిపోవ లసివచ్చును. గతించిన తనయుడు తిరిగిరాడు. మన విూవిషయమును వెల్లడింపక అందరి  భోజన ములు పూర్తియగువరకు ఓపికపట్టవలెను. తదనంత రమే మనపుత్ర వియోగ దుఃఖమును వెల్లడి చేయ వచ్చును.


భార్యపల్కిన ధైర్యవచన ముల నాలకించి భర్త ఆశ్చర్య చకితుడయ్యెను. సజల నయనములతో భార్యను పొగడుచు, 'దేవీ! నాకు నీవు భార్యవు మాత్రమే కావు, నీవు నాగృహదేవతవు! మాటల లోను, చేతలలోను నేను నిన్నే అనుసరించెద నని పల్కెను. 


ఆ క్షణముననే వారిర్వురు మామిడిపండ్ల రసము నుండి మృతబాలకుని దీసి బాగుగా కడిగి ఒక గుడ్డలో చుట్టి ఆ గదిలోనే ఉంచి తలుపులను మూసి వేసిరి. సమారాధనము జరుపు టకు శ్రీ వారి యారాధన ము నిర్విఘ్నముగ నెఱ వేర్చుటకు తనముఖ్య బంధువులను, గుమస్తా లను వినియోగించి వారు దూరముగ నుండిరి. పూజ ఆరాధన ముగిసెను. శ్రీవారు  తీర్ధ ప్రసాదముల నొసంగు సమయ మాసన్న మమ్యెను. స్వామి గృహ యజమానికై అటునిటు దృక్కులను సారించిరి.  స్వామివారి యంతరంగ మును దెలిసికొని ఉద్యోగి హస్తములను ముకుళించి స్వామీ! మా యజమాని, యజమానురాలు ఒక ముఖ్యమైన పనివలన గ్రామములోనికి పోయిరి. వారు మరలి వచ్చుటకు చాలకాలమగును, కావున దయతో తమరు  ఆహూతులైన వారందరకు తీర్థ ప్రసాదముల నొసం గుడు, తదనంతరము సమారాధన  జరుగగలదు. బహుశః మా యజమా నులు సమారాధనానంత రమే మిమ్ములను దర్శింప గలరని పల్కెను.


శ్రీ రాఘవేంద్రతీర్ధస్వామి క్షణమాలోచించిరి. ఆ సర్వజ్ఞునకు సర్వము విదితమైనది. స్వామి యజమానిని, యజమాను రాలిని తక్షణమే పిలిపింప వలసినదిగ ఆజ్ఞాపించెను. విషయమును దెలిసికొని గత్యంతరము లేక ఆ  దంపతులు మరల గృహమును ప్రవేశించి స్వామివారి ఎదుట మౌనముగ ముకుళిత హస్తములతో విషణ్ణవద నులై నిలువబడిరి. సర్వము తెలిసిన స్వామి 'వెంకట దేశాయి! ఏల నీవిట్లు విచిత్రముగ ప్రవర్తించుచున్నావు! భగవంతుని తీర్ధ ప్రసాద ములను వదలి యెందు లకుదూరముగ నున్నావు? సత్యమును వచింపు మని పలికెను. గురు  దేవుని యాజ్ఞను శిరసావహించి ఆతడు 'మహాత్మా! నా కుమారుడు మామిడి పండ్ల రసముగల గంగాళ మునందు పడి మరణించి నాడని' విన్నవించి దుఃఖింప నారంభించెను. అపుడు శ్రీవారు “ఓహో ! అదియా నీవు మానుండి దూరముగ నుండుటకు కారణము! నీకుమారుడు మరణింపలేదని మేము అనుచున్నాము. 'వాడె క్కడ? వానిని తక్షణమే నా సమ్ముఖమునకు దోడ్కొని రమ్మ"ని ఆజ్ఞాపించెను.


స్వామివారి అభయ వచనము నాలకింపగనే బ్రాహ్మణ దంపతులు తమపుత్రుడు జీవించినట్లే భావించి తక్షణమే తెచ్చి శ్రీవారిపాదముల చెంత బాలకుని శవమును ఉంచిరి.   


శ్రీరాఘవేంద్ర తీర్ధస్వామి ధన్వంతరీ స్తోత్రమును పఠించి శ్రీకృష్ణమహామంత్ర జప మొనరించుచు తన కమండలము లోని గంగా జలమును హస్తమునం దిడుకొని మృతశిశువుపై జల్లిరి. తక్షణమే బాలకుడు పునర్జీవితుడై అటునిటు కదలుచు నడయాడ సాగెను. 


ఈ మహా విచిత్రమును గాంచిన సకల ప్రజలు పరమాశ్చర్య చకితులై స్వామివారి దివ్యమహిమ ను వేనోళ్ళ కీర్తించిరి. బ్రాహ్మణ దంపతులు  ఆనందముతో మైమరచి నృత్యమొనరించిరి. మరల తమబిడ్డకు పునర్జన్మ గల్గినదని భావించి ఆ  దంపతులు తమకుమారు ని శ్రీవారి చరణముల చెంతనుంచి అనేకసాష్టాంగ దండ ప్రణామము లర్పించిరి. కృతజ్ఞతను జెప్పుటకైనను వారికి మాటలు పెగలలేదు, కేవలము నయనముల నుండి ఆనందాశ్రువులను ప్రవహింప జేయుచు ముకుళిత హస్తములతో వినీతులై స్వామి నారాధించిరి. శ్రీవారు తీర్ధప్రసాదముల నందరికి నొసంగి పూజా కార్యక్రమ మును ముగించిరి.


ఆహూతులైన  ప్రజలం దరు సమారాధనలో పాల్గొని శ్రీరాఘ వేంద్ర తీర్ధ స్వామి దివ్యమహిమలను పొగడుచు ఆయనకు  అనేక సాష్టాంగ దండ ప్రణామముల నర్పించి తమతమ గ్రామములకు జనిరి. స్వామివారు ఆ దేశాయి దంపతుల గృహములో కొన్ని దినము లుండి తదనంతరము కిరీటగిరి గ్రామమునుండి బీజాపురమునకు బయలు దేరిరి.


అగ్నిదేవుడు కంఠాభరణ మును తెచ్చియిచ్చుట:


శ్రీరాఘవేంద్ర తీర్ధస్వామి తన పరివారముతో పయనించుచు బీజాపుర సామ్రాజ్యమును ప్రవేశించి ఒక గ్రామములో విడిది చేసిరి. బీజాపుర నవాబు కు శ్రీరాఘవేంద్ర స్వామి మహాత్మ్యము బాగుగా దెలియును. ఆ మహాత్ము డు తన రాజ్యమున కేతెంచెనని తెలిసికొని యెంతయో సంతోషించి స్వాగతము పల్కుటకు తన వజీరులను నజరానా లతో పంపెను. శ్రీ రాఘ వేంద్ర తీర్థస్వామి సామాన్యుడైన సన్యాసి కాడని పీడితమానవుల నుద్దరించుట కేతెంచిన మహాత్ముడని తెలిసికొని నవాబు ఛత్రచామరము లను అనేక సువర్ణాభరణ ములను, జాతి రత్నము లతో నిర్మింపబడిన కంఠాభరణమును నజరా నాగా పంపెను. స్వామి పాదుషా పంపిన నజరానాలను స్వీకరించి కంఠాభరణము సీతమ్మకు పంపెదనని వచించి పాదుషా నాశీర్వదించిరి. కంఠాభరణ సమర్పణోత్స వమునకు వజీరులు హాజరుగా ఉండవలసిన దిగ స్వామి వారాదేశిం చిరి.


పూజాసమయములో శిష్యులు అగ్నిగుండము నేర్పరచిరి. శ్రీవారు దివ్య మంత్రములనుచ్ఛరించుచు సీతామాతకు జేర్చవలసి నదిగా అగ్ని నాదేశించి కంఠాభరణమును హోమ గుండమందు పడవైచిరి. ఈ విచిత్రమును గాంచి వజీరులు స్వామివారు తమను, తమపాదుషాను అవమానించిరని భావించి పాదుషాకు జరిగినదంతా విన్నవించిరి. బీజాపూరు నవాబు ఈవిషయము ఆలకింపగనే  స్వామివారు

తన్నవమానించెనని భావించెను. అతను కుపితుడై స్వామి వారు మహాత్ముడని తెలిసినందు వలన ఏమియు చేయ జాలక యుక్తితో స్వామి నవమానింప వలెనని భావించెను.


కుతంత్రమును వజీరునకు బోధించి నవాబు వానిని స్వామి చెంతకు పంపెను.  వజీరు స్వామివారి విడిదిని జేరి అనేక సలాము లర్పించినవాడై మహాత్మా! తాము అగ్ని ద్వారమున సీతమ్మ కర్పించిన కంఠాభరణము ను తెప్పించి మాదిరికొరకు ఇప్పించవలసినదిగా మా ప్రభువు ప్రార్థించుచు న్నారు. వారి రాణులలో ఒకరికి యిట్టి కంఠాభరణ మే కావలయునట. వస్తువు చూపనిదే  స్వర్ణకారుడు ఆకంఠాభర ణమును తయారు జేయజాలడు. కావున తమరు దయతో కంఠా భరణమును తెప్పించి యిచ్చిన స్వర్ణకారునకు మాదిరిగ జూపి మఱల మీకు సమర్పింపగలమని విన్నవించుకొనెను.


శ్రీ రాఘవేంద్రతీర్ధస్వామి క్షణములో సర్వమును గ్రహించి చిరునవ్వుతో పూజా సమయమువరకు వేచియుండుము, అగ్ని దేవునిద్వారమున కంఠా భరణమును దెప్పించి యిచ్చెదనని వజీరుతో పల్కిరి. పూజ ప్రారంభ మయ్యెను. అగ్నికుండము ప్రజ్వలింపబడెను. శ్రీవారు అగ్ని దేవ మంత్రమును పఠించుచు తాను సీతమ్మ కర్పించిన కంఠాభరణ మును తోడ్కొనిరావల సినదిగ అగ్ని దేవుని ప్రార్ధించెను. తదనంతర ము జ్వలించుచున్న అయ్యగ్నికుండములో తన హస్తమునుంచి కంఠాభరణ మును తీసి వజీరున కొసంగెను. స్వామిని  అవమానింప వలెనని యేతెంచిన వజీరునకు ఈ విచిత్రమహిమ పరమాశ్చ ర్యముగ గోచరించెను. ఆతడు కంపించుచు స్వామివారి పాదములపై బడి అనేక వందనముల నర్పించి కంఠాభరణమును గైకొని రాజధానికి మరలి వచ్చి నవాబునకు జరిగిన దంతయు విన్నవించెను. నవాబు తనమూర్ఖత్వము నకెంతయో చింతించి భయభ్రాంతుడై కంఠాభరణ మును దోడ్కొని మఱల అనేక నజరానాలతో సపరివారముగ స్వామి వారి చెంతకేతెంచి అనేక సలాముల నర్పించి తన యజ్ఞానమును మన్నింప వలసినదిగా ప్రార్ధించెను.


పశ్చాత్తప్త  హృదయుడైన నవాబును సహజక్షమాశీల సంపన్నులైన శ్రీస్వామి వారు క్షమించి అతడర్పిం చిన నజరానాలను స్వీకరించెను.


శ్రీ గురు రాఘవేంద్ర

*****

శ్రీ రాఘవేంద్ర 

కల్పవృక్షము

13 వ భాగము  

సమాప్తము.** 

🎾🎾🎾🎾🎾🎾

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat