మృత్తికా మాహాత్మ్యము:
మంచాల గ్రామములో నిర్మింపబడిన సువిశాల మఠములో శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి శిష్యపరివార సమేతముగ విరాజిల్ల నారంభించిరి. ఎందరో ఆధ్యాత్మిక విద్యార్థులకు ఆపవిత్రాశ్రమము మూర్తీభ వించిన సరస్వతీ నిలయ మయ్యెను. ముముక్షువు లైన భక్తులకు దివ్యక్షేత్ర మయ్యెను. ఆశ్రితులకు కల్పవృక్షమయ్యెను. ఆ దివ్యాశ్రమములో సకల జీవులకు పరమ శాంతి లభించును. మానవులేగాక పశుపక్ష్యాదులు కూడ పరస్పర వైరమును మరచి పరమమిత్రులై మెలగు చుండును. కారణమేమన ఆ దివ్య క్షేత్రము తపోభూమి, యజ్ఞభూమి, భక్తాగ్రేసరుల పాదధూళిచే పవిత్రమైన ధరణి.
శ్రీమన్నారాయణుడు, శ్రీలక్ష్మీ నృసింహరూపమున నడయాడిన పావనధరిత్రి. సత్యయుగములో ప్రహ్లాద చక్రవర్తి ఈ ప్రదేశములోనే అఖండ భగవదారాధన మొనరించుచు అసంఖ్యా కములుగ రాజసూయ, వాజపేయ యజ్ఞముల నొనరించెను. ఆ ప్రదేశ మందలి మన్నుగూడ పావకునివలె పవిత్రమే. ఆనాటి ప్రహ్లాదుడే నేటి శ్రీ రాఘవేంద్రతీర్థ యతీంద్రు లు. కావుననే శ్రీవారు ఆశ్రమస్థాపనకై ఈ మంచాల ప్రదేశము నెంపిక చేసిరి. నేడాప్రదేశము 'మంత్రాలయ' నామమున గణుతికెక్కెను. శ్రీ రాఘ వేంద్రతీర్థ స్వామి జితేంద్రి యులై అనన్యభక్తితో పరంపరాగత విధానాను సారముగ భగవదారాధ నము చేయుచుండిరి. శ్రీవారి యాశ్రమములో ఎందరో బ్రహ్మచారులు, విద్యార్థులు, ఆశ్రమ వ్యవ స్థాపకులు ఆశ్రమకర్మ చారులు మొదలగువారు కలరు. ఆశ్రమ ప్రాంగణం అంతయు పవిత్ర తులసీ వనములతో నిండియుం డును. నిరంతరము శ్రీహరి నామసంకీర్తనముచే పవిత్ర మగుచుండును. వేద మంత్రఘోషచే ప్రతిధ్వనిం చుచుండును. కావున మంత్రాలయమను నామ ము ఆ ప్రదేశమునకు సార్థకమయ్యెను. తులసీ వనములకు, ఫలపుప్పో ద్యానములకు రక్షకులుగ, పోషకులుగ కొందఱు బ్రహ్మచారులను శ్రీవారు వినియోగించిరి. వారిలో శ్రీకృష్ణుదాసుడు అను సద్గుణవంతుడైన యువ కుడు గలడు. అతడు నిత్యము గురు దేవుని దివ్య నామమును జప మొనరించును. గురువునే దైవముగ భావించుచు గురుదేవునాజ్ఞను శిరసా వహించి పరిపాలించుచుం డెను. ఒకదినమున శిష్యులకు ఆధ్యాత్మ విద్యాప్రబోధన మొనరించు చు శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి గృహస్థాశ్రమ ధర్మమును ప్రశంసించిరి. వీతరాగియై సర్వకర్మలను భగవదర్పణముగ నొనరిం చుచు శీలవతిని పరిణయ మాడి భగవదారాధనా తత్పరుడై నిరతము దీనజనసేవా నిమగ్నుడై
అతిథులను గౌరవించుచు సత్సంతానమును బొంది తామరాకుపై నీటిబొట్టువలె ఈ ప్రపంచములో వ్యవహ రించునట్టి వాని గృహస్థాశ్ర మమే ప్రశంశనీయమని శ్రీవారు ప్రవచించెను. గురు దేవుని ప్రవచనము నాలకించిన శ్రీకృష్ణదాసు గృహస్థాశ్రమమును స్వీక రింపవలెనని సంకల్పించు కొనెను.
తత్ క్షణమే గురుదేవుని సమీపించి సాష్టాంగదండ ప్రణామములర్పించి తన మనోగతభావమును బహి ర్గతమొనరించెను. శిష్యుని ఆకాంక్ష నాలకించి శ్రీవారు మందహాసము చేసి తన పాదతలమున నున్న మృత్తికను దీసి ఒక అండాకారముగ నొనర్చి 'కృష్ణా! నీవీమృత్తికను అహర్నిశములు వెనువెంట నుంచుకొనుము, ఉత్తర దిశగా పయనించిన నీకు సద్గుణవతి, సాధ్వి, పరమ సౌందర్యవతియు నగు భార్య లభింపగలదని ఆశీర్వదించెను.
గురుదేవులొసంగిన ఆ దివ్యమృత్తికను తన ఉత్తరీయములో బంధించి శ్రీకృష్ణదాసు వధువును అన్వేషిస్తూ ఉత్తరదిశగా గురుదేవుని నామమును జపమొనరించుచు బయలు దేరెను.
శ్లో॥పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥
తా. పూజింపదగినవాడు, సత్యధర్మరతుడు, సేవించువారికి కల్పవృక్ష మైనవాడు, నమస్కరించు వారికి కామధేనువైన వాడునగు రాఘవేంద్ర స్వామికి నమస్కరించు చున్నాను.
ఇట్లు గురునామజపమొ నరించుచు కొన్ని దినము లు ఉత్తర దిశగా ప్రయాణ మొనరించి అర్థరాత్రికి ఒక గ్రామమును జేరెను. ఆ గ్రామముమధ్యలో ఒక హర్మ్యము కలదు. అర్థరాత్రికూడ ఆభవన ములో దీపకాంతులు వెదజల్లుచున్నవి. ఆ భవ నములోనివారు దక్క అన్య గ్రామవాసులందరు గాఢనిద్రావశులై యుండిరి.
కొన్ని గంటలు ప్రయాణము చేసిచేసి శ్రీకృష్ణదాసు బాగుగ అలసినవాడై గ్రామమధ్యములో నున్న ఆభవనమును జేరెను. మూసియున్న భవన ప్రధానద్వారమును తట్టుచు అతిథినగు నే నేతెంచినానని కేకలు వేయసాగెను. కాని ఈ యువకుని కేకల నెవరును పట్టించుకొనలేదు. ఆగృహ ములో గలవారందరు చింతాక్రాంతులై విషణ్ణ వదనములతో దుఃఖ నిమగ్నులై యుండిరి.
ఆ దృశ్యమును గాంచి తనకిక ఉపవాసమే శరణ్యమని భావించి శ్రీ కృష్ణదాసు సింహద్వారము న కడ్డముగ విశ్రమించెను. అర్థరాత్రి దాటుచుండగ అలికిడివలన శ్రీకృష్ణ దాసు నిద్ర మేల్కాంచెను. తన సమ్ముఖమున ఒక వికృతా కారుడు గోచరించెను. యమకింకరునివలె వాడు అత్యంత భయంకరముగ నుండెను. మొదట ఆ భీకరాకారుని గాంచి చలించినవాడై శ్రీకృష్ణ దాసు ఎవరు నీవని ప్రశ్నించెను. అపుడా భయంకరాకారి “బ్రాహ్మణో త్తమా! నేనొక బ్రహ్మ రాక్షసుడను. నీవు సింహద్వారమున కడ్డముగ శయనించి యున్న గృహ మొక జమీoదారునిది. వానితో నాకు పూర్వజన్మ వైరముకలదు. ఆజమీందా రున కొక కుమార్తె కలిగెను. ఆమె యనంతరము వరుసగా ఎనమండుగురు పుత్రులు కల్గిరి.
నాజన్మ స్వభావమైన ద్వేషకారణ మున జమీందారుని పుత్రహీనునిగ నొనరింప వలెనని నేను నిశ్చయించు కొంటిని. జన్మించిన మరుక్షణములోనే ఆ బిడ్డలను సంహరించు చుంటిని. జ్యేష్ఠ సంతానం పుత్రిక కావున ఆమెకు మాత్రము అపకార మొన రింపక మిన్నకుంటిని. ఆ జమీందారు భార్య పదియవ సంతానమును గనుటకు వేదనబడు చుండెను, మరల వారికి పుత్రోదయము కాగలదు. నేను ఈ శిశువును గూడ సంహరింప నిశ్చయించి తిని. నీవు సింహద్వార మున కడ్డముగా పరుండి యున్నావు. నీ ఉత్తరీయ మందు భగభగ మండు చున్న అగ్ని గోళమున్నది. ఆ గోళమే నిన్ను ఈ గృహము వారందరిని నానుండి రక్షింపగల్గు చున్నది. ఎందులకో నిన్ను గాంచిన క్షణమందే నానోరు అసత్యమును బల్కుట లేదు. బ్రాహ్మణోత్తమా! నీవీ ప్రదేశమును వీడిపొమ్ము నీవు నీయగ్ని గోళము ఈ ప్రదేశమున నున్నంత కాలము నేనీ హర్మ్యమును ప్రవేశింప జాలనని” పల్కెను. బ్రహ్మరాక్షసుడు పల్కిన పల్కుల నాలకించి శ్రీకృష్ణదాసు ఆశ్చర్యచకితు డై తన యుత్తరీయములో భగభగ మండుచున్న అగ్ని ఏమిటియని చూచు కొనెను.
గురుదేవులొసంగిన పాద ధూళియే యని గ్రహించి శరీరమంతయు పులకిం పగ అశ్రుపూర్ణ నయనుడై గద్గదకంఠముతో ఉచ్ఛై స్వరముతో గురు దేవుని దివ్యనామమును కీర్తింప నారంభించెను. తన ఉత్తరీయమందు భద్ర పరచియుంచిన గురు దేవులొసంగిన మృత్తికను ఆ బ్రహ్మ రాక్షసునిపై జల్లెను. ఆ సమయమందే గృహములో జమీందారు భార్య కుమారుని ప్రసవిం చెను. సంతానము పుట్టిన ప్పుడు మరణించినప్పుడు వారెనిమిది పర్యాయము లు దుర్భర గర్భశోకము ననుభవించిరి. కానీ నేడీ శిశువు మరణింప లేదు. అందరు పరమాశ్చర్య చకితులై సింహద్వారము నుండి వచ్చుచున్న దివ్యమంత్రమును ఆల కించిరి. శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి దివ్యనామము కర్ణములందు సోకగనే మృత్తిక శరీరమును దాకగనే ఆ బ్రహ్మరాక్షసుని దేహము అగ్నికి ఆహుతి కాగా అతడాక్రందనము చేయుచు భస్మ మయ్యెను. ఈకోలాహలము నాలకించి గృహములోని వారందరు బయటకు పరుగిడి వచ్చి మంటలలో దగ్ధమగుచున్న వికృతాకారుని, సింహ ద్వారము చెంత నిలు చుండి మంత్రము నుచ్ఛ రించు చున్న యువకుని గాంచి విషయముదెలియక ఆశ్చర్యమగ్నులైరి. అగ్ని జ్వాలలలో భస్మమగు చున్న ఆ బ్రహ్మరాక్షసుని దేహమునుండి ఒక వెలుగు బయల్వెడలి ఊర్థ్వముఖముగ పయ నించెను. గురు దేవుని నామమహాత్మ్యము నెఱిగి శ్రీకృష్ణ దాసు పరమానంద భరితుడయ్యెను.
జమీందారు మొదలగు వారందరు శ్రీకృష్ణ దాసు చుట్టూ చేరి మహత్మా! ఈవిచిత్రమేమియని ప్రశ్నిం చిరి. శ్రీకృష్ణదాసు జరిగిన దంతయు చెప్పగా జమీందారుతో పాటు కుటుంబ సభ్యులందరు జన్మించిన బాలకుడు మృతినొందక జీవించుటకు కారణము ఈమహత్ముని సన్నిధానమే యని గ్రహించి శ్రీకృష్ణదాసు పాదములపై బడిరి. ఆయనను సాదరముగా గృహములోనికాహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే సత్కరించిరి. మహాత్మా! మీరు వధువు నన్వేషించు చు మా గ్రామము జేరి మమ్ముల నందఱిని దుస్సహ పుత్రదు:ఖము
నుండి సంరక్షించిరి. మమ్ము వీడి పోవలదని ఆయనను అనేకవిధముల ప్రార్థించిరి. జమీందారు ముకుళితహ హస్తుడై బ్రాహ్మణోత్తమా! నా జ్యేష్ఠపుత్రిక సౌందర్యవతి, సద్గుణవతి. ఈమెను పరిణయమాడి ఆజన్నాం తము మాగృహమందే యుండి మమ్ములను ధన్యుల జేయవలసినదిగా ప్రార్థించు చున్నాడనని పల్కెను.
గురుదేవుని నామమహా త్మ్యమును, ఆశీర్వాద బలమును ప్రత్యక్షముగ దర్శించిన శ్రీకృష్ణదాసు మనములో గురువు యెడల శ్రద్ధాభక్తులు ఇనుమడించెను. గృహస్థాశ్రమము స్వీక రింపవలెనని సంకల్పించి నాడు గావున జమీందా రుని ప్రార్థనలను మన్నించి ఆయనపుత్రికను పాణి గ్రహణము చేసి శ్రీకృష్ణ దాసు గృహస్థుడయ్యెను. గురుదేవుని వీడి జీవించుట అసంభవమని యెఱిగినవాడై శ్రీకృష్ణదాసు మామగారి అనుజ్ఞ గైకొని సాధ్వీలలామ యైన సహధర్మచారిణి తో బయలు దేరి ఆశ్రమమును జేరి గురు దేవుని చరణ కమలముల నాశ్రయిం చెను. శ్రీరాఘవేంద్రతీర్థ యతీంద్రులు ఆ దంపతుల నాశీర్వదించి అను గ్రహించిరి.
శ్రీకృష్ణదాసు ఉత్తమ గృహస్థు, భగవద్భక్తుడునై సత్సంతానమును బడసి జీవితాంతము గురుదేవుని సేవించుచు తన జన్మను చరితార్థ మొనరించు కొనెను.
జై గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
17 వ భాగము
సమాప్తము**"
🕉️🔔🕉️🔔🕉️🔔
🙏 ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః🙏