శ్రీ రాఘవేంద్ర స్వామిని పరీక్షింపదలచి వచ్చిన మువ్వురు స్నానమునకు తుంగభద్రానదికి పోగా, అచట నదీతీరములో, ఒక బాలకుడు శ్రీ స్వామి వారివస్త్రములను నీటిలో తడిపి ఆరవేయుచుండెను. అతడు ఈ మువ్వురు బ్రాహ్మణులను చూడగనే "బ్రాహ్మణోత్తములారా! మీరు స్నానముచేసి విచ్చేయుడు. మీరు కోరు కొనిన పదార్ధములు సిద్ధము చేయబడినవి. భోజన సమయమందు అవిమీకు విడివిడిగ వడ్డింప బడగలవు" అని పల్కి ఆబాలకుడు శ్రీవారి వస్త్రముల దీసికొని వారి సమాధానమున కైనను ఎదురుచూడక మఠము నకు బయలు దేరెను.
ఆమువ్వురు బ్రాహ్మణోత్త ములు ఈ బాలకుడు సర్వజ్ఞునివలె పల్కుట గాంచి విస్తుపోయిరి. శ్రీవారి వస్త్రములను స్పృశించు చున్నంతనే వానికి అపరోక్ష జ్ఞానము కలుగుచున్నదని విద్వాంసులమై యాబ్రాహ్మ ణులు గ్రహించిరి. వస్త్రములకే యింతటి మాహాత్మ్యమున్న శ్రీవారి సన్నిధానమెంత శక్తి వంత మో వారూహించుకొన గల్గిరి. ఆయన మూర్తీభ వించిన అగ్నిహోత్ర స్వరూ పుడని, ఆయనను పరీక్షించుట మహా పాతక మని, ఆత్మహత్యా సదృశ మని గ్రహించి పశ్చాత్తప్త హృదయులైరి. వారు తమమనస్సును పవిత్ర మొనరించుకొని అత్యంత భక్తి నమ్రత కలవారలై మఠమును చేరిరి.
ఆగంతకులైన ఆ అతిథుల కు శ్రీస్వామియే స్వయము గ స్వాగతము పల్కుచు "బ్రాహ్మణోత్తములారా! మీరు మధ్యాహ్న భోజన సమయమునకు అరుదెం చితిరి. మీరు మాకు అతి థులు. మీరు మా ఆతిధ్య మును స్వీకరింపుడనెను. వారికి ఉచితాసనముల నొసంగి ఆశ్రమములో వంటవానికి ఆ మువ్వు రకూ వారు తమమనస్సు లలో సంకల్పించిన పదార్థ ములనువడ్డింప వలసినది గా ఆజ్ఞాపించెను. వారితో శ్రీవారుగూడ ప్రసాదమును స్వీకరింప నారంభించిరి. ఈమువ్వురు బ్రాహ్మణులు శ్రీస్వామివారి అపరోక్ష జ్ఞానమును, మాహాత్మ్య మును వేనోళ్ళ కీర్తించుచు భోజనము ముగించిరి. తదనంతరము ఆ బ్రాహ్మ ణోత్తములు శ్రీవారి పాద పద్మములపై బడి 'దేవా! మమ్ములను క్షమింపుము, మేము కలుషిత మనస్కు లము, అజ్ఞానులము, మీయెడల అపరాధ మొన రించిన దౌర్భాగ్యులము. తమ ఆశీర్వాదములను అభిలషింప వలసిన మేము మిమ్ములను పరీక్షించుటకు, మీ తపశ్శక్తి యెంతటిదో తెలిసికొనుట కు ప్రయత్నించితిమి. దయామయుడవైన నీవు మమ్ములను అనుగ్రహిం చితివి. మహత్మా! మేమొనరించిన యీ దుష్కృత్యమునకు పశ్చా త్తాపముచెంది మీ పాదార విందముల నాశ్రయించి తిమి. ఈదీనులను క్షమించి తమపద రేణువు లుగ స్వీకరింపుడు. మా జీవితాంతము మిమ్ములను ఆరాధించెదము. మేమే కాదు, మా వంశ పారం పర్యముగ మీకు సేవ లొనరించి మేమొనరించిన యీ భాగవతాపరాధము నుండి ముక్తిపొందెదము. మా అభ్యర్థనను అనుగ్రహ హింపుడని విలపింప సాగిరి.
సర్వజ్ఞుడైన శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి కరుణాంత రంగుడై ‘బ్రాహ్మణోత్తము లారా! మిమ్ములను త్వరగా నాసన్నిధానము నకు చేర్చుటకే అదృశ్యశక్తి మిమ్ములనట్లు ప్రేరేపిం చెను.
పూర్వకాలమందు నా ప్రహ్లాదావతారములో మీరు నా సహపాఠులు. నా ఆధ్యాత్మిక బోధలనాల కించి దైత్యకుమారులైన మీరు నన్నారాధింప వలెనని, నన్ను పూజింప వలెనని ప్రార్థించిరి; కావున నాటి మీ అభ్యర్థనను నేటికి నేననుగ్రహించు చున్నాను. త్వరలో నేను బృందావనమును (సజీవ సమాధి) ప్రవేశింపవలెనని సంకల్పించితిని.
నాబృందావన ప్రవేశానం తరము మీరు నా బృందావన పూజారులు కండు, ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరము బృందావన పూజారులుగ విద్యుక్త ధర్మములనునిర్వర్తింపుడు. మీరు, మీ వంశముల వారు మంచాలలోనే నివసించి వంశపారంపర్య ముగ పూజారులుగ నుండి నా పరంధామ గమన సమయమున ముక్తిని పొందెదరుగాక! యని అనుగ్రహించెను.
తదనంతరము బృందావన ప్రవేశ సమయమున శ్రీరాఘ వేంద్ర తీర్థస్వామి ఆమువ్వురు బ్రాహ్మణుల ను బృందావన పూజారు లుగా నియమించెను. వారికి మంచాలలోనే మూడు గృహములను నిర్మించి కొంతమాన్యమును కూడ నేర్పాటు చేసెను. వారిని వంశపారంపర్య పూజారులుగ నియమించి నట్లు మూడు అధికార పత్రములను స్వహస్తము లతో లిఖించి మఠముద్రిక వేసి శ్రీస్వామివారు ఆ మువ్వురు బ్రాహ్మణులకు ఒసగెను. నేడు మంత్రాల యాంతర్గత బృందావన పూజారులైనవారు శ్రీవారి యనుగ్రహ పాత్రులైన ఆ సద్బ్రాహ్మణ వంశజులే. నేటికి వారివద్ద శ్రీవారు స్వహస్తములతో లిఖించి యొసంగిన అధికార పత్రములు కలవు.
జ్యోతిశ్శాస్త్ర వేత్తలు:
మళయాళ దేశము (నేటి కేరళ) లో ముగ్గురు సద్బ్రాహ్మణులు కలరు. వారు జ్యోతిశ్శాస్త్రములో ఉద్దండులు. తమ శాస్త్ర పటిమపై వారికి గర్వము కూడకలదు. మళయాళ దేశము జ్యోతిశ్శాస్త్రము లో, హస్తసాముద్రికములో, టక్కుటమారి మంత్ర తంత్రాది మాయాజాలము లలో ప్రసిద్ధము. ఆ దేశము లోని విద్యలను కొందరు వినికూడ ఉండక పోవచ్చును.
జ్యోతిశ్శాస్త్ర విద్వాంసులైన యీమువ్వురు బ్రాహ్మణు లు జాతకములను పరిశీ లించి సరియైన భవిష్యత్తు ను నిర్ణయింపగలదిట్టలు. వారు విద్యాగర్వమునకు లోనై విజయ యాత్రకు బయలు దేరిరి. ఒక్కొక్క సంస్థానమును జయించు
కొనుచు, దక్కనురాష్ట్రము జేరిరి. వారు శ్రీరాఘవేంద్ర స్వామి మహాత్మ్యములను విని వారి సంస్థానములో కూడ విజయపత్రిక పొందవలెనని మంచాల చేరిరి. వారు శ్రీ వారి యాశ్రమమునకు జని తమ విషయములను విన్నవించుకొనిరి. శ్రీవారు వారినాదరించి మరుసటి దినమున విద్వజ్జన సభను ఆయత్తపరచిరి. మరునా డు ఈమువ్వురు పండి తులు తమపాండిత్య ప్రకర్షను ప్రదర్శించుటకు సభను జేరిరి.
శ్రీరాఘవేంద్రస్వామి ఆ మహాసభకు యీ మువ్వురు పండితులను పరిచయము చేసి వారికి ఒక జాతకము నొసంగి మువ్వురు విడివిడిగ దాని భవిష్యత్తును శాస్త్రాను సారముగ వివరింపవలెనని వారికి రెండుజాములు సమయ మొసంగిరి. ఆ మువ్వురు పండితులు చక్కగ గుణించి ఆ జాతకుని యొక్క భవిష్యత్తును వేరువేరుగ నిర్ణయించుకొని సభను ప్రవేశించిరి.
మొదటి జ్యోతిశ్శాస్త్రవేత్త యిట్లు పల్కెను. “ఆచార్యా! నా లెక్క ప్రకారము ఈజాతకుడు దీర్ఘాయుష్మంతుడు. కాని ప్రజలకు యెనుబది సంవత్సరముల వరకే గోచరింపగలడు.”
రెండవ జ్యోతిశ్శాస్త్రవేత్త యిట్లుబల్కెను. “మొదట చెప్పిన లెక్క తప్పు. నాగణిత ప్రకారము ఈజాతకునకు యెనిమిది వందల సంవత్సరముల ఆయుర్దాయము కలదు.”
రెండవ పండితుని ఖండించుచు మూడవ పండితుడిట్లు బల్కెను. “మీ యిద్దరియొక్క గణితము సరిగాలేదు. జాతకునకు మూడువంద ల సంవత్సరములు మాత్రమే ఆయుర్దాయము కలదు."
ఒకే జాతకమునకు మూడు విధములైన భవిష్యత్తును పల్కుటను గాంచి ప్రజలందఱు వీరు అల్ప విద్వాంసులని, గొప్పలను చెప్పుకొను వారని, గర్విష్టులని అనేక విధముల పలుకగా ఆ మువ్వురు పండితులు గూడ ఒకేజాతకమునకు మూడువిధములైన భవి ష్యత్తు లెట్లుసంభవమని, నీవు తప్పు యనగా నీవు తప్పు యని తర్కించు కొనదొడంగిరి.
ఇంతలో సభలోని విద్వాం సులు లేచి ఒకే జాతకమునకు మూడు విధములైన వ్యాఖ్యానము లెట్లు సంభవములనియు
వీరు జ్యోతిశ్శాస్త్ర పండితులు కారనియు నొక్కి వక్కాణించిరి.
అందులకు సభాసదు లందరూ ఆమోదముద్ర వైచిరి. పత్రిక కొరకై వచ్చిన ఆ మువ్వురు పండితుల పాండిత్య గర్వము నశించెను.
వారు తమవిద్యా అహంకా రమును ఆ క్షణమందే వీడి పశ్చాత్తప్త హృదయ ముతో శ్రీరాఘవేంద్రతీర్థ స్వామి దివ్య చరణార విందముల నాశ్రయించిరి. అపుడు శ్రీవారు వారి నను గ్రహించి సభాముఖముగ ఆ మువ్వురు పండితులు చెప్పినది యదార్ధమని, వారు నిజమైన విద్యాంసు లని ప్రకటించిరి. అందు లకు సభాసదులాశ్చర్య చకితులై అదెట్లు సంభవమని అసలు ఈ జాతక మెవ్వరిదని ప్రశ్నించిరి. అపుడు శ్రీవారు ఈ జాతకము శ్రీ మూల రామస్వామి సేవకుడైన యీ దీనునదే యని తన హృదయమును తాకుచు పల్కిరి. సభాసదులందఱు పరమాశ్చర్య చకితులై శ్రీవారి దివ్యమంగళ విగ్రహమును భక్తితో తిలకించుచు ఈమూడు వ్యాఖ్యానము లెట్లు సత్యములో వివరింప వలసినదిగ ప్రార్థించిరి.
అపుడు శ్రీస్వామివారు ఇట్లు పల్కిరి. "భక్తజను లారా! మొదటి పండితుడు పల్కినట్లు మేము యెనుబది సంవత్సరము లు మీ యెదుటనుండి, రెండవ పండితుడు చెప్పినట్లు బృందావనము ప్రవేశించి ఏడువందల సంవత్సరములు మిమ్ముల నందఱిని అనుగ్రహించె దము. ఎవరైనను ఎంత కష్టములోని వారైనను నాబృందావనము జేరిన వారిని రక్షించెదను. వారికి చతుర్విధ పురుషార్థము లను, జ్ఞానభక్తి వైరాగ్యము లను ప్రసాదించి ముక్తి మార్గానుయాయులుగ నొనరించెదను. మూడవ పండితుడు చెప్పినట్లు నాచే రచింపబడిన గ్రంథములు మూడువంద ల సంవత్సరములు బహుళ ప్రచారములో నుండగలవు.” సభాసదు లలో ఒకరు తరువాత యేమి యగునని స్వామిని ప్రశ్నించిరి.
అందులకు శ్రీస్వామి వారు తదనంతరము నా గ్రంథములు ముముక్షువు లకు, భక్తులకు నిత్యమార్గ దర్శకములు కాగలవు.
అవి అనంత కాలము తమ మహిమలను ప్రదర్శింపగలవు; కావున విద్వజ్జనులారా! ఈ మువ్వురు జ్యోతిశ్శాస్త్ర వేత్తలు చెప్పిన వివరణ ములు అక్షరసత్యములు; కావున వీరు యథార్థము గనే మహాపండితులు, ఇందులేశమైనను సంశ యము లేదని పల్కిరి.
తదనంతరము శ్రీవారు ఆమువ్వురు పండితులను అనుగ్రహించి దుశ్శాలువ లతో అనేక ధనకనక వస్తువాహనములతో సత్కరించి ఫలమంత్రాక్షత ల నొసంగిరి. శ్రీస్వామివారి యను గ్రహముచే జీవుని పరమార్ధము దేవుని జేరుట యని దెలిసికొని ఆపండితులు అహంకార రహితులై శ్రీస్వామి వారికి శిష్యులై పరమ భక్తులై చరితార్ధులైరి.
సభాసదులందరు శ్రీస్వామి వారి మాహాత్మ్యమును వేనోళ్ళ పొగడుచు తమ తమ నెలవులకు జనిరి.
జై గురు రాఘవేంద్ర
***
శ్రీ రాఘవేంద్ర
కల్ప వృక్షము
20 వ భాగము
సమాప్తము**
🕉️🔔🕉️🔔🕉️🔔
🙏 ఓం నమో శ్రీ గురు రాఘవేంద్ర య నమః🙏