శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి రెండు పర్యాయములు తీర్థయాత్రల నొనరించుచు భారతదేశమందంతట పర్యటించి శ్రీహరి భక్తిని, శక్తిని, ద్వైతమతమును ప్రచారమొనరించిరి.
ఆశ్రమములో ప్రతిదినము శ్రీ రాఘవేంద్రతీర్థస్వామి శిష్యులకు తత్వబోధ చేయు చుండెడివారు. ఒకదినమున శ్రీవారు శిష్యులకు ఉపనిషద్రహ స్యములను వివరించు చుండిరి. ఆ సమయము లో ఆయన ప్రవచనము నాపి దిగ్గున ఆసనము నుండి లేచి ఆకసమున జూచుచు నమస్కరించి సంభాషణ మొనరింప నారంభించిరి. తదనంతర ము వారు ప్రసన్నులై
ఆసనము నలంకరించిరి.
గురుదేవు లొనరించిన యీ విచిత్ర ప్రవర్తన శిష్యులకు అవగతము కాలేదు. వారు గురుదేవుని ఆ సంఘటనను వివరింప వలసినదిగ ప్రార్థించిరి. అపుడు శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి యిట్లుపల్కెను. “వత్సలారా! కుసుమవర్తి శ్రీకృష్ణద్వైపాయన స్వామి గొప్ప భగవద్భక్తుడు. వేదవిహిత ధర్మానుసార ముగ జీవితమును కొనసాగించిన మహాత్ము
డు. ఆయన తన కర్మము లన్నింటిని శ్రీహరి యను గ్రహముచే నిశ్శేషముగ నిర్మూలించుకొనెను. నేడు శాలివాహన శకము 1591 వ సంవత్సరము, జ్యేష్టమాసము, శుక్ల పక్షము, పౌర్ణమి. ఆ మహా భక్తుడు నేడు తన పాంచ భౌతిక దేహమును వీడి దివ్యదేహముతో విమాన ము నధిరోహించి అర్చిరాది మార్గమున (దివ్యదృష్టి గలవారు మాత్రమే గాంచగల మార్గము) పరంధామము నకు పోవుచున్నారు. ఆ మహాపురుషుని దర్శించి నేను లేచి నమస్కరించి స్తుతించితిని, భక్తాగ్రేసరా! నీవు ధన్యుడవు. భగవదను గ్రహమునకు పాత్రుడవై ముందుగనే పరంధామమునకు పోవు చున్నావని నేను పల్కితిని. అందుల కాయన మందహాసముతో తన దక్షిణకరము నెత్తి రెండు అంగుళీయకము లను మూడు పర్యాయ ములు చూపుచు సంజ్ఞా శాస్త్రమున పల్కెను. నేను సరిగ యీదినమునుండి రెండుసంత్సరముల రెండు నెలల రెండురోజులకు బృందావనమును ప్రవేశిం చెదనని, అపుడు ఆ పరంధామమే భగవంతు నితో సహా నీచెంత విరాజిల్లగలదని శ్రీకృష్ణ ద్వైపాయన స్వామి తన కరాంగుళీయకములను మూడుపర్యాయములు చూపుచు సూచించెను.
కావున నా ప్రియశిష్యు లారా! నేను రెండు సంవత్సరముల రెండు నెలల రెండురోజుల తదనంతరము బృందావన మును ప్రవేశించెదను. ఇది సత్యము.
గురు దేవుడు పల్కిన వచనముల నాలకించి ఆశ్రమవాసు లందరు చింతాక్రాంతులైరి. శ్రీరాఘ వేంద్ర తీర్థన్వామి త్వరలో జనమధ్యము నుండి అంతర్థానము కానున్నారని తెలిసికొని అందఱు విలపింపసాగిరి. శ్రీవారు తన భక్తులకు తత్వబోధ యొనరించి వారిని ఊరడించిరి.
తుంగభద్రానదికి ఆవల
శ్రీ పంచముఖాంజనేయ స్వామి స్వయంభూ రూపమున విరాజిల్లి యుండెను. శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి ప్రతిదినము తుంగభద్రపై నడచి ఆవలిగట్టుననున్న శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి మందిరమును చేరి పూజారాధనముల నొనరించి తిరిగి నీటిపై నడచుచు తుంగభద్రను దాటి ఆశ్రమమును చేరెడివారు.
ఈ మహాద్భుతమును గాంచి ప్రజలందఱు పరమాశ్చర్య చకితులై శ్రీవారిని అనేకవిధముల స్తుతించెడివారు. ప్రతి దినము శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి యొనరించు చున్న ఏకాగ్ర తపమునకు ప్రసన్నులై శ్రీ ఆంజనేయ స్వామి సాక్షాత్కరించెను. అపుడు శ్రీరాఘవేంద్ర స్వామి పరమానంద భరితుడై, సాశ్రుపూర్ణ నయనుడై హస్తములను ముకుళించి యిట్లు స్తుతించెను.
శ్లో॥వందే వాయుతనూ భవం సుచరితం వందేజగద్రూపిణమ్ వందే వజ్రతనుం సురారిదళనం
వందే దయాసాగరమ్|
వందే పంచ ముఖం సుకుండలధరం వందే కపీనాంపతిమ్
వందే సూర్యసుతాసఖం ప్రియఫలం వందే హనూమత్ప్రభుమ్|
( వాయునందనునకు, ఉత్తమచరిత్రునకు నమస్క రించెదను. జగద్రూపునకు నమస్క రించెదను. వజ్రశరీరుడు, దేవతా శత్రువులైన వారిని మర్థించువాడు, దయాసాగ రుడునైన శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కారము. పంచముఖములు కలిగిన వాడు, దివ్యకర్ణ కుండల ములను ధరించియున్న వాడు, కపీశ్వరుడు, సూర్యుని కుమార్తెకు సఖుడైనవాడు, ప్రేమకు ఫలస్వరూపుడైన హనుమ దీశ్వరునకు నమస్కా రము.)
శ్రీ ఆంజనేయస్వామి శ్రీరాఘవేంద్రతీర్థస్వామి ని అనుగ్రహించి వరముల నర్థింప వలసినదిగ పలికెను. అప్పుడు శ్రీవారు తన బృందావనము నెదుట విరాజిల్లుచు భక్తులను రక్షించి అనుగ్ర హింప వలసినదిగ వరము నర్థించిరి. అందులకు శ్రీ వాయు నందనుడు 'తథాస్తు' అని పలికి అంతర్హితుడయ్యెను. శ్రీ ఆంజనేయస్వామి భక్తుని కిచ్చిన మాట ప్రకారము శ్రీరాఘ వేంద్రతీర్థస్వామి బృందావనము ఎదుట స్వయంభూరూపమున నున్న అర్చావిగ్రహములో సదా విరాజిల్లుచుండును. శ్రీరామభక్తుడు, శివాంశ సంభూతుడు నైన శ్రీ ఆంజనేయస్వామిని దర్శించి తదుపరి భక్తులు శ్రీరాఘవేంద్రతీర్థ స్వామిని దర్శించు చుందురు.
బృందావన నిర్మాణము:
శ్రీరాఘవేంద్ర తీర్థస్వామి విశేషానుగ్రహమునకు ఇద్దరు గృహస్థులు పాత్రులైరి. వారిలో మొదటివారు వెంకన్న పంతులు, ఆయన ఆదోని దివాన్. శ్రీస్వామివారు మంచాలలో విరాజిల్లి యున్నారు. వెంకన్న పంతులు తనసమయము నంతటిని శ్రీవారి సేవలకు వినియోగించి వారిదివ్యా నుగ్రహమును పొంది జీవన్ముక్తుడయ్యెను.
రెండవవారు అప్పణా చార్యుడను బ్రాహ్మణోత్త ముడు, భక్తుడు, పవిత్రుడు, మధ్యసాంప్రదా యానుగామి విద్వాంసుడు. ఆయన సంస్కృతములో పండితుడు. అప్పణా చార్యులు తుంగభద్రానదికి ఆవలిగట్టున నున్న గ్రామమునకు చెందిన వాడు. ఆయన తన జీవితములో ఎక్కువ భాగమును శ్రీవారి సేవలకు వినియోగించెను. శ్రీవారికి ప్రీతిపాత్రుడయ్యెను. ఈ యిరువురు గృహస్థులు పూర్వకాలములో ప్రహ్లాదు ని బాల్య మిత్రులు, ప్రహ్లాదుని యుపదేశా మృతమును గ్రోలిన మహాత్ములు. తమ గురు దేవుని సేవించుటకు ఆబాలకులు కలియుగము లో శ్రీవారి సేవకులై జన్మించి భవబంధ విముక్తినొందిరి.
శ్రీహరిపార్షదుడైన శంఖు కర్ణుని యవతారమైన శ్రీరాఘవేంద్ర తీర్థుల అవతార ప్రయోజన మేమనగా తన్నాశ్రయిం చినవారలకు వారెవ్వరై నను, యెట్టివారైనను తన యనిష్ట పుణ్యమును ప్రసాదించుటయే.
అనిష్టపుణ్యమును పరి పూర్ణముగ వితరణ మొనరించి తదనంతరము శ్రీవారు గోలోకమును జేరెదరు. శ్రీహరి పార్షదుడు భూలోకమున శ్రీరాఘ వేంద్రతీర్థునిగా అవతరించి పీఠాధిపతియై ఏబది యేడు సంవత్సరములు అనన్య భక్తితో శ్రీ మూల రామ మూర్తులను ఆరాధించి పతితులను పావనులుగ చేయుచు, అనేక గ్రంథములను, వ్యాఖ్యానములను రచిం చెను. వీరి యద్భుత గ్రంథములు జీవుని శ్రీహరి వాయువుల చెంతకు జేర్చగలవు. నాటినుండి నేటివరకు, మరినాల్గు వందల సంవత్సరముల వరకు శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామి మంత్రాలయాంత ర్గత బృందావనమందు విరాజమానులై తన్నాశ్ర యించిన పీడితజనుల నుద్ధరించు చుండెదరు.
శ్రీరాఘ వేంద్రతీర్థ స్వామి తాను జనుల మధ్య చరించి కాలము సమాప్తమైనదని, యిక బృందావనమున ప్రవే శించి ఏడువందల సంవత్సరములు అనిష్ట పుణ్యమును దాన మొన రింపవలెనని సంకల్పించు కొనిరి. శ్రీవారు వెంటనే వెంకన్నపంతులునకు కబురంపిరి. దివాన్ వెంకన్న పంతులు మంచాలచేరి ముకుళిత హస్తుడై శ్రీవారియెదుట నిలువబడెను. అపుడు శ్రీస్వామి "వెంకటేశా! మీ మధ్య నేనుండవలసిన కాలము సమాప్త మయ్యెను. నా బృందావ నమును సిద్ధమొనరింపు మని పలికిరి.
శ్రీవారి యీ వాక్యములు వెంకన్న పంతులుపై అశనిపాతము వలె పడెను. ఆయన ఉచ్ఛైస్వరముతో దుఃఖిం చుచు "దేవా! నీవు వెళ్ళినచో మేమెట్లు జీవింపగల" మనెను. అపుడు శ్రీవారు 'వెంకటేష్! దుఃఖింపకు
ము. నేనీ ప్రపంచమును వీడిపోవుటలేదు. సజీవ ముగ బృందావనమును ప్రవేశించి యుండగలను. కావున బృందావన నిర్మాణమునకు చక్కని శిలలను తెప్పించుము. ద్వాదశ క్షేత్రముల నుండి సాలగ్రామములను తెప్పిం పుము. శిష్యులను హిమాలయ ప్రాంతమున నున్న గండకీనదికి బంపి ఏడువందల నారసింహ, వాసుదేవ, నారాయణ, అధోక్షజాది సాలగ్రామ ములను తెప్పింపుము. త్వరలో బృందావనము సిద్ధము కావలెను. శ్రీవారి బృందావన ప్రవేశవార్త దావానలము వలె వ్యాపించెను. శిష్యులు, భక్తులు, ప్రజలు తుదకు క్రిమికీటక పశుపక్ష్యాదులు కూడ శ్రీవారి దర్శనమిక దక్కదని విలపింప దొడంగిరి.
వెంకన్నపంతులు వెంటనే కొందరు బ్రాహ్మణులను ద్వాదశ క్షేత్రములకు, హిమాలయ ప్రాంతము నకు, సాలగ్రామాన్వేషణకై పంపెను. ఆబ్రాహ్మణులు మహాపండితులు, సాల గ్రామ శాస్త్రములో ఉద్దండులు. వెంకన్న పంతులు గొప్పశిల్పులను రావించి చక్కని నల్లరాయి ని సిద్ధమొనరింప జేసి బృందావన నిర్మాణమును ప్రారంభించెను. త్వరలో బృందావనము పూర్తి అయ్యెను. శ్రీవారు వెంకన్న పంతులును దోడ్కొని తుంగభద్రానదీ తీరమున నడచుచు మంత్రాలయ మునకు ఐదారుమైళ్ళ దూరములోనున్న మాధవ పురమను గ్రామమునకు జనిరి. ఆ గ్రామనదీతీర ప్రాంతములో శ్రీవారు సగము నీటిలో సగము బయట పడియున్న ఒక శిలను జూపించి వెంకన్నా! నాబృందావన మును, శ్రీమారుతి విగ్రహమును ఈ రాతితోనే చెక్కవలెనని బల్కిరి. అందులకు వెంకన్న ఆశ్చర్య చకితుడై “దేవా! మీ బృందావనము చెక్కబడి సిద్ధముగ నున్నది. మరి దానినేమి చేయవలెనని పలికెను. అపుడు శ్రీవారు దానిని ఉంచుము. నాతదనంత రము ఐదవ పీఠాధిపతికి ఉపయోగింపవచ్చుననిరి.
వెంకన్నపంతులు ఆ శిలను పరికించి “స్వామీ! ఇది నల్లరాయి కాదు, పైగా చిన్నది. బృందావన విగ్రహనిర్మాణము లకు సరిపోదు. మీరేల యీ శిలనే వినియోగింప వలెననుచున్నా” రనెను. అపుడు శ్రీవారు 'వెంక టేశా! నాకు యీ శిలయే కావలెను. త్రేతాయుగము లో శ్రీరామలక్ష్మణులు అరణ్యములందు సీతాదేవి ని వెదకుచు ఈ తుంగ భద్రానదీ ప్రాంతమున కేగుదెంచి యీశిలపై ఏడుఘడియలు సీతాదేవి నామోచ్చారణ మొనరిం చుచు ఆసీనులైరి. కావున ఈ శిల పరమ పవిత్రము. దీనిని నాశిరస్సుపై బృందా వనముగ మలచుడనెను. వెంకన్న పంతులు త్రేతా యుగమందు సంభవించిన యీసంఘటనను విని ఆశ్చర్యచకితుడై గురు దేవుని పాదములను తాకి ఆశిలను మంత్రాలయము నకు చేర్చుట కేర్పాట్లు జేసెను.
బృందావనము, మారుతి విగ్రహము సిద్ధ మొనరింప బడెను. సాలగ్రామము లతో బ్రాహ్మణులు మరలి వచ్చిరి. శ్రీవారి బృందావన ప్రవేశ మహోత్సవమునకు అన్ని యేర్పాట్లు గావింప బడెను.
శ్రీ రాఘవేంద్రతీర్థ స్వామి పూర్వాశ్రమములో తన అన్నగారైన గురురాజా చార్యుని కుమారుడైన వెంకన్నాచార్యుని రావించి ఆయనకు సన్న్యాసాశ్రమ మును ప్రసాదించి, యోగేంద్ర తీర్థులని నామకరణ మొనరించెను. శ్రీమూలరామ పూజారిగ, శ్రీవారి మఠాధిపతిగ శ్రీ యోగేంద్ర తీర్థులను నియమించిరి.
శ్రీవారిబృందావన ప్రవేశ సమయ మాసన్నమైనదని గ్రహించి వెంకన్న పంతులు శ్రీవారిచెంతనే నివసింప దొడంగెను. శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామి శ్రీవెంకన్న పంతులకు ఒక ప్రదేశము ను జూపించి దానిలో తనకు భూగృహమును నిర్మింప వలసినదిగ దానిపై బృందావనమును నిర్మింప వలసినదిగ ఆజ్ఞాపించిరి.
ఆ పవిత్ర ప్రదేశమందే కృతయుగములో ప్రహ్లాద మహారాజ రూపములో తాను అనేక యజ్ఞములను జేసితినని వివరించెను. శ్రీవారి ఆజ్ఞానుసారముగ తత్ క్షణమే భూగృహము నిర్మాణ మయ్యెను. దానిపై శిలలచే చెక్కబడిన బృందావన ముంచబడెను.
జై గురు రాఘవేంద్ర
*****
శ్రీ రాఘవేంద్ర
కల్పవృక్షము
21 వ భాగము
సమాప్తము**
💥🌸💥🌸💥🌸
🙏 ఓం నమో శ్రీ రాఘవేంద్రాయ నమః 🙏