శ్రీ రామునికి హనుమ చేసిన హిత బోధ
రావణుడి దురా లోచనాలకు విసిగి పోయాడు విభీషణుడు .ఎన్నో హితవు మాటలు చెప్పాడు అన్న రావణునికి .అయినా అతని చెవికి యెక్క లేదు .పైగా కోపించాడు .ఇక లంకలో వుండటం శ్రేయస్కరం కాదని నిర్ణయించుకొన్నాడు విభీషణుడు .రాముడు శరణాగత రక్షకుడు అని తెలుసు ,అంతే కాదు తాను మొదటినుంచి విష్ణు భక్తుడు కూడా .అందుకే లంకను ,అన్నను వదిలి శ్రీ రాముని దగ్గరకు చేరి శరణాగతి కోరాడు .సుగ్రీవుడు మొదలైన వారంతా విభీషనుడిని దగ్గరకు చేర్చ వద్దు అని రామునికి సలహా చెప్పారు .అప్పుడు చిరునవ్వు నవ్వి రామ చంద్రుడు మతిమంతుడైన హనుమను సలహాచెప్ప మనికోరాడు .హనుమ సాకల్యం గా అన్నీ ఆలోచించాడు .కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లుంది పరిస్థితి .సరి అయిన నిర్ణయం రాముడే తీసుకో గలడు .కాని అందరి అభిప్రాయాలు తెలుసు కో గోరాడు రాముడు .అది రాజ లక్షణం .సమస్యను అన్ని కోణాల నుంచీ ఆలోచించాలి .తాత్కాలిక ఉద్రేకం తో ,ఆవేశం తో నిర్ణ యాలు తీసుకొంటే మొదటికే మోసం .ఆ సంగతి రామునికి తెలియక కాదు .మనస్తత్వాలను పరీక్షించటం ఆయన పధ్ధతి .అందుకే సమస్యను అందరి ముందు ఉంచారు .అందరి స్పందన విని చివరగా హనుమను తన మనసు లోని మాటను తెలియ జేయమన్నాడు .
హనుమంతుడు ప్రభువైన రామునికి ఇలా తెలియ జేశాడు ”ప్రభూ !రామ చంద్రా !నీకు తెలియక కాదు నన్ను అడిగింది ,ప్రజాస్వామ్య పద్ధతికి ,ప్రజల మనోభీస్టాలను తెలుసుకొని నిర్ణయం తీసుకోవటానికే నీవు ప్రాదాన్యతనిస్తావు .నువ్వు శరణాగత రక్షకుడివి అని పేరు పొందావు .నీ మంత్రులు చెప్పిన వాటి లో నాకు నిజం కనిపించటం లేదు .విభీషణుడు మన రహస్యాలను తెలుసుకోవతానికే వచ్చాడని వీళ్ళు అందరు అంటున్నారు .అలా అయితె వేషం మార్చుకొని వస్తాడు కాని నిజ రూపం తో వస్తాడా /ఆలోచించు .లోపల వున్న భావాన్ని ఎవరైనా దాచగలరా .ముఖం లో ఆ భావం ప్రత్యక్ష మావుతూనే వుంటుంది .రావణుని తమ్ముడికి నువ్వు శరణు ఇచ్చావంటే నీకు అంత కంటే గొప్ప ప్రతిష్ట ఏముంది ?శరణు అన్న వాడు శత్రువు ఎలా అవుతాడు ?అయినా శత్రువుకు కూడా నీవు శరణం ఇస్తానని ప్రతిజ్న చేసిన వాడివి కదా .అంతే కాదు యితడు మనం లంకలో ప్రవేశించిన తర్వాత నీ దగ్గరకు శరణు అని వస్తే ,అది శత్రు దేశం కనుక అనుమానించవచ్చు .అతను దేశం వదిలి మనం వున్న చోటికి వచ్చాడు .భయపడాల్సిన పని లేదు .
”విభీషణుడు కాలజ్ఞుడు .జరగ బోయేది అతనికి తెలుసు .తన మాతృభూమి అయిన లంకను కాపాడుకోవాలనే తాపత్రయం అతని లో కనిపించింది నాకు .వంశ నాశనం రాక్షస నాశనం అతనికి ఇష్టం లేదు .యుద్ధం వల్ల జరిగే అనర్ధం అంతా అతనికి తెలుసు .అందుకని ముందే ఆ వినాశనం జరగకుండా నిన్ను శరణు కోరాడు .అతని మాటల్లో తేడా ఏమీ లేదు .రావణ సభలో అన్న ను ఎదిరించి నా తరఫున ధర్మ పక్ష పాతం గా మాట్లాడాడు .సుగ్రీవుడు అన్న వాలికి భయ పడి పారి పోయి ,నిన్ను ఆశ్రయించి నీతో సఖ్యం చేసి ,వాలిని నీతో చంపించి కిష్కింధకు రాజి నాడు .అలానే విభీషణుడు నీ ప్రాపు కోరి వచ్చాడు .రావణ సంహారం తర్వాత తాను లంకకు రాజు అవాలనే అభిలాష అతనిలో వుంది .ఇది సహజం .అతను మనతో వుంటే లంక లోని రహస్యాలన్నీ మనం తెలుసు కో వచ్చు .అతడు ధర్మ పక్షపాతి .నువ్వూ అంతే .కనుక విభీషణునికి అభయం ఇవ్వటం లో ఏ ప్రమాదము ఉండదని నా అభిప్రాయం .నాకు తోచింది చెప్పాను .నువ్వు రాజువి నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే ”అని ముగించాడు వివేక వంతుడైన హనుమ . శ్రీ రాముడు హనుమ చెప్పిన విషయాలను సాకల్యం గా విన్నాడు .అతని దూరద్రుష్టినీ ,రాజనీతిజ్ఞాతను మెచ్చాడు .”మాకు మొక్కిన వారి చేతులు నరకటం మా సాంప్రదాయం కాదు .అది క్షత్రియోచితం కూడా కాదు .అభయం ఇచ్చాను .కనుక సగౌరవం గా విభీషణునికి స్వాగతం పలకండి రాక్షస రాజుకు ”అన్నాడు .రాక్షస రాజు అని రాముడు అన్న మాట హనుమ గ్రహించాడు .అందులోని ఆంతర్యం మతిమంతుడైన హనుమ గ్రహించాడు .రాముని హృదయం హనుమకు ,హనుమ హృదయం రామునికి తెలుసు .పరెంగితావగాహన వారిద్దరిది .ఈ విధం గా మంచి సలహా నిచ్చి ,రామునికి నమ్మిన బంటుగా విభీషనుడిని చేసి చివరికి విభీషణునికి లంకా రాజ్య పట్టాభిషేకం జరగ టానికీ కారకు డైనాడు మారుతి .కార్య సాధనకు సమయోచిత మైన సలహా చెప్పాలి .బలం ,నీతి బుద్ధి ,సరస సంభాషణం ,మృదు భావం ,సత్య పాలన ,వివేకం వున్న వాడు కనుకనే హనుమ రాముని మనసును దోచుకొన్నాడు .విభీషణుడు రాముని దగ్గరకు చేరటం తో లంక పూర్తిగా అధర్మ మై పోయింది .ధర్మ చ్యుతి జరగటం వల్ల లంకను జయించటం తేలికయినది .రావణ వధానంతరం రామునికీ అయోధ్య పీఠం దక్కి చక్రవర్తి అయాడు .ఒక గొప్ప సలహా తో రెండు కార్యాలు నిర్విఘ్నం గా నెర వెరచిన ఘనత సంపాదించాడు వాయుసుత హనుమ