*ముద్రమాల ధరించినచో పాటించవలసిన విధులు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
మాల ధరించి వ్రతముండు మండల కాలము నందు శని , బుధవారములలో లేక ప్రతిరోజూ (వీలయిన మరీ శ్రేష్ఠము). భజనమందిరము లందు లేక తమ స్వగృహముల యందు సాయంకాలము వేళలో అయ్యప్ప స్వామిని తలచి పూజయూ , భజనలు మొదలగునవి జరుపవలెను. కన్నిస్వాములైనచో *"మాళిగైపురత్తమ్మను" తృప్తి పరచుట కొరకు "కన్నిపూజ"* లేక సమిష్టి పూజ చేయవలెను. ఈ పూజలు చిన్న చిన్న పూజలుగానూ లేక పెద్ద ఎత్తుననూ వారి వారి శక్తి కొలది జరుపవలెను. ఇవిగాక శాస్తాపాటలు , అయ్యప్ప పాటలు , ఆయి పూజ (కర్పూరగుండము), విళక్కు పూజ అనికూడా బృందముగా గూడి జరుపుదురు. ఈ పూజలయందు ప్రధాన అంశముగా సాధువులకు అన్నదానము చేయు కార్యక్రమము తరతరముల నుండి వచ్చుచున్నది.
ఎంతటి జరుగుబాటు లేని వాడైననూ కనీసము ఇద్దరికైననూ భోజనమునిడియే శబరిగిరి యాత్ర చేయుట సాంప్రదాయము. తరువాత కార్యక్రమము ఇరుముడికట్టు నింపుట. ఇరుముడి కట్టి యాత్ర బయలుదేరు సమయమున గూడా పేదలకు అన్నదాన మొసంగి శాస్తా భజనలు చేసి , పూజలు చేసి , శరణుఘోషలు పలుకుచూ మహావైభవోపేతముగా ఈ కార్యక్రమము జరుపువారూ అనేకులు కలరు. మంగళ వాయిద్యములతో , దీపాలంకార శోభితమైన పవిత్ర స్థలమునందు అయ్యప్ప కీర్తనలు , భజనలు చేయుచుండ , శరణములు చెప్పుచుండ ఇరుముడులను అయ్యప్పస్వామిని తలచి కట్టుదురు. ఈ కట్టు నింపుటకు గురుస్వామి తప్పక కావలెను. అందులకు కారణమేమనగా కన్ని స్వాములకు కట్టు నింపు పద్ధతిలో ఎక్కువ అనుభవము ముండక పోవుటయే. దైవకార్యమైన ఇరుముడి కట్టు అనుభవము లేక పలుమార్పులతో కట్టిన అనేక కష్టములకు హేతువగును. అందువలననే పళమస్వాముల చేతనే ఇరుముడి కట్టునింపుట అనాదిగా వస్తున్న సాంప్రదాయము.
ఇరుముడి కట్టును ఆలయ ప్రాంగణమున లేక భజన మందిరముల యందే సాధారణముగా నింపుదురు. కట్టునింపు పూజ ఇంతకాలములోనే చేయవలయునని కాల నిబంధన లేదు. స్వగృహములందయినచో గణపతి , సుబ్రహ్మణ్యుడు , ధర్మశాస్తా వారిని సంకల్పించి చిత్రపటములను పీఠముపై పెట్టి పూజించి కర్పూరము వెలిగించి దీపారాధనలు జరిపించి , శరణుఘోషతో కట్టునింపవలెను. *మొదట కట్టునింపుట కన్నిస్వాముల నుండి ప్రారంభించవలెను.*
ఈ కలికాలమందు శబరిగిరి యాత్ర ఒక విహార యాత్ర క్రింద పరిణమించి యున్నట్లే గోచరించుచున్నది. దీనికి నిదర్శనము ఎటేటా పెరుగుచున్న భక్తుల వ్రతానుష్ఠాన పద్ధతి. యాత్రికుల సంఖ్య పెరిగినదని సంతోషించుటకు వీలులేదు. ఎంతమంది పెద్దలు చెప్పిన వ్రతానుష్ఠాన పద్ధతులతో యాత్ర చేయుచున్నారన్నదియే ప్రస్తుత ప్రశ్న సందేహము. శబరిగిరి యాత్ర వలన కలుగు పుణ్యమేమి ? లాభమేమి ? దీని మహత్యమేమి ? అని తెలియకనే పలువురు యాత్రకు వెళ్ళుచున్నారు. అగ్ని తెలిసి ముట్టుకొన్ననూ , తెలియకముట్టుకొన్ననూ కాలును. అట్లే శబరిగిరి యాత్ర మహత్మ్యము తెలిసి చేసిననూ , తెలియక చేసిననూ పుణ్యము తానంతట అదియే వచ్చును అని వాదించువారు అనేకులు కనపడుచున్నారు. కాని వారికి తెలియదు. వారు చెప్పెడి ఉపమానమునకూ , శబరిగిరి పుణ్యఫలమునకు సంబంధము లేదని , శబరిగిరి యాత్ర అగ్ని వంటిదని మాత్రము నిష్ఠ పాటించని వారు తెలిసికొనుట అత్యావశ్యకము.
వ్రతానుష్ఠానముతో శబరి గిరీశ్వరుని దర్శనము చేసికొనెడి వారికి ఆ శబరీశుడు శరత్కాల పూర్ణిమ చంద్రుడు. వ్రతానుష్ఠానములను సరిగ్గా పాటించి రన్న వారికి భగవంతుని యెడ అత్యంత శ్రద్ధాభక్తులున్నట్లే గదా ! అట్లు శ్రద్ధాభక్తులు లేక హాస్యపూరితముగా , విలాసముగా పదునెట్టాంబడి త్రొక్కి యాత్ర చేసిన వారి పాలిట ఆ శబరీశుడు ప్రచండ రోహిణీకార్తె యందలి మధ్యాహ్నిక భానుడు. అటువంటివారిపట్ల అగ్ని తెలియక ముట్టుకున్ననూ , తెలిసి ముట్టుకున్ననూ కాలును అన్న సూత్రము వర్తించుట నిజము. వారు తెలిసి నిర్లక్ష్యముగా యాత్రకు వెళ్ళిననూ , తెలియక యాత్రకెళ్ళిననూ ఫలితము ఉపమాన సదృశ్యమే. వ్రతనిష్ఠలు మనసా , వాచా , కర్మణా పాటించక ఏదియో పరచుకొనుటకు ఒక దుప్పటి , తగిలించు కొనుటకు ఒక పక్క సంచి , కొంత ధనమూ కలిగినచోచాలునని తీర్ధయాత్రకు బయలుదేరువారు అనేకులుంటున్నారు. ఒక గురుదేవుని ఆవశ్యకతయూ వారికక్కరలేదు ఒకవేళ ఇక ఏదో మాల వేసికొనుటకు ఒక గురువుకావలయును గాన ఎవరినో ఒకరిని సమయమునకు గురువుగా చేసికొందురే గాని ఆయనపై ఎలాంటి భక్తిగాని , గౌరవముగాని లేకుండా యుందురు.
*"ఇట్టివారికి ఏమియు కష్టములు కలగలేదే ! అట్లు కలుగగా మేము చూడలేదే ! మీరెట్లు వ్రత నిష్ఠలు పాటించి వెళ్ళివచ్చియున్నారో వారూ అట్లే యున్నారు. ఇంకా చెప్పవలయునన్న మీదు మిక్కిలి మీకంటే సంతోషంగా ఉన్నారు"* అనువారు లేకపోలేదు. కాని కాసినకాయ వెంటనే పక్వమయి పండు కాదుగదా ! దేనికైనా సమయము కావలెను. శిశుపాలుని యొక్క నూరు తప్పులను శ్రీకృష్ణుడు క్షమించి ఊరుకొన లేదా ? అట్లే క్షమించగలిగినంత వరకూ ఆ అయ్యప్ప స్వామియూ క్షమించగల్గును. మిక్కిలి అవిధేయతకు కావలసిన ఫలితము వారే అనుభవించక తప్పదు. ఇకపోతే మనిషికి గల కష్టములు అందరికీ తెలిసేటట్లు ఉండవు. కొందరు పైకి *"ఏ కష్టములు లేవు"* అనుకొనేవారికి మానసికముగా ఎన్నో బాధలుండవచ్చును. ఎన్నో ఎదురుదెబ్బలుండ వచ్చును. తప్పు చేసితిమన్న భావనయే చాలు మనిషి కృంగిపోవుటకు. కావున చేసెడి పని ఏదైనా చిన్నదైనా , పెద్దదైనా చిత్తశుద్ధి కలిగి చేయవలెననియే నా ప్రార్థన. ఇక అందరునూ ఇట్లే వ్రతనిష్ఠలేక యున్నారని చెప్పేవీలులేదు. ఎందరో మహానుభావులున్నారు. వారు మనోవాక్కాయకర్మలా భగవంతునే స్మరించుచూ , చెప్పబడిన వ్రతదీక్ష ప్రకారము నడచి వెళ్ళి వచ్చుచున్నవారూ ఉన్నారు. వారి పుణ్యఫలము కూడా ఈ రోజు కాకున్న మరికొంత కాలమునకైనా సత్ఫలితము ఇవ్వక మానదు.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*🌹🙏