*ప్ర* : *శివలింగానికి ఆది, అంతం తెలుసుకోలేక బ్రహ్మ విష్ణువులే తమ అశక్తి తెలుపకున్నారు.* *అలాంటిది మనం చిన్నలింగం చేసి దాని మీద నుంచి* *అభిషేకం చేస్తాం? భక్తితో లింగాన్ని చిన్నది చేసుకొని* *అభిషేకం చేయవచ్చు అనుకోండి. అయితే బ్రహ్మ, విష్ణువులకు భక్తి లేదంటారా?* *నిజమైన భక్తి కలవారు కోటికి ఒకరుంటారు. మనం చేస్తున్న అభిషేకం అపచారం అంటారా?*
*భగవంతుడు సర్వాంతర్యామి.* *అంతటా ఉన్నాడు.మనం పూజచేసేటప్పుడు ఆహ్వానం, ఉద్వాసన చెబుతాం.* *ఎల్లవేళలా, అంతటా ఉన్నవానికి ఆహ్వానం, ఉద్వాసన-అర్థం ఏమిటి?*
జ : అద్యంతాలు లేనిది శివతత్త్వమని, దాంతో మనస్సును అనుసంధానం చేసి ఆ తత్త్వంతో తన్మయం చెందడానికే - శివ లింగాన్ని చేసుకొని అభిషేకించడం. మన పూజలో ఉండే 'ఆవాహన'లోని అంతరార్ధమదే. సర్వవ్యాపకుడైన సర్వాంతర్యామిని సర్వత్రా అనుభవించలేని అవిద్యాపూరితులం. సుఖాన్నీ, దుఃఖాన్నీ, మంచినీ, చెడునీ కూడా ఈశ్వరతత్త్వంగా దర్శించగలిగే ద్వంద్వాతీత జ్ఞానస్థితిలో ఉన్నవారు మాత్రమే ఆ సర్వవ్యాపక తత్త్వాన్ని అనుభవించగలుగుతారు. సర్వత్రా ఆయనను దర్శించేందుకై సాధనగా - ఒక ప్రతీకలో ఆవాహనాదులతో ఉపాసిస్తాం. భావన, శబ్దం (తంత్రం) కలసి - సర్వవ్యాపక దేవతాశక్తిని కేంద్రీకరించి ఆవహింపజేస్తాయి. అది సూక్ష్మ ప్రపంచంలో జరిగే ఒక సత్యం. పూజానంతరం-మన హృదయంలో ఆ శక్తిని ప్రతిష్ఠ చేసుకోవడమే 'ఉద్వాసన'. ఇంతేకాక దేవతాశక్తుల స్థానం - సూక్ష్మ జగత్తులోనిది. అక్కడి నుండి మన 'శ్రద్ధ'తో ఆవహింపజేసి, వాటి అనుగ్రహాన్ని అర్థించి, తిరిగి వారిని స్వస్థానం లోకి సగౌరవంగా సాగనంపడమే 'ఉద్వాసన'. బ్రహ్మ విష్ణువులు శివలింగపు తుది మొదళ్ళు తెలుసుకోలేకపోయారనడంలో ఉద్దేశం వారికి భక్తి లేదని కాదు. భక్తునికి కూడా పరమేశ్వరుడు అంతుపడతాడా? అతనితో తన్మయం చెందడమే భక్తునికి సాఫల్యం. బ్రహ్మ విష్ణుల గాథలో అనంత కాల స్వరూపాన్ని, అఖండ బ్రహ్మతత్వాన్ని తెలియజేయడమే ఉద్దేశం. కారణావస్థ అయిన లయంగా-అనంతంగా ఉంది. సృష్టి, స్థితులు ఒక పరిమితమైన మార్పులు మాత్రమే. ఇదే ఆ కథలో అంతరార్థం. అయితే భగవత్ శరణాగతిలో, భక్తితో ధర్మాచరణ జరగాలి. ధర్మం లేని భక్తికి బలం ఉండదు. 'యావత్ శక్తి' ధర్మాచరణతో కూడిన భక్తి బలపడాలి. 'భక్తి' అంటే భగవంతునిపై అచంచలమైన ప్రేమ. కామ్యాల తీరడానికి చేసే పనికాదు కదా!