*అయ్యనార్ (అయ్యప్ప)*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
ఇది సంస్కృత ఆర్య శబ్దమునుండి జనించిన తమిళ భాషా పదము. ఇది తమిళ దేశముల యందలి ఒక దేవత పేరు. ఉత్తర హిందూ స్థానంలో ఈ దేవత గురించి ఏమీ తెలియదు. కాని ఆర్య - హరిహర పుత్ర శాస్తా - మహాశాస్తా నామములతో ద్రావిడులకు - చిరపరిచితమైనదే. తమిళ దేశమున సుబ్రహ్మణ్య దేవుని వలె మళయాళము నందు అయ్యనారుకు అసంఖ్యాక దేవాలయము లున్నవి. మళయాళ దేశములో (కేరళ) ప్రతి దేవాలయము యొక్క నైరుతి కోణమున శాస్తా గుడి వుండవలెనని దేవాలయ నిర్మాణ నిబంధము లందొక నియమమున్నది. హరిహర పుత్ర , ఆర్య నామములతో కన్న శాస్తా నామముతోనే కేరళ యందితనిని ఎక్కువగా కొలుతురు.
అచ్చట ఇతడు క్షేత్ర పాలకునిగా గణింప బడును. పడమటి కనుమల యందలి ఎనిమిది పర్వతముల మీద ఇతనికి ఎనిమిది దేవాలయములు కలవు. పర్వత మాలికల పశ్చిమ మందలి మళయాళీ జన నివాసమగు దేశమును బాహ్యోప ద్రవముల నుండి , అరిష్టముల నుండి కాపాడుటకు పైనచెప్పిన ఎనిమిదింటి యందును ఎనిమిది శాస్తా మూర్తులు స్థాపింపబడి యున్నవి. ఇతడు గ్రామ దేవతగా కాక గ్రామ పాలక దేవతలలో ఒకడుగా వున్నాడు. అందువలన ఇతడు భూత పిశాచావృతుడై యుండును. శాస్తా అని పేరుకు వ్యాకరణ రీత్యా దేశ శాసకుడని అర్ధము. ప్రపంచాన్ని తన వశమందుంచుకొని శాసించు వాడగుటచే ఇతనికి శాస్తా నామమీయబడినది. తమిళ వ్యాకరణంలో శాత్తన్ (శాస్తా) శబ్దము కర్తగ ఉపయోగింపబడు చుండుట వలన ఇతనికి తమిళ దేశమున విస్తార ప్రచార ముండినది. కాని ఇప్పుడా ప్రచారము కేరళ , ఆంధ్రదేశములందు విరివిగా ప్రచారములో వున్నది. తమిళ నిఘంటువులు ఇతనిని శాతవాహనుడని పేర్కొని యున్నది. క్రైస్తవ శకారంభ మందలి శతాబ్దాలలో శక్తిమంతులగు రాజుల వంశనామ మగుటచే శాతవాహన నామము మంచి ప్రచారంలో వుండేది. కాని శాతవాహనులతో యీ దేవత కెట్టి సంబంధము లేదు. తమిళ నిఘంటు కౌమరితనికి "కారినామక శ్వేత కరివాహనుడు. చెణ్ణు ఆయుధ ధారి , పూరణా పుష్కలా ప్రియుడు. ధర్మ రక్షకుడు , యోగి" ఇత్యాది నామము లొసంగి యున్నారు. ఇతని వాహనము ఏనుగు. పతాక లాంఛనము కుక్కుటము"
యోగి , ధర్మ పాలకుడు మొదలగు వానికి అమర కోశంలో బుద్ధుడు , శాస్తాయని పేర్కొనబడి యుండుటం బట్టి బుద్దుడే తమిళదేశంలో యీ విధంగా పూజింపబడుచు , చివరకు హిందూ. దేవతల యందు చేర్చబడి కాలాంతరమున ఇతని ఉత్పత్తి నిమిత్తమొక పౌరాణిక గాథ కల్పింపబడె (హైందవ మూర్తి శాస్తా చరిత్ర పుట 488) నని పూర్వోదాహృత నామ లక్షణాదులను బట్టి గోపీనాధరావు గారు నిశ్చయించుట సమంజసమే.
ఈ చోద్యమైన దేవతను గూర్చిన సమాచారము విష్ణు పురాణము , శ్రీ భాగవతము , పద్మ సంహిత , అంశుమన్ భేదాగమము , సుప్రభేదాగము. పూర్వకారణాగముల యందు గలదు. ఇతని పుట్టుకను గూర్చిన గాధ - ఎట్లన క్షీర సముద్ర మధనా - నంతరము అమృతము వెలువడిన తోడనే దానిని పంచుకొను విషయమున దేవ దానవులకు పోరు జరుగగా అప్పుడు విష్ణువు మోహిని యనుపేర సుందర రూపము దాల్చి అమృత పానము కేవలము దేవతలకే లభించు లాగున అసురులు వంచింపబడి వారి ఎదుటనే పంచు చుండ , మూర్ఖులు మాయా మోహితులగు వారు తమ కలహ కారణమునే మరచి , ఆమె అందమున కాకర్షితులై ఆమెనే చూచుచుండిరి.
శివుడు కూడా ఆమెను చూచి మోహితుడై ఆమెను గూడెను. తత్ఫలితంగా హరి హర పుత్రుడుదయించెను. ఇతనికే ఆర్య , శాస్తా , అయ్యవారని పేర్లు గలవు. ఇదియొక విలక్షణమైన ద్రావిడ దేవత అనియు , కాలాంతరమున ఆర్య దేవతా గణములు చేర్చబడి గ్రామములను కాపాడు దేవతగా పూజలందు చున్నాడు. ఇతనిని చాలవరకు తక్కువ జాతులవారు (ట్రైబల్స్) పూజించేవారు. ఇతని గుడిలోని పూజారి కూడా శూద్రుడే. పద్మ సంహితాను సారము అయ్యనారు గుడిలో పూజ చేయవలసిన వాడు బ్రాహ్మణునకు శూద్ర స్త్రీ యందు జనించిన అనులోమ జాతుడగు సారశవుడు. కాని మలబారు అయ్యవారు నంబూద్రి బ్రాహ్మణుల చేత
పూజించబడుచున్నాడు.
అంశుమన్ భేదాగమము , సువ్ర భేదాగమము , పూర్వ కారణాగమము లందీ విచిత్ర మూర్తి వర్ణన ఈ విధంగా వుంది.
1) అంశుమన్ భేదాంగమము : ఆర్యుని పద్మాసనాసీనుని చేయవలెను. ఇతనికి నాలుగు చేతులు , ముందరి దక్షిణ వామ హస్తములు అభయ వరద సూచకములు - వెనుకవి దక్షిణ వామ హస్తములలో క్రమముగ కత్తి , డాలు వుండును. ఇతనికి మూడు కన్నులు శాంతమైన ముఖము బంగారు రంగు కల్గి ఇతడు పీత వస్త్ర ధారియై వుండవలెను. ఇతని గుడి కెదురుగా గుఱ్ఱము , ఏనుగు మరియు ఇతర జంతువుల విగ్రహము లుంచబడియుండును. ఇవి వారి రాత్రి విహారమున వాహనములుగా ఉపయోగ పడును. మదన , వర్ణని అను ప్రియురాండ్రే పూరణై పుట్కలై (సం. పుష్కల) అని వ్యవహరింపబడును. ఇతనికి జైన మూర్తులయందును స్థానము గలదు. ఇతని కచట బ్రహ్మ దేవుడని పేరు. ఇతడు 10వ తీర్థంకరుడగు శీతలానాథునిగ , యక్షుడుగ నుండును. ఇతని ప్రియురాండ్రును ఉచిత స్థానములందుందురు.
పావాడైరాయన్ , మధురై వీరన్ అనే ఇరువురు సేనానులు. ఈ మధురై వీరన్ ఇతర గ్రామదేవతలలో నొకడు. వీరిలో ముఖ్యుడు కరుప్పణ్ణ స్వామి. అయ్యనారుని నియత మతానుయాయులగు కల్లరు స్వామిని పూజింతురు. కుట్టి శాత్తాన్ , శాత్తన్ కరుప్పన్ , ముండన్ , గుళికన్ అనునవి అయ్యనారుని సేవకుల లోని కొందరు క్షుద్ర రాక్షసుల పేర్లు.
2) సుప్రభేదాగమము : ప్రపంచ శాసకుడగుట వలన శాస్తా అనబడును. ఇతనికి రెండు కన్నులు , రెండు చేతులు , కుడి చేతియందు వంకర కర్ర (తమిళంలో దీనికి చెణ్ణు అనిపేరు) ఎడమ చేతిలో ఫలములు , పల్లవములు , భూతాకృతి , పెద్ద పొట్ట , తలపై నల్లని వెంట్రుకలు , తెల్లని యజ్ఞోపవీతము , అనేక ఆభరణము లుండును. చేతులు కాళ్ళు ముడుచుకొని యుండును. ఇతనికి కుక్కలు , కోళ్ళు , గొట్టెలు మొదలగు వానితో ఆడుకొను చున్నట్లగుపడును. ఇతనికి మదన - వర్ణని యను ఇద్దరు భార్యలు ఇరు ప్రక్కల నుందురు. ఇతని ఎడమవైపున కురూపుడగు దమనకుడు (సేవకుడు) వుండును.
3) పూర్వ కారణాగమము : శివుని వలన మోహిని యందు ఉద్భవించిన పుత్రుడను నీయాగమ మందలి విషయము అంశుమన్ భేదాగమ మందలి వృత్తాంతముతో సరిపోవుచున్నది. కాని సుప్రభేదాగమమున చెప్పినట్లు రెండు కన్నులు, రెండుచేతులు గలిగి ఇతడు నల్లగ నుండవలయునని యున్నది. ఇతనిని పీఠముపై కూర్చుండ బెట్టి ఎడమకాలు క్రిందికి వ్రేలాడుచుండు లాగునను. కుడికాలిని ముడుచుకొని పీఠము మీద నిలువుగా నుంచుకొనునట్లు చేయవలెను. కుడి మోకాలిమీద చాచిన యెడమ మోచేయి ఆని యుండవలెను. కుడిచేతిలో వజ్ర దండము. ఇదియే వంకర కర్ర యువకుడై , శాంతమైన ముఖము , నీలి నలుపు తల వెంట్రుకలు , సిరా రంగువలె నుండి విడివడి యుండవలెను.
ఇతని వాహనము , పతాక లాంఛనముకూడా ఏనుగే. ఇతని ప్రక్కనే ఒక సుందరి యుండవలెను మరియు నల్లని గుఱ్ఱము గాని , తెల్లని యెద్దుగాని ఇతని వాహనముగా యుండవచ్చును. నాలుగు చేతులు కూడా యుండవచ్చును. పతాక లాంఛనముగా కుక్కుటము వుండవచ్చును. ఇతనిని యోగిగ చూపవచ్చును. యోగాసనమున కూర్చుండబెట్ట వలయును. ఇతడు వేదాధ్యాయి వలె వ్రేళ్ళయందు పవిత్రమును (దర్భలు) ధరింపవలెను. వీరాసనమున కూర్చుండబెట్ట వచ్చును. అప్పుడతని ఉత్తరీయము ఉపవీతము లాగున వుండవలెను. సుఖాసీనుని చేసినప్పుడు వంచిన కుడిపాదము వ్రేలాడుచుండు ఎడమకాలి తొడమీద ఆను నట్లు చేయవలెను. దృష్టికూడ కాలిపై నిలిపి యుండవలెను.
ఇలాంటి రూప , గుణగణములతో గూడిన స్వామిని భార్గవరాముడు , శాంతమూర్తి గావించి , పట్టబంధముతో యోగాసన మూర్తిగా శాంతస్థితిలో , శబరిమలపై ప్రతిష్ఠించి యున్నారన్నది ప్రతీతి. ఇంకను ఈ స్వామిని గూర్చి మనము తెలుసుకొనవలసిన గుప్త విశేషము అనేకములు కలవు. ప్రాచీన గ్రంథములను తిరగవేస్తున్న అన్వేషితులు శాస్తా అనబడు ఈ స్వామివారిని గూర్చి పరిశోధిస్తూనే యున్నారు. కాని భగవంతుని లీలలు అనంతం వాటిని తెల్సుకొనుట అసాధ్యం. అయినప్పటికి తెలిసి యుంచుకొనుట అత్యవసరం.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*