_అయ్యప్ప సర్వస్వం - 70_* యుగాతీతుడు అయ్యప్ప - 4*

 *


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*యుగాతీతుడు అయ్యప్ప - 4*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️




స్కాంద పురాణము నందలి సనత్కుమార సంహిత బ్రహ్మవృత్తపుర మహత్యము నందలి ప్రశంస - క్షేత్ర స్వభావకాండము , చంపకారణ్య మహత్మ్యము నందలి రామతీర్థ వైభవము , భద్రకాళి దుర్గా తీర్ధము , గంధర్వ శాప విమోచనము , శాస్త్రృ మహత్యము మున్నగునవి (పదునాల్గవ అధ్యాయము) చెప్పబడియున్నది.


చంపకారణ్యము అనునది ప్రస్తుత తమిళనాడు తిరునెల్వేలి జిల్లా , పాలయంకోట్టై అను స్థలమగును. ఇచ్చట నేటికిని శాస్తా ఆరాధన మిక్కిలి వైభవోపేతముగా జరుపబడు చున్నది. ఇచ్చటి స్థలపురాణము నందలి బహుపుణ్యుడు అను రాజునకు కణ్వమహర్షి చెప్పిన గాథను సూతముని నైమిశారణ్య మహర్షులకు చెప్పినారట. అదేమనగా త్రేతాయుగమున (శ్రీ రామావతారయుగము) చంపకారణ్యమున శంఖుకర్ణుడు , హస్తికానుడు , మహాకాయుడు , మహాపాదుడు , మహోదరుడు , వుల్కాముఖుడు , శిలాకాయుడు , భూతి వక్త్రుడు , తాల జంగుడు మున్నగు రాక్షసులు ఋషులను హింసించుచుండిరి. ఉగ్రతపసి అను ఋషీశ్వరుల వారు తామ్రవర్ణి నదీతీరాన *'హరిశిల'* అను స్థలము వద్ద శ్రీ శాస్తా వారిని గూర్చి తపము చేయగా కర్తవ్యోన్ముఖులైన శ్రీ శాస్తావారు అచ్చట ప్రత్యక్షమై ఆ రాక్షసులను సంహరించి ఋషులను కాపాడినట్లుగా చెప్పబడియున్నది.


చిదంబర రహస్యము అను పురాణమునందలి రెండవ అంశము నాల్గవ అధ్యాయమున వ్యాస మునీంద్రులు సూత పౌరాణికులకు శ్రీ శాస్తావారి మహిమలను చెప్పగా దాన్ని వారు నైమిశారణ్య మహర్షులతో వ్యాఖ్యానించినారు. అందులో వర్తక జాతిలో పుట్టిన వర్తకుడొకడు కర్మవసాత్ ఆర్థికపరంగా దెబ్బతిని దొంగగా మారి సుబ్రహ్మణ్యస్వామి వారి ఆభరణములను తస్కరించుటకు పోయెను. వాన్ని బెదరగొట్టి ఆ ఆభరణములను తిరిగి శ్రీ శాస్తావారు తెచ్చి బుధుడు అను బ్రాహ్మణుని మూలాన శ్రీ సుబ్రహ్మణ్యునికే సమర్పించినట్లుగా అప్పటినుండి ఈ శాస్తా రక్షా మూర్తిగా ఎన్నుకోబడ్డట్టుగాను చెప్పబడియున్నది. అందులకు నిదర్శనమువలె చిదంబరం నటరాజస్వామి వారి ఆలయపు ఎనిమిది దీక్కులయందును శ్రీ శాస్తావారి ఎనిమిది అవతార ప్రతిమలను ప్రతిష్టించియున్నారు. అలా చిదంబరపు ఎనిమిది దిక్కులనుండి గ్రామ రక్షకమూర్తిగా వెలసిన శ్రీ శాస్తావారు కీర్తించబడియున్నారు.


చిదంబరం ఆలయములో ఎనిమిది దిక్కులయందు ప్రతిష్టించబడియున్న ఎనిమిది శాస్తావారి నామధేయములు 

1. మహాశాస్తా , 

2. జగన్మోహన శాస్తా , 

3. బాల శాస్తా , 

4. కిరాతశాస్తా , 

5. ధర్మశాస్తా , 

6. విష్ణు శాస్తా , 

7. బ్రహ్మ శాస్తా , 

8. రుద్ర శాస్తా. 


ఈ ఎనిమిది అవతారములు గాక 

9. విశ్వ శాస్తా , 

10. శిల్ప శాస్తా ,

11. కాల శాస్తా , 

12. యోగ శాస్తా , 

13. ఆకాశ శాస్తా , 

14. ఆపదుద్ధారక శాస్తా , 15. వనపతి శాస్తా , 

16. యామ శాస్తా అను పలు శాస్తా అవతారములు గలవు.


పైన చెప్పబడిన శాస్తా అవతారములలో విష్ణుమాయ అనబడు కిరాతశాస్తా , అర్జునుడు పాశుపతాస్త్రము పొందగోరి పరమేశ్వరుని గూర్చి తప మొనర్చగా పరమేశ్వరుడు కిరాత రూపమున (బోయవాడు) పార్వతీ సమేతముగా అచ్చట ఆవిర్భవించిరి. అప్పుడు వారితో పసిబాలుడైన కిరాతరూప శాస్తావారు గూడా విచ్చేసి యుండిరి. అప్పుడు అర్జునుడు వేటాడిన పందిని స్వాధీనపరచుకొన్నది ఈ కిరాత రూపియేననియు , పిదప బ్రహ్మ వద్ద వరము పొంది బృంగాసురుని వధించినారనియు కొన్ని పురాణములలో చెప్పబడియున్నది.


ముందుగా తెల్పినట్లు భస్మాసుర కథలోని వరమేశ్వర మోహినీలకు హరిహర పుత్రునిగా జన్మించినది ఈ ధర్మశాస్తా వారే యని తెలిసినది. ఈ శాస్తా అవతార స్థలము కేరళ రాష్ట్రమగును.


ఫాల్గుణమాస ఉత్తర నక్షత్రము నందు అవతరించినట్టుగా శ్రీ ముత్తుస్వామి దీక్షితుల సాహిత్యము ద్వారా తెలియవస్తున్నది. శ్రీ శాస్తా అవతార కాల ఘట్టమున నేపాళ దేశమును ఫళింజనుడను రాజు పాలించుచుండెను. ఈతడు మరణాన్ని జయించగోరి ఒక మహాయజ్ఞము చేయుచు అందున దినమొక కన్యకను బలియిచ్చు చుండెను. కాళికాదేవి వరప్రసాదియగు ఫళింజనుని నేరమును ఖండించిన శాస్తావారు సద్భోధనలతో జరామరణములు తప్పదను ఆత్మప్రబోధను కల్గించెను. అందులకు కృతజ్ఞతగా తన పుత్రికయగు పుష్కళాదేవిని కాళ్ళు కడిగి కన్యాదానము చేసినట్లుగా ఒక పురాణములో చెప్పబడియున్నది.


తదుపరి కాలమున పింజకవర్మ అను రాజు కొచ్చిని రాజధానిగా చేసుకొని కేరళను పాలించుచుండెను. ఇతడు కపాలీశ్వర భక్తుడు. ఈతడొకమారు వేటకొరకు అడవికేతెంచి బృందము వీడి బహుదూరము వెళ్ళగా కానన మధ్యములో భూతప్రేత పిశాచములు చుట్టుముట్టి రాజును బెదరగొట్టెను. రాజు కపాలీశ్వరుని ధ్యానించగా ఈశ్వరుడు శాస్తావారితో పింజకవర్మను కాపాడి రమ్మని ఆజ్ఞాపించెను. శ్రీ శాస్తావారు తమ అమూల్య శక్తితో భూతప్రేత పిశాచములనణచి రాజును కాపాడెను. అందులకు సంతసించిన రాజు తన పుత్రికయగు పూర్ణాదేవిని శాస్తా వారికిచ్చి వివాహము చేయించెనని గూడా ఇంకొక పురాణములో చెప్పబడియున్నది.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!