శ్రీ మహాశాస్తా చరితము - 7 శాస్తా స్వరూప తత్వము

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శాస్తా స్వరూప తత్వము*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  (ABADPS)*

*ప్రతినిత్యమూ ఆపదల నుండి కాపాడువాడు. భక్తుల కోరికలను నెరవేర్చువాడు. శరణాగతి కోరు భక్తులతో ప్రత్యక్ష భాషణము చేయువాడు. శత్రుసంహారకునిగానూ , కులవృద్ధి గావించు కులదైవముగాను భాసిల్లువాడు సాక్షాత్తూ మహాశాస్తావే.*

- *శ్రీ శాస్తృస్తవము*

పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడు ఒక్కొక్కసారి అవతారము దాల్చుచూ , అశాశ్వతమైన మన
ఈ మానవజన్మను , మరల సత్యలోకమువైపునకు మరలించుటకై *'అన్నియూనేనే , అన్నింటినూ నేనే'*
అంటూ మానవలోకమును ప్రబోధము చేయుటకై అవతారము దాల్చినవాడు శాస్తా. భక్తునికి ఆత్మానందము , అనుభూతిని కలిగించుచూ , పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకొనుటకై పలు
లీలావినోదములను గావించు వాడు శాస్తా. *'ఈ నాటకరంగమునకు నటన సూత్రధారిని నేనే'* నన్నది శాస్తాయే నను నగ్నసత్యమును గ్రహించిన జీవుడు *'ఏకమేవ అద్వితీయ బ్రహ్మం”*. అనగా
బ్రహ్మమనునది ఒక్కటే. జీవాత్మ వేరు , పరమాత్మ వేరు కాదు. రెండునూ ఒక్కటే నన్న సత్యమును
గ్రహించగలుగును. దేవ దానవుల మధ్య జరిగిన సంగ్రామ ఫలితమే శాస్తా యొక్క అవతార
విశేషము.

వివేకవంతులైన దేవతలకు , అవివేకులు , మూర్ఖులైన రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధమున జ్ఞానమే రూపుదాల్చిన దైవశక్తి యొక్క లీలలు మనకు అనేకము గోచరించును.

భగవంతుడు జననమరణాలకు , పేరు , ఊరు , గుణం అన్నిటికీ అతీతుడు. తాను సృష్టించిన మానవజాతి మనుగడను ఉద్ధరించుటకై , ఒక ప్రత్యేక మైన పేరు ,
ఊరు కలవానిగా అవతరించినవాడు.

ఆ విధముగానే స్థితికారకునిగా శ్రీ మహావిష్ణువుగానూ , అజ్ఞానం అను పొరలను నశింపజేయు లయకారకునిగా పరమేశ్వరునిగానూ , భగవంతుడు అవతారము దాల్చెను. మానవుని కాపాడుటకై దైవశక్తుల కలయికలన్నియూ ఒక్కటై రూపుదాల్చినదే *శాస్తాయొక్క అవతారము.* ఈశ్వరుని యొక్క దివ్యతేజస్సు మహావిష్ణువులో లీనమవగా , ఆ ఇరువురి దివ్యశక్తుల కలయికగా మూడవదిగా ఒక
బ్రహ్మాండమైన శక్తి రూపుదాల్చవలెను అనుటయే విధి యొక్క శాసనము. అదియే శాస్తా యొక్క
అవతార విశేషము. జ్ఞానము , యోగము రెండింటి మేలు కలయికయే శాస్తా అను శక్తి.

వేర్వేరు శక్తి స్వరూప గుణములు గలిగిన శివ , విష్ణువుల కలయిక వలన జనియించినవాడు
శాస్తా. దేవశరీరము అనునది మానవ శరీరము వలె ఎముకలతో కూడుకున్న నిర్మాణము కాదు.

మోహిని అవతారుడైన నారాయణుని తన ఓర కంటితో చూచి పరమేశ్వరుడు మోహించగా , వేద మంత్ర స్వరూపులైన శివకేశవుల చైతన్యము జ్యోతి స్వరూపుముగా సంగమించి , అందుండి
జనియించినదే శాస్తా అను దివ్యతేజస్సు.

భగవంతునికి మరణము అనునది లేదు అంటారు. కానీ అవతారము అంటే జననమే.  జననమంటూ ఉంటే మరణము తప్పని సరికదా. పరబ్రహ్మ స్వరూపుడైన స్వామి మరణము అను
మాటకు తావే లేక సదా జీవించి యుండువాడు. అన్ని కాలములకు అతీతుడైన ఆ స్వామి
మానవశ్రేయస్సునకై హరిహర సంగమ ఫలితముగా అవతరించిన మాట వాస్తవము , సత్యము.

నిగూఢముగా , చలనము అనునది లేక , నమ్మకమే ప్రధానముగా ఉండుటయే గాఢమైన భక్తికి పునాది. తాను అను అహంకారమును భక్తుడు భగవంతునికి సమర్పించుటయే నిజమైన భక్తి. దీనిమూలముగా జీవుడు తనను తాను తెలుసుకొన గలుగును. అజ్ఞాన అంధకారమున కొట్టుమిట్టాడుచూ
తనను తాను తెలుసుకొనని మానవుని అంతరంగమున జ్ఞానదీపములు వెలిగించి , తత్వమార్గము గ్రహించునటుల చేయు సద్గురువుగా భాసిల్లువాడు శాస్తా. *'నేను'* అను అహంకారము
నశించుసమయమున , *'నేనున్నాను'* అను నగ్న సత్యమును గ్రహించు నటుల చేయు సద్గురువు శాస్తా. నేను అను మాయ తొలగినంతనే జీవుడు మోక్షమును పొందును. ఈ సత్యమునే తన
లీలావినోదములదద్వారా , అజ్ఞానులైన రాక్షసశక్తులను సంహరించి , తన అవతార తత్వమును
గ్రహింపచేయువాడు శాస్తా. సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపుడైన శాస్తా యొక్క అవతారము , అతడి మహిమలు తత్వమయమైనవి.

మానవజాతిని ఉద్ధరించుటకై పరాత్పరుడైన పరమేశ్వరుడు , జగన్నాధుడైన నారాయణుడు ,
విడివిడిగా ఎన్నియో అవతారములను దాల్చినవారే. కానీ ఇరువురూ ఒకటిగా రూపుదాల్చిన
అవతారము శాస్తా. పరమేశ్వరుని యొక్క ఈశ్వర తత్వము , జ్ఞానశక్తి, పరంధాముని యొక్క రూపలావణ్యము , స్థితికారకత్వము , ఇలా ఇరువురి గుణముల యొక్క మేలుకలయిక శాస్తాలో గోచరమవుతుంది. శివుని వలె చంద్రవంక , మూడు కన్నులు , పలు భూషణములు , అభరణములు
ధరించినవానిగానూ , విష్ణువువలె అందమైన శరీరము కలిగి , సత్ ప్రవర్తనా యోగముతో నియమనిష్టలు అను త్రాటితో తనను తాను బంధించుకున్న పాదములు కలవాడుగానూ , నూపురములు ధరించిన
పాదములు కలిగి , ఛండాయుధము కరమునగలవాడు , నిత్యయౌవనవంతునిగానూ సౌమ్యస్వభావము
ముఖమున గోచరించువానిగానూ స్వామిని పురాణములు వర్ణించుచున్నవి.

శాస్తా అను పదమునకు అర్థము అధికారియని. అధికారము చేయువాడు అధికారి. సృష్టి , స్థితి ,
లయ కారకత్వములు మూడింటికీ తానే కర్త అయి , కోట్లాది మానవజీవితమునకు అధికారియై తన
కరమున ధరించిన ఛండాయుధమును అధికార చిహ్నముగా లోకమునకు చాటినవాడు ఆస్వామి.
అతడికి ఇరువైపులా ఇచ్ఛాశక్తి , క్రియాశక్తులైన పూర్ణాదేవి , పుష్కలాదేవి కొలువై యుండగా ,
కరమునందు జ్ఞానశక్తి అను ఛండాయుధమును ధరించినవాడై ఇచ్చాశక్తి , క్రియాశక్తి , జ్ఞానశక్తి
స్వరూపునిగా కొలువై యుండువాడు. రెండు కాళ్ళను యోగ నియమ , నిష్టలను త్రాటితో
బంధింపచేసి , లోకములన్నిటికీ ఆధారశక్తి తానేనంటూ భాసిల్లువాడు శాస్తా.

పంచేద్రియముల వలన కలుగు అహంకారమును మదపుటేనుగుగా సూచించుచూ ,
మదపుటేనుగును వాహనముగా చేసికొని , దాన్ని అణచివైచి అధిరోహించిన వాడు శాస్తా. శాస్తా తప్ప
వేరు దైవము లేదు అను నగ్న సత్యమును చాటుటకై దాన్ని తన వాహనముగా చేసికొని ఋజువు చేసినవాడు శాస్తా.

*స్వామి యొక్క జెండాపై కోడిపుంజు సంకేతము కనిపిస్తుంది. గెలుపునకు ప్రతీక కోడిపుంజు.*
అజ్ఞాన అంధకారము అను చీకటినుండి స్వామి యొక్క అనుగ్రహము అను సూర్యోదయం
ఆసన్నమౌతుందని కోడిపుంజు అరుపు మూలంగా తెలియజేయుచున్నది. ఆ సత్యం మనకి
తెలియజేయుటయే జెండాపై కోడిపుంజు చిహ్నం.

స్వామి యొక్క ఎడమకంటిలో సూర్యుడు , కుడికంటిలో చంద్రుడు ఉండి , కుడిభాగమున కొలువై
యున్న పూర్ణాదేవి చేతిలోని నీలోత్పల పుష్పము కుడికంటిలోని చంద్రకిరణములు సోకి పుష్పించును.
ఎడమ భాగమున ఉన్న పుష్కలాదేవి చేతిలోని తామరపుష్పం ఎడమకంటిలోని సూర్యకిరణములు
సోకి విచ్చుకుంటుంది. దీన్ని బట్టి స్వామి అనుగ్రహము పొందినవారి జీవితము కూడా ఇట్లే
శోభిల్లునని అర్థమగును.

పూర్ణము అనగా ప్రశాంతత - పుష్కలమనగా శోభాయమానం. ఆశీర్వాదం అను ఐశ్వర్యమను
పూర్ణముగానూ , పుష్కలముగానూ గలవాడు పూర్ణా పుష్కలాసమేతుడైన శాస్తా.

స్వామి యొక్క ఆలయములన్నియూ దట్టమైన అడవుల యందునూ , కొండల పైననూ కనిపించును.
అడవులను ఎలాగునైతే దాటుకుంటూ , కష్టసాధ్యమైన కొండలను ఎక్కుతూ ఆ స్వామి యొక్క సన్నిధానమును చేరుకుందుమో , అటులనే ఇంద్రియములు , మనస్సు , బుద్ధి అను కొండలను దాటుటయూ , రాగద్వేషములు అను మృగములు సంచరించు దట్టమైన వనములు , అడవులను దాటుటయూ.

అలా దాటుకుంటూ స్వామి సన్నిధానమును చేరినవారికి ఆత్మదర్శనము గోచరించును అను సత్యము ఇందుమూలముగా మనకు తెలియుచున్నది. స్వామి యొక్క గొప్పతనము తెలుపుటకు
మాటలు చాలవు. ఇంద్రుడు , బ్రహ్మ మొదలగు దేవతలందరూ కూడా ఎంతో భక్తిగా శాస్తాను సేవించువారే. పేరుకి హరిహరసుతుడే అయిననూ , స్వయముగా వారి చేతనే పొగడబడువాడు
శాస్తా. పదునాలుగు లోకములను పరిపాలించుచూ , శరణన్న వారిని కాపాడుచూ , అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడై అలరారు ప్రభువు మహాశాస్తా.

హరిహర పుత్రుడు కేవలము భగవంతుని అవతారము మాత్రమే కాదు. సాక్షాత్తు పరబ్రహ్మ
స్వరూపుడే మహాశాస్తా. శాస్త్రాని కొలుచు విధానము పరమ పావనము అను సత్యమును గ్రహించి ,
జగత్ వ్యాపియై యున్న పరబ్రహ్మ స్వరూపుడైన శాస్త్రాని పూజించి , అతడి అనుగ్రహమును పొందుదుము గాక.


*“అంతఃప్రప్లై శాస్తా జనానాం సర్వాత్మా ,*
*సర్వా ప్రజా యత్ర్యైకం భవంతి”*

ఏ చోట ప్రజలందరూ ఏకమగుదురో , ఏ పరమాత్ముడు సకల జనుల యొక్క మనస్సులో కొలువై యున్నాడో , అట్టి మహిమాన్వితుడైన స్వామి , మాటలకు , చేతలకు అందనంత ఉన్నత స్థితిలో ఉండి , వారి వారి భాగ్య వశంబున శ్రీ శాస్తా అను దివ్యనామం కలిగి సదా పూజింపబడుచున్నాడు.


*ఇది వేదమాత యొక్క వాక్కు. -*




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!