☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ABADPS)*
పేరూ , ఊరూ , ఆకారము ఏదియూ లేని దేవుడు తాను సృష్టించిన మానవుల ఉన్నతి కొరకు
ఒక ఆకారము , నామధేయము ఏర్పరచుకున్నాడు. మహాశాస్తా యొక్క జననము , అతడి అవతార మహిమలు తెలియజేయునది ఏమనగా సత్యప్రమాణమును ఆచరించు సాధకులకు దీని ద్వారా సత్యనిరూపణ జరిగియే తీరును హరిహరపుత్రునిగా అవతరించిన పరమాత్మ ప్రతి మనిషికీ
బోధించునది *"నిన్ను నీవు తెలుసుకో”* అనునదే.
మానవ మనుగుడ స్థిరత్వము లేని ప్రాపంచిక విషయముల కొరకు కాదు , దేవుని యొక్క
ఆశీస్సులు పొందుట కొరకే నను సత్యము గ్రహించిన విజ్ఞులకు అయ్యప్పస్వామి అవతార విశేషములు , లీలలు మనకు వీనుల విందు కలిగించును. మణికంఠునిగా భువికి అవతరించిన
స్వామి , మానవ జీవితమునకు తానే ఒక మార్గదర్శి అయినాడు. పురాణ పురుషుడైన భగవంతుడు తన లీలల ద్వారానూ , జీవితం యొక్క సత్యప్రమాణములను , సాక్షాత్కారములు ప్రజలు గుర్తించు విధముగా చేసెను. తన యొక్క ప్రతి అవతారములోనూ భగవంతుడు ప్రభోధించు ఈ సత్యమును
మనము గ్రహించినచో , ఆ పరంజ్యోతిని చేరుకునే విధానము , మార్గము మనకు గోచరమగును.
అజ్ఞానమునకు మారుపేరైన అసురశక్తికి , జ్ఞానమునకు అలవాలమైన దైవశక్తికి మధ్య జరిగే పోరాటములో జ్ఞానానికే విజయం అను సత్యము స్వామి యొక్క లీలల ద్వారా నిరూపణ అగును.
దుష్టులను శిక్షించుటకు , శిష్టులను రక్షించుటకు అన్నిటికీ మించి ధర్మమును కాపాడుటకు
భగవంతుడు మరల మరల అవతారములను దాల్చుతునే ఉన్నాడు. అండబ్రహ్మాండములకు
అతీతుడై విరాట్ స్వరూపుడై అన్నీ తానే అయి , విశ్వమంతా వ్యాపించియున్న సర్వవ్యాప్తియై సర్వజ్ఞుడై సర్వశక్తియై విరాజిల్లుతున్నవాడు. లోకములన్నియూ అతడి ఆజ్ఞకు లోబడి యుండునవియే.
దీన్ని బట్టి మకు అర్థమగునది ఏమనగా అంధకారమయమైన మానవ జీవితములలో వెలుగు నింపుటకై అవతరించిన దైవమే మహాశాస్తా. మానవులు తమ జీవిత కాలములో ఎన్నెన్నో ఘట్టములను దాటుకుంటూ , వస్తున్న రీతిగానే , మానవునికి ఉన్నత ప్రాప్తి కలిగించుటకై , తనదైన
శైలిలో ఆ భగవంతుడు పలురకములైన అవతారములు దాల్చుచూ , లీలలు కనబరచుచూ తన
ఆశీర్వాదములను అందజేయుచున్నాడు.
మానవులందరి మనోభావములూ ఒకేలా ఉండవు. పలుపలు విధములుగా ఉండును. అందుకే మానవ సృష్టి చేయు రజోగుణము గల బ్రహ్మదేవునిగానూ , సృష్టించబడిన మానవుల పరిపాలన చేయు సత్వగుణరూపుడైన విష్ణువుగానూ , తమోగుణం ఎక్కువైనందువలన కనిపించిన ప్రతి దానినీ
సంహరించు కాలరుద్రుని వలెనూ మనకి అనేక రూపములలో గోచరమగును.
ఏకైక మూర్తి అంటాడు కాళిదాస మహాకవి. మూర్తి ఒక్కటే. దాని నుండి జనియించినవే మూడు ఆకారములు. వీటిలో అన్నియూ సమానములే. హెచ్చు తగ్గులంటూ లేవు. విభిన్న మనస్తత్వములు
గల మానవజాతిని తనవైపు ఆకర్షించుటకై భగవంతుడు మనకు పలురూపములుగా గోచరిస్తాడు.
కలియుగము గుడుచుచున్న కొలదీ కలతలు కూడా పెరుగుచునే యున్నవి. అన్యాయము ,
అవినీతి పెరుగుతున్న కొలదీ , సజ్జనులు న్యాయమార్గమున బ్రతుకులేక దీనులై , దిక్కుతోచని స్థితిలో
అలమటించు సమయమున దిక్సూచియై వారికి నేనున్నానంటూ అభయమిచ్చి కాపాడి రక్షించు దైవము హరిహరసుతుడు. పాపపంకిలమైన కలియుగమున నేడు మానవ జీవితమంతా దుర్భరప్రాయమై
పోయినది. దీనివలన మానవులు తెలిసియో , తెలియకయో తమ్ము తాము బాధించుకుంటూ ,
మిగతావారిని కూడా బాధించుచున్నారు. దుఃఖమయమైన మానవజీవితము దీనస్థితిలో ఉండగా ,
జ్ఞానయోగ మార్గముల ద్వారా విముక్తి పొందుట అనునది జరిగే పనికాదు. అయిననూ ఆ
భగవంతుడు మనలను విడువలేదు. పరబ్రహ్మ స్వరూపమును చేరుకోగలుగు భక్తి మార్గములను తెలుపుచున్నవి భగవద్గీతలోని శ్లోకములు. పేరునకు 20 శ్లోకములే అయిననూ , ఎందులోనూ లేని ప్రాముఖ్యము *'భక్తియోగం'* అను అధ్యాయమునకు కలిగినది.
*“నీవే శరణాగతి అంటూ ఎవరైతే నన్ను వేడుదురో అతడు నా వాడు”* అంటూ అభయమిస్తాడు భగవంతుడు.
అద్వైత సిద్ధాంతమును చాటుటకై అవతరించిన సర్వేశ్వరుని యొక్క అవతారమూర్తి అయిన
ఆదిశంకరులు ఈ సత్యమును గ్రహించి , మనదైన సనాతన మత ధర్మమును ఆరుభాగములైన
*“శైవ , వైష్ణవ , శాక్త , కౌమార , గాణాపత్య , సౌర”* మతములుగా విభజించిరి.
ఓంకార స్వరూపుడు విఘ్ననాయకుడు. అది గ్రహించేలా చేయుమూర్తి సుబ్రహ్మణ్యస్వామి.
తనదైన ప్రపంచమును తన నుండి విడివడునటులచేసి , మరలా తనను చేరుకొను విధముగా ఆకర్షించువాడు చిన్మయస్వరూపుడైన పరమశివుడు. ఈ రెండింటికీ మధ్యన ఊగిసలాడువాడు
లోకమును కాపాడు విష్ణువు.
అఖిల జగత్తును పరిపాలించు దేవి ఆదిశక్తి. మానవులు చేయు మంచి చెడ్డలను కాలానుగుణముగా
నడిపించు కాపలాదారులు నవగ్రహములు.
ఈ ఆరు కట్టుబాట్లకు లోనైనవాడు శాస్తా. శైవమతమున శివపుత్రునిగానూ , వైష్ణవమతమున
హరినందనుని గానూ , శాక్తమున అంబాసుతునిగానూ , కౌమారగణాపత్యమున సుబ్రహ్మణ్య , గణేశ
సోదరునిగానూ , సౌరమున - అఖిలాండకోటి బ్రహ్మాండనాయకునిగానూ గోచరిస్తాడు.
శాస్తా అమిత శక్తివంతుడై అన్ని కట్టుబాట్లకూ , తత్వస్వరూపములకూ అతీతుడై , ఎంత పొగడిననూ
తనవి తీరదు అన్నట్లు ఉండును. అన్నిటికీ అతీతుడైనవాడు శాస్తా.
తత్వ స్వరూపుడై విరాజిల్లు అతడు , అన్ని తత్వములకు అతీతమైన తారక బ్రహ్మముగానూ ,
మూల విరాట్టుగానూ , తత్వమసిగానూ విరాజిల్లుచున్నాడు. సంసార సాగరమున చిక్కుకుని , దీన
అవస్థలో నున్న మానవ జీవితములను సుస్థిరమైన మోక్షమను ఒడ్డుకు చేర్చు నావికుడు అయ్యప్ప.
నమ్మకమే భక్తికి పునాది. పరిపూర్ణమైన భక్తి విశ్వాసములతో తనను సేవించు భక్తుని , భవసాగరము నుండి స్వేచ్ఛా మార్గమును అనుగ్రహించు ప్రభువు అయ్యప్ప. భవసాగరము నుండి వారిని రక్షించుటయేగాక , పరిపక్వస్థితిని చేరుటకై వారి యొక్క ప్రాపంచిక అవసరములను తీర్చుతూ , చివరకు తనను చేరుకును బాధ్యతను కూడా స్వామియే తీసుకుంటున్నాడు.
సృష్టి , స్థితి , లయ కారకునిగా మూడు విధములైన ఆధారభూతునిగా విరాజిల్లువాడు స్వామి.
తాను సంకల్పించిన రీతిలో సంచరించుచూ , తనను భక్తితో సేవించు వారికై ఒక ఆకార మూర్తిగా ప్రకాశిల్లువాడు. ఆ నిజమను ప్రతి దైవశక్తియూ తన దైన శైలిలో నిరూపించుచునే యున్నది. ఆ స్థితిని అవగతము చేయునదే అద్వైతం.
ఈ భూప్రపంచమున మనకి అన్నింటా ఆ పరబ్రహ్మ తత్వమే అంతటా గోచరిస్తుంది. కానీ అజ్ఞాన అంధకారమున చిక్కుకుని అల్లాడు మానవులు ఆ నిజమును గుర్తించలేక పోవుచున్నారు. ఆ
మూర్తిని దర్శించలేకపోవుచున్నారు. కారు చీకటిలోని చిరుదివ్వెవలె ఆ భగవంతుడు జ్యోతిస్వరూపుడై
మనకి దారి చూపుచునే యున్నాడు. అద్వైత సిద్ధాంత స్వరూపియై , ఆనందమయ స్వరూపుడైన ఆ
స్వామి సకల సద్గురువై , తత్వమసి అంటూ మనలను ప్రభోదిస్తూనే యున్నాడు.
భక్తి యొక్క ముఖ్య ఉద్దేశము ఒక వ్యక్తి ఉత్తమునిగా మారుట మాత్రమే కాదు. తానే ఆ శక్తిగా మారుటయే భక్తి యొక్క ప్రధాన ఉద్దేశ్యము.
కలియుగములోని అలజడి నుండి విడుదల పొందుటకు భక్తిమార్గమే ముక్తి మార్గము అను
నిజమును గ్రహింపజేసి , ఎల్లవేళలా అతడిని కాపాడుతూ , అతడిలోని అజ్ఞానముని నశింపచేసి ,
తనను శరణుగోరిన వారికి సాయుజ్యప్రాప్తి కలుగుజేయువాడు సత్య స్వరూపుడైన శాస్తా.
*"కలౌ శాస్త్రృ వినాయకౌ”* అన్నట్లుగా కలియుగ ప్రత్యక్ష దైవముగా భాసిల్లువాడు శాస్తా. తల్లివలె
మనను కాపాడువాడు. చూచువారికి భయము లేదు , భయము లేదనుచూ అభయమిచ్చి కాపాడు కాపాలాదారునిగా చరాచర జగత్తును దాటి మనలను కాపాడు స్వామి యొక్క ఆశీస్సులను కోరుచూ , మనమూ మానవులుగా మన వంతు ప్రయత్నమూ మనమూ చేయుదుము గాక. అతడి ఆశీర్వాదం మేరకు శిరస్సు వంచి నమస్కరించుచూ *'తత్వమసి'* మార్గమును గ్రహించి మానవజన్మను చరితార్థము
చేసుకుందుముగాక !
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*