దసరా పండుగ గురించి పురాణాల్లో ఏముందో తెలుసా...

P Madhav Kumar


దసరా పండుగ గురించి పురాణాల్లో ఏముందో తెలుసా....

దసరా పండుగ అంటే ఏమిటి? ఈ పండుగను ఎందుకు జరుపుకోవాలి? అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి.. అనే కొన్ని ప్రశ్నలు నేటితరం యువతీ యువకుల నుంచి వినిపిస్తున్నాయి.  కొంతమంది దసరా పండుగ అంటే సరదాగా గడపడం.. విందు చేసుకోవడం.. ఇలా అనేక ఫన్నీ అంశాలను చెబుతుంటారు.  అయితే అసలు ఈ పండుగ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి ? దసరా పండుగ చారిత్రక నేపథ్యం ఏంటి ? పురాణాలు ఏం చెపుతున్నాయో ఒకసారి తెలుసుకుందాం. .   

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి.  ఆశ్వయుజ మాసంలో ఈ పండుగను పది రోజులు జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం దశమి  రోజున  రాముడు....  రావణునిపై విజయం సాధించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు.  

దసరా పండుగ రోజుల్లో  రావణ వధ, జమ్మిచెట్టుకు   పూజా చేయటం ఆచారంగా ఉంది. జగన్మాత  దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

దుర్గాదేవి త్రిమూర్తుల అంశ

దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ... దుర్గాదేవి 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, హిమవంతుడు  కమండలము,  సింహమును వాహనంగాను ఇచ్చారని దేవీ భాగవతంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు పలు వేదికలపై ప్రసంగించారు. ఇలా సర్వదేవతల ఆయుధాలను  సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది.

మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత దుర్గాదేవి ... మహిషాసురునితో తలపడినదట. ఈ యుద్దములో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడిందనీ... దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా పిలుస్తున్నారు. అదే విజయదశమిగా ప్రసిద్ధి చెందింది.

విజయదశమి ప్రత్యేకత

సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అని అంటారు. కనుక ఆ రోజు  కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిదంటారు. అలానే ఆ రోజు  జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీ ప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే  శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాల్లో ఉంది. అలానే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో,  నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ది జరుగుతుంది అని నమ్మకం.

దసరా రోజు ఏం చెయ్యాలి?

పదవ రోజు అనగా విజయ దశమి నాడు ఉదయాన్నే లేచి తలా స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, మామిడి ఆకు, పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు. పిండి వంటలు వండుకుని బందు మిత్రులతో కలిసి పంచుకుంటారు. సాయంకాలం అమ్మవారికి, జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంధుమిత్రులతో జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇలా ఆరోజు ఎంతో ఆనందంగా కుటుంబంతా కలిసి ఈ విజయ దశమి జరుపుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల వాళ్లు అయితే రావణాసురుని వధకి గుర్తుగా ఆనందోత్సాలతో రావణుడి దిష్టి బొమ్మను దహనం చేయటం, పటాకులు వంటివి కాల్చి సంబురాలు చేస్తారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat