*కోపం కొరివి సకల అరిష్టాల కూపం*
అందుకే ‘కోపం మూర్ఖుల లక్షణం’ అంటారు పెద్దలు.
వివేకవంతుడైన మనిషికి కోపం తనంత తానుగా కలగదు.అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోవడం, దాన్ని పదునైన సాధనంగా వాడుకోవడమే తెలివైనవాడి గుణం, లక్షణం. మెతకదనం కాదు, మెలకువ కావాలి.
కోపాన్ని జయించడం అంటే - కోపం రాకపోవడం కాదు... దాన్ని ఆయుధంగా వాడుకొనే నైపుణ్యాన్ని మనిషి కలిగి ఉండటం, అవసరానికి తగిన విధంగా కోపాన్ని వాడుకోగలగడం!
కొంతమందిని చూస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది. మరికొందరిని చూస్తే ఎలా ఉండకూడదో అర్థమవుతుంది.
పురాణాల ద్వారా మహనీయులు మనకు ఇచ్చిన ఉపదేశం
తపస్సులో ఉన్న జితేంద్రియులకు విఘ్నాలు ఎన్నడూ ప్రతిబంధకాలు కావు అని రఘువంశం కావ్యంలో కాళిదాసు అంటాడు. తాము తలపెట్టిన పనులు మధ్యలో వదలక కార్యసిద్ధి కలిగేవరకు రఘువంశ రాజులు అకుంఠిత దీక్షతో కృషి చేసేవారనీ అంటాడు. కార్యసిద్ధి కలిగేవరకు పనిని కొనసాగించడం, మధ్యలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకపోవడం రఘువంశ రాజుల ప్రత్యేకతగా చెబుతాడు.
జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆప్తుల సలహా తీసుకోవడం ఉత్తమం అని భారవి, కిరాతార్జునీయంలో తెలియపరుస్తాడు. రామాయణంలో శ్రీరాముడు విభీషణుడికి ఆశ్రయం ఇచ్చేముందు సుగ్రీవాదుల అభిప్రాయాలు తెలుసుకొంటాడు.
వాల్మీకి మహర్షి శ్రీరాముణ్ని వర్ణిస్తూ ఎదుటివారితో మృదువుగా, వారి అభిప్రాయానికి విలువ ఇస్తూ మాట్లాడతాడని అంటాడు. అదే సాటి మనుషులను ఆకట్టుకునే పద్ధతి. అందువల్లే అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి అంటే అందరికీ అంత అభిమానం
లోకంలో ప్రతి పాపానికీ ప్రాయశ్చిత్తం ఉంటుంది కాని, కృతఘ్నతకు ఉండదంటారు పెద్దలు. మనకు ఉపకారం చేసినవారికి ప్రత్యుపకారం చేయడం మానవ ధర్మం. ఎప్పుడో తనకు ఉపకారం చేసిన నలుడికి, తనకు చేతనైన సాయం చేసింది హంస.
సున్నితమైన ప్రవర్తన సహజంగా తమలో లేకపోయినా, మాటల్లో మార్దవాన్ని, చేతల్లో నాటకీయతను ప్రదర్శించేవాళ్లకు దుర్యోధనుడు ప్రతీక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ప్రజలను వశపరచుకోవడానికి అదే మంచి అవకాశంగా భావించి, తన సేవకులను స్నేహితులుగా, స్నేహితులను బంధువులుగా, బంధువులను అధికారులుగా గౌరవించినట్లు నటించాడట దుర్యోధనుడు. ఈ విషయాన్ని భారవి తన కావ్యంలో చక్కగా వివరించాడు.