ధనుర్మాసం విశిష్టత

🌹 *ధనుర్మాసము ~ దివ్య మాసము* 🌹


ధనుర్మాసము వైష్ణవులకు దివ్యమాసం; సౌరమానము ప్రకారమూ రవి ఈ మాసములో ధనూరాశిలో ఉంటాడు; మాసాలలో మార్గశిరమాసము తనకు ఇష్టమైన మాసమని గీతలో భగవానుడు చెప్పినాడు. మార్గశిరానికీ పుష్యమాసానికీ మధ్య వస్తుంది ఈ ధనుర్మాసము;

ఇది దక్షిణాయనములో చివరి మాసము; దేవతలకు తెల్లవారుఝామున మొదలౌతుంది; అనగా వారికి ఉత్తరాయణము మొదలౌతుంది; శ్రీకృష్ణుణ్ణీ ఆండాళ్ నూ వివిధ నైవేద్యాలతో పూజిస్తారు; ఆండాళ్ రచించిన తిరుప్పావై పాశురాలను అనుసంధానము చేస్తారు. ముంగిట ముగ్గులు వేసి స్వామిని‌ స్వాగతిస్తారు ఇంట్లోకి.


మొదటి పది రోజులూ సూర్యోదయానికిముందే లేచి ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేస్తే దరిద్రము తొలగి మహాలక్ష్మీ దేవి అనుగ్రహము లభిస్తుంది; 


మిగతా వివరాలను తరువాత తెలుసుకుందామా?


*రెండవ భాగం*


సూర్యమానము ప్రకారము సూర్యుడు ఒక రాశి నుండీ మరొక రాశికి మారుటకు ఒక మాసము‌ పడుతుంది; అదే చాంద్రమానమయితే చంద్రుడు రాశి మారుటకు 28రోజులే తీసుకుంటాడు; సూర్యుడు ఒక రాశి నుండీ మరొక రాశికి మారినపుడు దాన్ని‌

సంక్రమణమని అంటారు.


ఈ మాసము‌ 16 వ తేదీనుండీ ధనుర్మాసారంభమవుతుంది. జనవరిలో సంక్రాంతికి 30 రోజులౌతుంది.


ఆండాళమ్మ ఈ ధనుర్మాసములో‌ రోజుకొక పాశురాన్ని పాడి మధుసూధనుడిని ఆరాధించింది.

ఈ తిరుప్పావై పాశురాలలో మనము తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.


రోజూ మధుసూధనుడిని‌ ఆరాధించి గంధ పుష్ప ధూప దీపాలు సమర్పించి అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి ప్రసాదాన్ని నివేదించి దక్షిణసహిత తాంబూలం సమర్పించి స్వామిని పూజించింది ఆండాళ్ తల్లి.


ఈ మాసమంతా అన్ని వైష్ణవాలయాలలో విశేష పూజలుంటాయి. ప్రతిరోజు విశేష నైవేద్యాన్ని సమర్పిస్తారు.


మొదటి ఐదు పాశురాలలో ఈ వ్రతవిధానాన్ని ఆండాళ్ తల్లి వివరిస్తుంది; ఆ తరువాత ఆరవ పాశురమునుంచీ పదిహేనవ పాశురము వరకూ తన తోటి చెలికత్తెలను నిద్ర లేపడము; నందగోపుని గృహానికి పోవడము;

16, 17, వ పాశురాలతో నందునీ, యశోదమ్మనూ, శ్రీకృష్ణుని, బలరామునీ మేల్కొల్పడము , 18నుండి 20 వ పాశురంవరకూ నప్పిన్నై పిరాట్టిని, తత్పురుషకారంతో శ్రీకృష్ణుని నిద్రలేపటం 21 అనన్యగతిత్వన్నీ, 22 అనన్యార్హ శేషత్వము 23 సృష్ట్యాదిస్థితి, సృష్టిక్రమము, 24 వ పాశురములో మంగళాశాసనాన్ని; 25+26 వ పాశురాలలో స్వామిని పర అను వాద్యాన్ని ప్రసాదించమనీ; 27 వ పాశురములో పరమాత్మకూ జీవాత్మకూ ఉన్న సంభంధాన్ని 

*కూడారై* పాశురముతో చెప్పడము; 28వ పాశురంతో ప్రాపకవిరోధి విషయము 29 వ పాశురం తో పేయ స్వరూపము, 30 వ పాశురాలతో ఫలశ్రుతిని చెబుతూ భక్తునికీ భగవంతునికీ ఉన్న సంబంధమువల్ల ఎవరూ ఏమీ స్వామిని కోరాల్సిన అవసరముండదనీ ఆయనే తప్పకుండా అన్నీ భక్తులకు సమకూరుస్తాడనీ ఆశ్వాసనాన్ని ఆండాళ్ తల్లి‌ అనుగ్రహించింది.


*మూడవ భాగం*


ఈ ధనుర్మాసము నెల రోజులూ తిరుమలలో రోజూ చెప్పే సుప్రభాతము బదులు‌ తిరుప్పావై పఠిస్తారు; జియ్యంగార్లు, ఏకాంగి, శ్రీవైష్ణవాచార్యులు మాత్రమే ఏకాంతంగా తిరుప్పావై పఠిస్తారు; ఈ సేవలో ఇతర భక్తులకు ప్రవేశముండదు.


ఈ ముప్పది రోజులూ స్వామిని శ్రీకృష్ణుడిగానూ వక్షస్తల వ్యూహలక్ష్మిని ఆండాళ్ గానూ వ్యవహరిస్తారు; శ్రీవారి నడుమువద్ద తిరుప్పావై అనే బంగారు పతకాల మాలను కటిబంధంగా అలంకరిస్తారు; 

ఇక స్వామివారి కుడివైపున ఉండే వ్యూహలక్ష్మికి ఎర్రని కెంపులు పొదిగిన బంగారు చిలుకబొమ్మను అలంకరిస్తారు; పూలతో ఆకులతో తయారుచేసిన చిలుకబొమ్మను కూడా అలంకరిస్తారు.


స్వామివారికి రోజూ తోమాలసేవ అయిన తర్వాత తులసిదళాలతో సహస్రనామార్చన జరుగుతుంది;


 ఈ ధనుర్మాసములో మాత్రము మారేడు దళాలతో సహస్రనామార్చన చేస్తారు; 

ఇక ఈ మాసములో నైవేద్యాలు కూడా ప్రత్యేకమైనవే!


 సూర్యోదయానికి ముందే చలిలో వేడివేడి పొంగళ్ళు పాయసాలతోపాటూ శ్రీనివాసునికి బెల్లపు దోసెను ప్రత్యేకంగా నివేదిస్తారు.


ఇక రాత్రి పూట ఏకాంత సేవలో (పవ్వళింపు సేవలో)

బంగారు పట్టెమంచము మీద భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా వెన్నముద్ద శ్రీకృష్ణుడి విగ్రహమూర్తిని పెడుతారు; 


ఈ చిన్ని కృష్ణుడినే తిరుప్పావై పాశురాలను గానముచేస్తూ మేలుకొలుపుతారు; ఆ తరువాత వెండి మూర్తికి గోరువెచ్చని నీటితో స్నానాన్ని చేయించి పాలు వెన్న బెల్లపు దోసె వేడి పొంగళ్ళను నివేదిస్తారు; ఈ మాసమంతా తిరుమల సంప్రదాయాన్ని అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై పాశురాలను పఠిస్తూ సుప్రభాత సేవ చేస్తారు.


*నాల్గవ భాగం*


*(ధనుర్మాస వ్రత విధానము)*


ఈ ధనుర్మాసము 16 వ తేదీ మొదలౌతుంది; ఆ వ్రత విధానాన్ని గురించి తెలుసుకుందామా?


ఆ ఉదయమే సూర్యోదయానికి ముందే లేచి స్నానానంతరము పరిశుద్ద వస్త్రాలను ధరించి, బొట్జు పెట్టుకుని గురుపరంపరను అనుసంధించుకుని పెరుమాళ్ళ సన్నిధిని చేరి సాష్టాంగ ప్రణామాలు చేసి ఈ క్రింది శ్లోకాలను అనుసంధించాలి:


*అమర్యాదః క్షుద్రశ్చలమతిః ప్రసవభూః*

*కృతఘ్నోదుర్మానీ స్మరపరవశో వంచన పరః*

*నృశంసః పాపిష్టః మహమితో దుఃఖజలధేః*

*అపారాత్ ఉత్తీర్ణః పరిచరేయంచరణయోః*


*నమో నమో వాజ్మనసాతి భూమయే*

*నమో నమో వాజ్ఙనసైకభూమయే*

*నమో నమోనంత మహావిభూతయే*

*నమో నమో నంత దయైకసింధవే*


*న ధర్మనిష్టోస్మి నచాత్మవేదీ*

*న భక్తిమాన్ త్వచ్చరణారవిందే*

*అకించనో నన్యగతిశ్శరణ్యః*

*త్వత్పాదమూలం శరణం ప్రపద్యే!*


*కౌసల్యా సుప్రజా రామ! పూర్వాసంధ్యే ప్రవర్తతే*

*ఉత్తిష్ట నరశార్ధూల కర్తందైవమాహ్నికం!*


*ఉత్తిష్తోత్తిష్ట! గోవింద! ఉత్తిష్ట గరుడధ్వజ*

*ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు!*


*తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా*

*దేవకీపూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా!*


*ఇతి కరతాళత్రయేన భగవంతం ప్రబోధ్య*

*కవాటంవిముచ్య!*


(అని మూడు సార్లు చప్పట్లు చరచి

ద్వారాలను తీసి పెరుమాళ్ళను మేల్కొలుపాలి)


నిర్మాల్యాన్ని తొలగించి మనసులో చేయాల్సిన ఆరాధనను ఒకసారి పూర్ణముగా భావించి పంచపాత్రలలో పరిమళ తీర్థాలను నింపి తులసీదళాలనందువేశి అష్టాక్షరీ మంత్రముతో అభిమంత్రించాలి.


ముందుగా మనసులో ఆచార్యారాధన చేసుకుని స్వాచార్య శ్రీహస్తేన ఆరాధనాభిముఖోభవేయం(అని పెరుమాళ్ళతో విన్నవించి)


*స్వశేషభూతేన మయా స్వీయైః సర్వ పరిచ్చదైః*

*విధాతుం ప్రీతమాత్మనం దేవః ప్రక్రమతే స్వయమ్*


*భగవన్! పుండరీకాక్ష! హృద్యాగం తు మయా కృతం*

*ఆత్మసాత్కురు దేవేశ! బాహ్యే త్వాం సమ్యఫర్చయే!*

(అని ప్రార్తించి పాదాలచెంత తులసిని అర్పించాలి)


*కూర్పశ్చాద్భాహుద్వయేన్ *తదను మణిమయం*

*మంటపమ్ తత్రశేషమ్ తస్మిన్ ధర్మాది పీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ*

*విష్ణుందేవీర్విభూషాయుధగణ మురగం పాదుకేవైనతేయం*

*సేనేశంద్వారపాలాన్ కుముదముఖగణా‌న్*

*విష్ణుభక్తాన్ ప్రపద్యే సవ్యమ్ పాదమ్ ప్రసార్య ఆశ్రితదురితహరమ్*

*దక్షణం కుంచయిత్వా జానున్యాధాయ సవ్యేతరమితరభుజమ్*

*నాగభోగే నిధాయ*

*పశ్చాద్భాహుద్వయేన* *ప్రతిభటశమనే ధారయన్* *శంఖచక్రేదేవీ భూషాది జుష్టోజనయతు జగతాం శర్మవైకుంఠనాథః*


(అని శ్రీగోదాదేవీ రంగనాథులను 

ఎదురుగా ఉంచి మనస్సులో కూడా వారిని నింపుకొంటూ)


*ఐదవ భాగం*


శ్రీగోదాదేవినీ రంగనాథులను ఎదురుగా ఉంచి మనస్సులోనూ కూడా వారిద్దరినీ నింపుకుంటూ ఇలా చెప్పాలి:


సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ

శ్రీమతే నారాయణాయ నమః

శ్రీ భూ నీళా గోదాది దేవ్యోభ్యో నమః

అనంత గరుడ విష్వక్సేనాది నిత్యసూరిగణేభ్యోనమః

శ్రీపరాంకుశ పరకాల యతివర మున్యాది ఆళ్వాచార్యోభ్యో నమః

ఒం సర్వాన్ ధ్యాయామి

ఆవాహయామి

స్వాగతం సమర్పయామి

రత్న సింహాసనం సమర్పయామి

సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విగ్రహాయ

శ్రీమతే నారాయణాయ నమః

హస్తయోరర్ఘ్యం సమర్పయామి

(చేతికి నీటిని అందించాలి)


పాదయోః పాద్యం సమర్పయామి

(నోటికి మూడు సార్లు అందించాలి)


దంతకాష్ట జిహ్వానిర్లేఖన గండూషణ ముఖ ప్రక్షాళన

తాంబూల తైలాభ్యంజన

అందగోద్వర్తన ఆమలకతోయ హరిద్రాలేపన

స్నానకూర్చ ప్రసారణాని సమర్పయామి

అర్ఘ్యం సమర్పయామి

పాద్యం సమర్పయామి

ఆచమనీయం సమర్పయామి

(ముఖము కడిగి నలుగుపెట్టి శుద్దిచేసి స్నానాన్ని చేయించాలి)


స్నానం సమర్పయామి

స్నానంతరము శుద్ద ఆచమనీయం సమర్పయామి

ప్లోతవస్త్రం సమర్పయామి

(దేహమును తడి ఆరునట్లు తుడిచి)


వస్త్రయుగ్మం సమర్పయామి

ఊర్ద్వపు‌న్డ్రాన్ సమర్పయామి

యజ్ఞోపవీతం సమర్పయామి

(చల్లని చందనాన్ని సమర్పించాలి)

సర్వాభరణాలంకారాన్ సమర్పయామి

(ఈ విధంగానే పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ)

శ్రీమతే నారాయణాయనమః

తులసీదళైః పుష్పైశ్చ పూజయామి....


(ఆ తరువాత కృష్ణోత్తర గోదాష్టోత్తర శతనామాలను చెప్పుతూ హృదయానికి పుష్పాన్ని చూపిస్తూ దానియందు

ప్రేమనింపి అర్చన చెయ్యాలి)


*ఆరవ భాగం*

 *వ్రతాచరణ* 


*ఆరాధనా విధానము:*


      *ఓం నమో భగవతే శ్రీకృష్ణాయః* అ‌ని శ్రీకృష్ణుని, *ఓం గోదాదేవై నమః* అ‌ని గోదమ్మవారినీ ధ్యానించాలి!


  ధ్యాన ఆవాహనాది ఉపచారాలను నివేదించాలి; ఆరాధనకు ముందు సుప్రభాత శ్లోకాలను చదవాలి; చందనము, దీపము, దూపము సమర్పించిన తరువాత శ్రీకృష్ణ, లక్ష్మీ, గోదా, అష్టోత్తరాలతో అర్చన చేయాలి; 

ఆ తరువాత పొంగలి ఆరగింపు చేసి శ్రీశీలేశ...‌నుంచీ

*తిరుప్పళ్ళియొళుచ్చి, తిరుప్పావై పాశురాల‌ను* గోష్టిగా సేవించాలి; మొదటి 28 పాశురాలను మొదటి 15 రోజులు సూర్యోదయానికి ముందే చదివి పళ్ళు, పాలు, ఆరగింపు చేసి హారతివ్వాలి; ఆ తరువాత మిగిలిన 15 పాశురాలనూ ~ 29+30 (శిట్రుమ్ శిరుకాలే ~ వంగక్కడళ్) పాశురాలను సూర్యోదయానంతరము అనుసంధించాలి!


16 to 30 పాశురాలను రోజుకొక పాశురాన్ని విన్నవించాలి; ఆ పైన

*కోదై పిరందవూర్* నుంచీ *వైయ్యమ్ శుమప్పదుంవంబు* వరకూ అనుసంధించి *సర్వదేశ దశాకాలే త్యాదిగా ఆణ్డాళ్ వాళి తిరునామము* వరకూ

శ్రావ్యంగా అనుసంధించాలి; గోష్టిలోని వారికందరికీ తీర్థము, తులసి, చందనము, 

పుష్పము, ప్రసాదము ఇవ్వాలి; 

గోదాచతుశ్లోకీ,

 గోదాస్తుతిని అనుసందించాలి;

ఆ తరువాత వి‌.స‌‌‌.నామపారాయణాన్ని చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి; 

విశేష పాశురాలను రెండు సార్లు చెప్పాలి;  

ఆ 30 రోజులు ఏక భుక్తము చేయడము మంచిది; అభక్ష్య భక్షణము చేయరాదు; 

బ్రహ్మచర్యాన్ని పాటించాలి; వ్యర్థప్రసంగాలు మానాలి; పెద్దల ద్వారా పాశురార్థాలను తెలుసుకోవాలి; 

భోగి పండుగ నాడు గోదాకృష్ణుల కల్యాణాన్ని నిర్వహించాలి; 

*ఇలా మీరు చేయండి పది మందిని తరింపచేయండి; విజ్ఞానజ్యోతుల‌ను వెలిగించండి; అజ్ఞానాంధకారాన్ని తొలగించండి!*


        మొదటి 15 రోజులూ సూర్యోదయానికి ముందరే ఆరాధన ముగించాలి; తరువాతి 15 రోజులు సూర్యోదయానంతరమే చేయాలి. ఒకవేళ భోగినాడు గోదాకల్యాణము చేయడానికి వీలుకాకపోతే కనుమ నాడు చేయవచ్చును!

 

    *స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్*


        నీవు ఆచరించిన ధర్మము ఎంత చిన్నదైనా, అది నిన్ను గొప్ప ఆపదలనుండీ గట్టెక్కిస్తుంది!


*చివరి భాగం*


*విశేష దిన పాశురాలను అనుసంధించిన రోజులలో సమర్పించవలసిన ప్రసాదాలు ఇవి: 👇* 🌹


3 వ పాశురము ~ ఓంగి ~ శక్కరపొంగలి;


7 వ పాశురము ~ కీశు ~ పుళిహోర;


12 వ పాశురము ~ కనైత్తు ~ శక్కర పొంగలి;


16 వ పాశురము ~ నాయగనాయ్ ~ శక్కరపొంగలి; దద్ద్యోధనం; పుళిహోర;


18 వ పాశురము ~ ఉందు ~ శక్కర పొంగలి;


23 వ పాశురము ~ మారి ~ శక్కరపొంగలి;


24 వ పాశురము ~ అన్రి ~ దద్ద్యోధనము;


27 వ పాశురము ~ కూడారై ~ పాయసము; పుళిహోర; దద్ద్యోదనము;


28 వ పాశురము ~ కరవై గళ్ ~ దద్ద్యోధనము;


29 వ పాశురము ~ శిత్తుం ~ శక్కరపొంగలి;

 దద్ద్యోధనము; పుళిహోర;


30 వ పాశురము ~ వంగక్కడల్ ~ అప్పము;


*(సర్వే జనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళానిసంతు)*


*(ఆణ్డాళ్ తిరువడి గళే శరణమ్)*

🌹🙏🌹

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని *బాలభోగం* అని పిలుస్తారు.


*☘భోగితో ముగుస్తుంది:☘*


సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) *మార్గళి వ్రతం* పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు , పూజలు , జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.


*☘ఎంతో పునీత మాసం:☘* 


ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. *ధను* అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు , ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.


*☘బ్రహ్మముహూర్తంలో పారాయణం:☘*


ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం. సాక్షాత్‌ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో *"తిరు"* అనగా పవిత్రమైన , *పావై* అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.


*☘శ్రీకృష్ణుడికి తులసిమాల:☘*


ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో , భాగవతంలో , నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.


*శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా*

*తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:* 


ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపర మాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయు లందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సుల భంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి, తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ, ఆశిద్దాం. 


*ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?*


ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. 

ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం , జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. 


*కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:*


వివాహం కాని , మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.


*ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:*


రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.

గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.


 *కాత్యాయనీ వ్రతం:* 


 *పూజా విధానం:*


రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం,గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది. ముందుగా ప్రార్ధన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ తొమ్మిది , పది తనయలు రెండు సార్లు చదవాలి. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్ధన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.


*పాశురములు* చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అల మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి. (అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివరపాశురంలో ఒక లైను చదవాలి.

చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రొజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.


*నైవేద్యం* సమర్పంచాలి (రోజు పొంగలి , తద్ధోజనం , పరవన్నం ఉండి తీరాలి. కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్థుకు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి.


 *అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండు , పాలు పెట్టి చేసుకోండి, భక్తి ముఖ్యం*





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!