భగవద్గీతలో చివరి 6 అధ్యాయములకు (12 నుండి నుండి 18 అధ్యాయములు) "జ్ఞానషట్కము" అని పేరుపెట్టేరు విజ్ఞులు. 84లక్షల జీవరాసులన్నింటిలో అత్యంత జ్ఞానసంపన్నులు మానవులు. సృష్టిలో నున్న అన్ని జడజీవపదార్థములను తెలుసుకున్న మానవుడు, తనలోనే నెలకొనియున్న జ్ఞానపురుషుణ్ణి మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు.
ఆ రహస్యాన్ని, ఎంతో సులువుగా, అర్జునుని ద్వారా, ఈ జ్ఞానషట్కములో మనందరికీ తెలియజేశాడు జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ జ్ఞానపూరిత వివరణను అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాము.
ఈ సృష్టి మొత్తము క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనే రెండు పదార్ధాలతో నిండివుంది. ఇందులో మొదటిది జడమైనది, చూడబడుతుంది మరియు నశింపబడుతుంది. ఇక రెండవది చైతన్యవంతమైనది, అన్నింటిని చూచునది మరియు శాశ్వతమైనది. సులువుగా అర్ధంచేసుకోవాలంటే, క్షేత్రము అంటే పొలము లేదా స్థలము. ఇక క్షేత్రజ్ఞుడు అంటే ఆ పొలాన్ని లేక ఆ స్థలాన్ని చూచేవాడు. ఈ ఉదాహరణతో "క్షేత్రం" వేరు "క్షేత్రజ్ఞుడు" వేరన్న విషయం బోధపడుతుంది.
క్షేత్రానికి మరోపేరు ఉపాధి. ఉపాధి అంటే పంచభూతములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారము మొదలైన వాటితో కూడియున్న జడపదార్ధము. ఇది ఒక రూపాన్ని ధరించి బయటకు కనబడుతుంది. ఇది ఎప్పటికైన నశించే గుణం కలిగివుంటుంది.
ఇలాంటి జడమైన, నశించే స్వభావం కలిగిన ఉపాధులన్నింటిలో కూడా బయటకు కనబడకుండా, అన్నింటిని గమనిస్తూ, చైతన్యస్వరూపంతో నెలకొనియున్న ఆత్మయే క్షేత్రజ్ఞుడు. దీనికి నాశనము లేదు. పూర్తిగా శాశ్వతమైనది. దీనిని అనుభూతిపొందడమే జ్ఞానానికి నిదర్శనం. దీనిని గ్రహించడానికే మానవులు తమ జ్ఞానాన్నంతా ఉపయోగించాలి. అందుకు తగిన సాధన చెయ్యాలి. అకుంఠిత సాధనవలన "అయమాత్మాబ్రహ్మ", "అహంబ్రహ్మాస్మి" అనే సంపూర్ణజ్ఞానం సిద్ధిస్తుంది. జీవుడు పరమాత్మగా వర్ధిల్లుతాడు.
క్షేత్రములు లెన్నియున్ననూ క్షేత్రజ్ఞుడు ఒక్కడే. జీవులు ఎన్నియున్ననూ జీవాత్మ ఒక్కటే. ఈ రకమైన తొలి బోధనతో ఈ "జ్ఞానషట్కము"నకు శ్రీకారం చుట్టేడు గీతాచార్యుడు.
వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🪷 🪷⚛️✡️🕉️🌹