*ప్రాచీన కాలపు శాస్తా పూజా విధానము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ABADPS)*
ప్రాచీన కాలపు తమిళ సంప్రదాయము నందునూ , శాస్తా యొక్క పూజా విధానము వ్యాపించి యుండిన విషయము మనకి తెలిసినదే. *'శాస్తా ప్రీతి'* అనునది చాలా కాలముగా దక్షిణ
భారతదేశమునందునూ , కేరళ ప్రాంతము నందునూ కనిపించుచున్న విషయము మనకి తెలిసినదే. మహాశాస్తా అను పదమునే తమిళ ప్రజలు *'మాసాత్తనార్'* అంటారు. తమిళ సాహిత్య సంఘ సభల
పండితుల , రచనల ఆధారముగా ప్రాచీన కాలమునుండియే శాస్తా పూజా విధానము అమలులో ఉండినదన్న సంగతి ఋజువగుచున్నది. తమిళ ఉదంధమైన *'సిలప్పదిగారం'* లో
ప్రాచీన తమిళ గ్రంధములలోనూ , శివాలయమున ఈశ్వర పుత్రునిగా కొలువబడు శాస్తా సన్నిధిని మనము చూడగలము. ప్రత్యేకించి చెప్పవలెనన్నచో పలు ఆలయములందు శిలా
రూపముగానూ , కొన్ని చోట్ల లింగరూపముగానూ , మరిన్ని పురాతన ఆలయమునందు పీఠరూపముగా
శాస్తాని మనము చూడగలము.
ప్రత్యేకముగా శాస్తాకంటూ కట్టబడిన ఆలయములలో మాత్రమే కాక , పలు శివాలయములలో
మానవ శరీరమున నిబడీకృతమై యున్న చక్రస్థానముల ఆధారముగా నిర్మించిన వాటిలో కూడా
శాస్తా సన్నిధి ఉండుట గమనార్హము.
*'సాత్తానై మగనాయ్ వైత్తార్'*
అంటే శాస్తాని పుత్రునిగా కలిగియున్నవాడు అని అర్థం. ఈ మాట *'అప్పర్'* అనే తమిళ
గ్రంధకర్త వాక్కు కవిసామ్రాట్ గా పిలువబడే *'ఒట్టకూత్తర్'* అను గ్రంధకర్త తక్కయాగ పరణిలో 230 వ పద్యమున శాస్తాని అంబిక (పార్వతి) యొక్క పుత్రునిగా ప్రస్తుతించెను.
57 వ కంచి కామకోటి పీఠాధిపతియైన *'పరశివేంద్ర సరస్వతి'* తాను రచించిన సహస్రనామ భాష్యములో *'పుత్రిణే'* నమః అను నామమునకు గణపతి , స్కందుడు , మహాశాస్తా అంటూ ముగ్గురినీ
ప్రస్తుతించారు.
*భూతపేత పిశాచాదులను అణగదొక్కి కోరిన వరములనిచ్చువాడు మహాశాస్తా అంటాడు.*
వీరశైవుడైన హరదత్తుడు , శివతత్వమును నిరూపించు *'పంచరత్న'* శ్లోకములో స్త్రీ రూపము
ధరించిన విష్ణు గర్భమున జననము అనెను.
బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు , శాస్తా , ప్రణవం అంతా ఒక్కరే అంటూ మైత్రాయిని ఉపనిషత్తు
ఘోషిస్తున్నది.
పరంజ్యోతి స్వరూపుడైన శాస్తా గురించి ప్రస్తావించుచున్నది. *'శాస్తుృపితా'* అంటూ వర్ణిస్తుంది
శివసహస్రనామము.
నేను , బ్రహ్మ , విష్ణువు మేము ముగ్గురమూ నీ నుండి రూపొందిన వారమూ నంటూ
*'కోటి రుద్రసంహిత'లో* స్వయముగా ఈశ్వరుడే శాస్తాని పొగిడినట్లు తెలుస్తున్నది.
శైవ పురాణ గ్రంధమైన *'లింగపురాణం'* నందునూ అయ్యప్పని గూర్చిన వివరణలు కానవచ్చును.
*“దేవతల నాయకుని పుత్రుడైన సేనాపతి నా పాపములను ఉపశమమించుగాక. అతడు వేద శాస్త్రములు బోధించు సత్యప్రమాణములను వాక్కుగా పొందినవాడు. తాను చేయి పనులకు అతడే అధిపతి. అతడు సకల సద్గుణ స్వరూపుడు. అందరికీ నాయకుడు. శాంతస్వభావి. విష్ణువు వంటి దేహము కలిగినవాడు. ఉన్నత సంస్కారములుగల సేనానాయకుడు. యజ్ఞకర్మములను పరోక్షముగా కట్టడి చేయువాడు. ఐరావతము అను తెల్లని ఏనుగుపై ఊరేగువాడు. అందమైన నల్లని కురులను , ఉరుపు జీరలుగల నేత్రములను కలిగిన అంగాంగ సుందరుడు. నాగులను అభరణములుగా ధరించువాడు. భూత కూష్మాండ బేతాళ కూటమితో కూడియుండువాడు , అందరిచే ఎల్లప్పుడూ నమస్కరింపబడువాడుగానూ అలరారుచున్నాడు.”*
అంటూ *'లింగపురాణ'మున* నందీశ్వరుడు కుమారస్వామితో అయ్యప్ప యొక్క వర్ణనము
చేసినట్లుగా తెలియుచున్నది.
శివ , విష్ణువుల యొక్క అంశతో ఏక వ్యక్తిగా అవతరించినవాడు శాస్తా. అందువలననే
శివసహస్రనామములు , విష్ణుసహస్రనామములు అతిపరాక్రమ మూర్తిగా శివునిగానూ , విష్ణువుగానూ శాస్తా పేరుతో సంబోధించుచున్నవి.
మరికొన్ని ప్రాచీన మంత్రశాస్త్ర గ్రంధములయందునూ , పురాణ గ్రంధముల యందునూ శాస్తా
ప్రస్తావనను మనము చూడగలము. దేవగురువైన బృహస్పతి రచించిన *'బాహస పత్యనీత'* అను
గ్రంధములో వివరించారు.
*“వింద్య పర్వతమున దుర్గాదేవికి తోడుగా కాళికాదేవియూ నిత్యవాసము చేయుచున్నారు. కుమారస్వామి కుమార పర్వతనందునూ , సహ్యపర్వతమున గణపతియూ , రైవతక పర్వతమున శాస్తా , మహేంద్ర పర్వతమున గరుడుడు , పారియాత్రం అను పర్వతమున కేత్రపాలకుడు నిత్యవాసము చేయువారు”* అంటూ శాస్తాని గురించియు అతడి నివాస స్థలము గురించిన ప్రస్తావములు
కనిపించును.
లక్షశ్లోకములుగల అతి పురాణ గ్రంధమైన స్కంద పురాణమున శాస్తాకి సంబంధించి పలు
ఆధారములు లభించును. నేడు మనకు లభించిన అరుదైన పలు ఆధారములు చాలా వరకు స్కాంద
పురాణములోనివే. *'శివరహస్యకాండము'* అను భాగములోని 13,000 శ్లోకములు దీనికి
సంబంధించినవే.
జ్ఞానులు మాత్రమే ఆచరించగలుగు ఉపాసన అయిన *'శ్రీవిద్యా ఉపాసన'* లోనూ శాస్తా ఉనికి కనిపించును.
పార్వతీదేవి యొక్క పుణ్య చరితమైన *'శ్రీలలితోపాఖ్యానము'లో 'మోహినిగా ప్రత్యక్షమైన పార్వతీదేవి యొక్క అందచందములకు మైమరచిన ఈశ్వరుడు , ఆమె మూలముగా శాస్త్రాని పుత్రునిగా పొందినవాడు”*
అంటుంది.
శ్రీవిద్యా ఉపాసనను తెలియజేయు గ్రంధములలో అతి పురాతనమైన *'రుద్రయామళ తంత్రము'న*
*“రుద్రం శాస్తా పశుపతాది అస్త్రశస్త్రాది భైరవః”*
అంటూ శాస్తాని అంబిక యొక్క శరీరమున కొలువైయుండు దేవతలో ఒకడు అంటూ
పేర్కొంటుంది. ఈ గ్రంధములో పరశురామ క్షేత్రమైన కేరళ దేశమున అమ్మవారిని పూజించిన
పిమ్మటనే పలురక్కసులను సంహరించు వరము పొందినట్లుగా తెలియుచున్నది.
ఆమ్నాయ కల్పలత అను గ్రంధమున శాస్తాని *'ధర్మశాస్తా' 'కిరాతశాస్తా'* అను రెండు రూపములుగా
ధ్యానశ్లోకములో పేర్కొనబడినవి. కాబట్టి శాస్తా అనువాడు నాటికీ , నేటికీ , ఏనాటికీ మన సనాతన సంప్రదాయపు దేవతాస్వరూపుడే నని చెప్పవచ్చును. ఏ విధముగా చూసిననూ స్థూలరూపము కన్ననూ , సూక్ష్మరూపమునకే ముఖ్యత్వము అధికము. విలువైన రత్నములను ఎటులనంటే అటుల
నుంచక , అత్యంత జాగరూకతతో ఒక పెట్టెలో భద్రపరచి , అవసరమగు సమమున ఉపయోగించుటయే కదా ఉచితము.
ఆ విధముగా కలహయుగమైన , కలియుగము ప్రారంభమైన 5000 సంవత్సరముల తరువాత , మానవ మనుగడలో నీతి , నిజాయితీలకు భంగము వాటిల్లు తరుణమున , ధర్మపరిపాలకుడు ,
పిలచినంతనే పలుకు ప్రత్యక్షదైవమైన శాస్తా , లోకములోని ప్రజల మేలు కోరి తన ఉనికిని
తెలియజేయుచున్నాడు.
నేటి ఆధునిక యుగములో , శాస్తా యొక్క పూజా విధానము శక్తివంతముగా వ్యాపించి , ఆ దేవుని ఆదేశానుసారము , ఆజ్ఞానుసారము అయ్యప్ప స్వామి యొక్క భక్తి ప్రపత్తులు సమీప
కాలములో ప్రపంచమంతటా ప్రభంజనముగా వ్యాపించుచున్నవి.
*(పూర్వభాగము సమాప్తము)*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*