శ్రీ మహాశాస్తా చరితము - 31 మహాకేతు వధ

P Madhav Kumar

*మహాకేతు వధ*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


*మహాకేతువు యొక్క దుష్ప్రవర్తన*

ఒకానొక సమయమున అసుర కులమున జనించిన *'మహాకేతు'* అను రాక్షసుడు , హిమవత్ పర్వతపు తూర్పు సరిహద్దును పరిపాలించుచుండెను. జన్మతః సురవైరి అయిన అతడు సందర్భము
దొరికినప్పుడల్లా దేవతలతో పోరు సలుపుచుండెడివాడు.

ఒకనాడు మహాకేతువునకు ఒక ఆలోచన జనియించినది. దేవతలకు , దైవమునకూ ఉన్నతి చేకూర్చునవి వేదమంత్రములు , యాగములు కదా. వాటిని కాపాడువారు బ్రాహ్మణులు కదా. బ్రాహ్మణ కులమును నశింపజేసినచో దేవతలూ , దైవమూ తమ గొప్పదనమును కోల్పోవుదురు.
తమ శక్తులను కూడా కోల్పోవుదురు అని తలంచెను.

ఇటువంటి దుష్ట ఆలోచన కలిగిన క్షణము నుండియే తన రాజ్యమునకు లోబడియుండు
బ్రాహ్మణులను చెరబట్టి , బాధించసాగెను. తప్పించుకున్న కొందరు తమ ఉనికి తెలియని విధముగా రహస్య ప్రదేశములందు జీవనము సాగించసాగిరి.

బ్రాహ్మణులు చేయు వేద యజ్ఞములకు అధిదేవత మహాశాస్తావే కదా ! తమ్ము కాపాడమని , తమ కాపాలికుడైన శాస్త్రాని ప్రతిదినమూ ప్రార్థించుచుండిరి.

హిమవత్ పర్వతపు ఛాయలతో దైవానుగ్రహము , ప్రకృతి రమణీయము మేళవించు విధముగా నుండు *'మహాదేవ పట్నము'* అను నగరమును *'సోమపాలుడు'* అను రాజు పాలించుచుండెను.
అతడు కీర్తిమంతుడు , నిజాయితీపరుడు , దైవభక్తిపరుడు , తర్కశాస్త్రము నందు నిపుణుడు. అతడి
భార్య కూడా గుణశీలియై ప్రవర్తించుచుండెను. ప్రజలకు ఎటువంటి కష్టమూ కలుగనీయక ఏ లోటు లేకుండా అతడు పరిపాలించుచుండెను. రాజు దంపతులకు ఉన్న లోటల్లా సంతానము లేకపోవడమే.

ఒకనాడు సోమపాలుడు తమ దేశపు తూర్పు సరిహద్దున ఉన్న అడవికి వేటకై వెళ్లెను. దారిలో
ఒక అడవి ఏటి ప్రవాహము , అందు నడుమగా నిల్చునియున్న ఒక పులిని చూసెను. పులిని చంపుటకై నడువసాగెను. ఏటిలో కాలు పెట్టినంతనే ఒక్కపెట్టున నీటి ప్రవాహము ఉధృతమై ,
ప్రవాహమున దిక్కుతెలియని విధముగా మహారాజు కొట్టుకొనిపోసాగెను. నీటి ప్రవాహమునకు ఎదురొడ్డి పోరాడిన ఎంతో సమయము తరువాత ఒడ్డుకు చేరగలిగెను. అది ఏ ప్రదేశమో
తెలియరానిదయ్యెను. తన నగరుకు ఎటుల పోవలెనో తెలియనిదాయెను. అంతలో అచట కొందరు
విప్రబాలురు ఆటలాడుట చూచెను.

వారికి నమస్కరించి తనకు దారిచూపుమని కోరుతూ , వారి వెంటే వెళ్ళి బ్రాహ్మణులు నివసించు కుటీరముల చెంతకు పోయెను. *'విప్ర నందనుడు'* అను విప్రుడు , వచ్చిన వ్యక్తి రాజవంశీయుడని
గ్రహించి , అతడిని ఆహ్వానించి పలువిధములు ఉపచరించెను.

మాటల మధ్యలో మహాకేతువు యొక్క ఆగడములు , అతడికి భయపడి పలువురు విప్రులు రహస్య జీవనము చేయుటయూ తెల్పెను. వారికి సమీపమున ఆడుకొనుచున్న విప్రనందనుని రెండేళ్ళ బాలుని చూచిన మహారాజునకు ఎంతయో సంతోషము కలిగెను. సకల లక్షణ శోభితుడైన
ఆ బాలునియందు మహారాజునకు మమకారము జనియించినది. సంతానము లేని తనకు ఆ బాలుని పోషణా భారము నిమ్మని వేడుకొనెను. తన స్వంత బిడ్డవలె పెంచి , సకల విద్యలు నేర్పించి ,
తనకు పిమ్మట రాజ్యమును ఇచ్చెదననియూ తెలిపెను.

ముందు సంశయించిననూ , పిమ్మట బ్రాహ్మణుడు , అతడి భార్యయూ అంగీకరించిరి. తమకు
ఇంతకుముందే ఇరువురు సంతానము కలిగియున్నందువలననూ , రహస్య జీవనము చేయు తమకు
ఈ బిడ్డ అయినను క్షేమముగా బ్రతుకునను ఆశవలననూ ఆ బిడ్డను మహారాజునకు అప్పగించిరి.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat