శ్రీ మహాశాస్తా చరితము - 34 చోళ రాజకుమారుడు * సోదరీమణుల ధృడభక్తి*

*చోళ రాజకుమారుడు*

*సోదరీమణుల ధృడభక్తి*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*

వనరులనన్నిటినీ పుష్కలంగా కలిగి , శోభాయమానంగా , కీర్తి ప్రతిష్టలతో వర్ణివిరాజిల్లుచుండెడిది
సింధు దేశము. ఒకానొక సమయమున ఆ దేశమును శుభకీర్తి అను రాజు పరిపాలించుచుండెడివాడు.
అతడికి సుతీక్షణ అను అనుకూలవతి అయిన భార్య ఉండినది. వారిరువురికి సుందరాంగదుడు అను కుమారుడు జన్మించెను. తరువాత రాజదంపతుల పుణ్యఫలముగా వారికి ఇరువురు కుమార్తెలు
జన్మించిరి. అందచందాలలో లక్ష్మీ , పార్వతులను తలపించు విధముగా ఉండెడివారు. వారి పేర్లు మదన - వర్ణిని. వారు అతి గారాబముగా పెరుగసాగిరి.

బాల్యము నుండియే రాకుమార్తెలు ఇరువురూ , తమ ఆలనా పాలనా గమనించు దాది ద్వారా
అఖిలలోక పాలకుడైన శ్రీ మహాశాస్తా యెక్క అద్భుతలీలను వింటూ పెరిగిన కారణముగా
స్వామియందు అమితమైన భక్తిని కలిగియుండిరి. వారి మదిలో దాది ద్వారా నాటబడిన విత్తనము
పెరిగి పెద్దదై , మహా వృక్షమై స్వామి యెక్క భక్తి తత్వము వారిని ఆవరించి యుండినది. సదా సర్వకాలము వారికి స్వామి ఆరాధన తప్ప వేరొకటి లేక యుండినది. ఆ ఆరాధన ఎంత వరకు
వచ్చినదంటే యుక్త వయస్సు వచ్చిన తరువాత స్వామిని తప్ప పరులను ఎవరినీ పరిణయమాడు
ఇచ్ఛ లేనంతవరకూ , సర్వలక్షణ సంపన్నుడైన స్వామిని వివాహమాడుటయే తమ లక్ష్యముగా భావించసాగిరి.

ఇలా ఉండగా , అందచందాలతో పాటు గుణాతిశయము నందునూ శోభిల్లు తన కుమార్తెలకు యుక్త వయస్సు వచ్చినదని గ్రహించిన మహారాజు వారికి తగిన వరులను నిశ్చయింపనెంచెను. తన
కొలువులో ఉన్న జగజ్జట్టీలైన ఇరువురు మల్లయోధులను , ఎవరైతే ఓడించునో వారికే తన కుమార్తెలను ఇచ్చి పరిణయము చేయనెంచి , ఆ వార్తను దేశ దేశ రాజులకు వార్త పంపెను.

తమ మనస్సులోని భావమును గ్రహించక , తమ తండ్రి చేసిన ఈ వివాహ ప్రయత్నము
రాకుమార్తెలకు బాధ కలిగించినది. ఈశ్వర పుత్రుని తప్ప వేరొకరిని వరించుట , వారికి రుచింపక , మనస్సులోని మాటను తండ్రికి తెలియజేసిరి.

కానీ మహారాజు దీనిని అంగీకరించక పోయెను. *"ప్రియ పుత్రికలారా ! భగవంతుని యందు మీకు గల భక్తి మెచ్చదగినదే. కానీ భూలోక వాసులైన మనము ఆ స్వామిని ఆరాధించుటకు మాత్రమే తగినవారము. ఆ స్వామిని వివాహమాడుట అనునది సాధ్యపడు విషయము కాదు. ఈ విషయము లోకులకు తెలిసినచో మనము నవ్వులపాలు అగుదుము. ఈ విషయము మరచిపోయి , మల్లయోధులను ఓడించు వరులను చేపట్టుటకు తయారుగా ఉందురుగాక"* అని ఆజ్ఞాపించి వెడలిపోయెను.

తండ్రి మాటలకు మిగుల వ్యధ చెందిన రాకుమార్తెలు ఏమి చేయుటకూ పాలుబోక , స్వామి పాదములు తప్ప తమకు వేరు శరణాగతి లేదని యెంచి , స్వామిని పరి పరి విధముల తమ్ము
చేపట్టుమని ప్రార్థించిరి.

మదన , వర్ణిని ఇరువురి భక్తిని ముందే తెలిసియున్న స్వామి , ఇక జాగు చేయుట ఉచితము కాదని ఎంచి , తేజోమండల స్వరూపముతో వారికి స్వప్నమునందు సాక్షాత్కరించెను.

*“రాకుమార్తెలారా ! మీ భక్తికి ఎంతగానో మెచ్చితిని. ఇకపై మీరు వ్యధ చెందరాదు. నేనొక రాజకుమారునివలె వచ్చి యుద్ధమున మల్ల యోధులను ఓడించి , మిమ్ములను పరిణయమాడుదును. మీరు నిశ్చింతగా యుందురుగాక”* అని పలికెను.

కనులు తెరచిన రాకుమార్తెలు , తమకు స్వప్నమున కనిపించిన స్వామి యొక్క రూపమును మరల మరల తలచుకుంటూ , స్వామిని పరిపరి విధముల స్తుతించిరి.




*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!