శ్రీ మహాశాస్తా చరితం - 11 తారుకావనమున సుందరి , సుందరాంగులు

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*తారుకావనమున సుందరి , సుందరాంగులు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


భూలోకమున *'తారుకావసము'* అను ప్రదేశము మిక్కిలి ప్రసిద్ధి గాంచినది . అందుగల మునులు , తపమాచరించుటలో తమ్ము మించినవారు లేరను అహంకార భావము కలిగి యుండిరి. వారి భార్యలు భర్తలకు ఏ మాత్రమే తీసిపోని విధముగా , తమను మించిన శీలవంతులు లేరను భ్రమలో తేలుచుండిరి.

మన యొక్క కర్మానుసారముగానే ఫలితము కలుగనేగాని , అందులకు గాను భగవంతుడు అంటూ ఒకరు అవతరించవలసిన అవసరము లేదు. దైవము యొక్క ఆవశ్యకత లేనేలేదు అంటూ ,
పరమశివునిగాని , పరంధామునిగానీ పూజించు ఇచ్చలేక , అహంకారపూరితులైయుండిరి. కర్మఫలమునకు
తగినట్లుగానే మంచి చెడులను తగురీతిలో ఇచ్చువాడు దైవము తప్ప వేరే ఎవరు ? నాయకుడు లేని సైన్యము ఉండునా ? ఉచితానుచితములు మరచిన మునిపుంగవులకు , వారి భార్యలకు జ్ఞానోదయము
చేయనెంచిన పరమేశ్వరుడు అందులకు గానూ , మోహిని వేష ధారియైన విష్ణుమూర్తి సహాయమర్ధించెను.

వారిరువురూ దారుకావనమును ప్రవేశించిరి. మోహిని రూపధారి యైన విష్ణువు తపోవనమున నున్న మునుల సమీపమునకు బోయివారి దృష్టిని ఆకర్షించు నిమిత్తమై ఏదో పని యున్నట్లుగా అటూ ఇటూ నడయాడసాగెను. అనుకున్నట్లుగానే మునివర్యులు ఆ సుందరాంగి సోయగమునకు అచ్చెరు వొంది ఆకర్షితులైనారు. వారి గర్వమునకు కారణమైన యజ్ఞయాగాదులనే మరచినవారైరి. తాము ఉచ్చరించు మంత్రశబ్దములు ఏ గతినున్నవో కూడా ఆలోచించనైరి. కర్మకాండలు గాలిలో
కలిసిపోయిననూ పోనిమ్మను అలక్ష్యవైఖరిలో యుండి , మోహినితోటితే లోకమను భ్రాంతిలో యుండిరి.

ఇది ఇట్లుండగా , భిక్షువేషధారి అయిన సుందరాంగుడు , ముని పుంగవుల నివాస ప్రాంతములకు పోయి , చేతిలోని వీణను మీటుచూ , దేవగానము చేయుచూ , ఇంటింటికీ బోయి భిక్ష అడుగసాగెను.
అతడి అందచందములు చూచిన ఋషిపత్నులు రెప్పవేయుట కూడా మరచిపోయిన విధముగా
అతడి పట్ల ఆకర్షితులైనారు. తమ ఇళ్లు , వాకిళ్ళు మరచి , మోహావేశులై తమ దుస్తులు , అభరణములు స్థానభ్రంశము చెందుటను కూడా గమనించుకొను స్పృహలేనివారై , ఉన్మత్తులై భిక్షువు
వెంటబడిరి.

మోహపరవశులై , మోహిని పట్ల ఆకర్షితులైయున్న ముని పుంగవులు శీలవంతులైన తమ భార్యలు ఒక మదనుని వెంట పోవుట చూచి కోపోద్రేకులైరి. తమ తపములకు , తమ భార్యల యొక్క శీలములకు భంగము వాటిల్లినది భిక్షువనియూ , అతడి కుట్రలోని భాగమే తమ్ము మోహపూరితులను
చూసిన సుందరియూ అను నిజమును గ్రహించిరి.

భిక్షువునకు బుద్ధి చెప్పనెంచిన , ఋషులు అభిచారహోమమును ప్రారంభించి , అందు భయంకర విషవృక్షములను సమిధలుగానూ , వేపచెట్టు యొక్క నేతిని ఆహుతి చేసిరి. హోమము ద్వారా లభించిన విషమయమైన వస్తువులతో ఆయుధములు తయారుచేసి శివునిపై ప్రయోగించిరి. ముందుగా ప్రయోగింపబడినది క్రూరమృగమైన పులి. తనపై లంఘించబోవు పులిని అతిలాఘవముగా
చంపి , ఆ చర్మమును తన వస్త్రముగా మార్చుకొనెను. వారు ప్రయోగించిన ఈటెలను తన ఆయుధములుగా చేసికొనెను.

ఋషులు భయంకర విషమును కక్కు విషసర్పములను ప్రయోగించగా , ఆ సర్పములను చేతబట్టి తనకు ఆభరణములుగా ధరించినవాడయ్యెను. ఆపస్మార వ్యాధిని మానవరూపుగావించి ,
శివునిపై ప్రయోగించగా అతడిని మట్టు పెట్టి తన కాళ్ళ కింద పడియుండు నటుల చేసెను. ఢమరుకమును చేత ధరించెను.

తమ అస్త్రములన్నియూ అతడి ముందు నిష్పలములగుట చూచిన ఋషులు , జ్ఞానోదయము
కలిగి , కర్మఫలితముగానే తమకు ఇట్టి దుస్థితి కలిగినదను సంగతి గ్రహించి , దాన్ని మించినది దైవము యొక్క అనుగ్రహము అను నిజమును గ్రహించిరి. ప్రాయశ్చిత్తవదనులై యున్న ముని
పుంగవులను అనుగ్రహించు నిమిత్తమై , తనపై ప్రయోగింపబడిన ఆయుధములను - అభరణములు గానూ , వస్త్రములుగానూ ధరించిన నటరాజస్వామిగా వారికి సాక్షాత్కరించెను.

ఆ స్వామి యొక్క దర్శన భాగ్యము చేత పునీతులైన ఋషిపుంగవులు *“కైలాసా వాసా !  ఆది అంతము లేని జ్యోతి స్వరూపుడవైన నిన్ను తెలిసికొన లేక చేసిన మా తప్పులను క్షమించి , మమ్ము ఆశీర్వదించుమని”* ప్రార్థించిరి. బదులుగా పరమశివుడు *“ఋషిపుంగవులారా !దైవము కన్నా కర్మయే మిన్నయను అహంకారముగల మీకు , సత్యము బోధపడుటకై మేము ఆడినదే ఈ నాటకము. మీ మీ  తప్పులను క్షమించితిమి. ధర్మము తప్పక , ఇక మీ తనస్సులను ఆచరింపుమని”* సెలవిచ్చెను.

ఈశ్వరుని అనుసరించిన మోహినిరూపధారి అయిన విష్ణుమూర్తి , పరమశివుని చూచి శీలవంతులైన మునిపత్నులు సైతము మోహించిన , భిక్షరూపమును చూడ ప్రార్థించెను. శివుని యొక్క సుందర భిక్షురూపమును చూచిన విష్ణువు ఆమె పట్ల ఆకర్షితుడై *“పరమేశ్వరా ! మీ యొక్క సుందరరూపము ,  మోహిని రూపు దాల్చిన నాకు సైతము మోహము కలుగజేయుచున్నది. శివశక్తిలోని ఒక స్వరూపమే నేను. మీరు హరుడైనచో , నేను హరిని”* అనగా

హరిహర సంగమ ఫలితముగా , లోకమును ఉద్ధరించుటకై , స్వయంగా పరబ్రహ్మస్వరూపమే
ఒక ఉత్తమునిగా అవతారము తాల్చబోవుచున్నదని గ్రహించినవాడైన పరమశివుడు మోహిని యొక్క తాపము తీర్చెను. ఇట్లు హరి హర సంగమ ఫలితముగా , లోకోద్ధరణకుగానూ , శాస్తా అవతారము
దాల్చెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat