🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శాస్తా , అయ్యప్ప , వావర్ వీరి యొక్క ప్రస్తావన*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ABADPS)*
మన యొక్క వేద , పురాణశాస్త్రములు అనునవి కడలి వంటివి. ఈ ప్రాధమిక సూత్రము
తెలియని కొందరు *'అయ్యప్ప'* అను పేరుగల దైవము లేదు అందురు. ఒక విషయం గమనార్హము.
అయ్యప్ప పేరు మాత్రమే కాదు మురుగన్ , భైరవన్ , తిరుమాల్ , ఈశన్ అను పేర్లు మనకి
ఎక్కడనూ కానరావు. కారణము ఇవన్నియూ తమిళభాషలోని పేర్లు. సంస్కృత గ్రంధముల యందు ఈ పేర్లు కానరావు. అయిననూ శాస్తా చరితము , పూజా విధానము మనకి కొత్త కాదు.
కడలి వంటి మన పురాణ ఇతిహాసములలో ఈ ప్రస్తావన కలదా , లేదా అని తీర్మానించుట
సామాన్య మానవులకు సాధ్యము కాదు. మనకి వాడుకలో గల గ్రంధములలోని విషయములను మాత్రమే ఆచరించుటే , ఏ పురాణమునందునూ హరిహరసుతుని యొక్క ప్రస్తావన లేదనుట
సమంజసము కాదు. పలు పురాణ గ్రంధములలో పలుచోట్ల ఈ మూర్తి యొక్క అద్భుత ప్రస్తావనలు మనకి గోచరించుచున్నమాట వాస్తవము.
అయ్యప్ప చరితమున వినబడు *'వావర్‌స్వామి'* నామధేయుడైన ఇస్లాం మతస్థుని ప్రస్తావన
మనకి తెలిసినదే. దీన్ని ఆధారము చేసుకొని 1500 సం||ల చరిత్రగల ఇస్లాం మత కాలమునకు
చెందియుండవచ్చునని కొందరు భావించుదురు.
ముందుగా మనము *శాస్తావేరు , అయ్యప్పవేరు* అని తెలిసికొనవలయును. హరి హర పుత్రుడు
మహాశాస్తా. అతడు ధరించిన అనేక అవతారములలో ఒక్కటియే భువిపై అవతరించి , చరిత్ర
నాయకుడైన అయ్యప్ప. ఈ అయ్యప్ప శబ్దము పురాణ ఇతిహాసములయందు కానరాదు. రాముడు ,
కృష్ణుడు ఇరువురూ ఒకే శక్తి రూపములు అయినప్పటికీ , వేరు వేరు అవతారమూర్తులు కదా !
అటువంటిదే శాస్తా , అయ్యప్పల ప్రస్తావన కూడా. *“భూతనాధో పాఖ్యానము”* అను గ్రంధమున శాస్తా
యొక్క అవతారము అయిన ప్రశస్త్యము వివరముగా ఈయబడినవి. ఈ గ్రంధము *బ్రహ్మాండ పురాణమునకు* సంబంధించినది.
అయ్యప్పగా భూమిపై అవతరించిన సమయమున అతడు పెళ్ళికాని బ్రహ్మచారి. కానీ అవతార మూలమైన శాస్తా వివాహితుడు. పలు చోట్ల అతడు *'ప్రభ'* అను భార్యతోనూ , *'సత్యకుడు'* అను
పుత్రునితో దర్శనమీయువాడు. మరికొన్ని చోట్ల పూర్ణా , పుష్కలా సమేతుడై కనిపించును. వావర్
అను ఇస్లాం మతస్థుడు ఇతడి మిత్రుడైనట్లుగా శబరిమల చరితమైన *'శ్రీ భూతనాధోపాఖ్యానము'* లో చెప్పబడలేదు.
అయ్యప్ప యొక్క భూత పరివారమైన
వావరుడు ,
కటుశబ్దుడు , వీరభద్రుడు , కూపనేత్రుడు ,
కూపకర్ణుడు , కండాకర్ణుడు ,
మహాబలి అను ఏడుగురిలోనూ వావరుడు అను నామమే మొదటిగా
చెప్పబడినది. *వావరుడు అను వ్యక్తి అయ్యప్ప సేవకునిగానే తప్ప , మిత్రునిగా ఎక్కడునూ ప్రస్తావించబడలేదు.*
*('భూతనాధోపాఖ్యానము' గ్రంధకాలము గురించిన వివాదములు కనిపించిననూ , అందులో వావర్ అను ఇస్లాం మతస్థుడైన మిత్రుని ప్రసక్తి లేదనునునది మాత్రము నిజము)*
*ఆ తరువాత చాలాకాలము తరువాతనే శబరిగిరి ఆలయమునకు సంబంధించి అయ్యప్ప యొక్క అవతార సమయమున వావర్ ప్రసక్తి రావడము జరిగినది.*
పురాణ కాలమునకు , చారిత్ర కాలమునకు మధ్య చాలా వ్యవధి కనిపించుచున్నది. *'మహిషి'* అనబడు రాక్షసిని చంపుట కొరకై శాస్తా చేసిన సంహార సందర్భముగా ఏర్పడినదే శబరిగిరి ఆలయము.
నేటి ఆధునిక కాలములో మనము వినేటటువంటి అయ్యప్ప పాటలను అవలోకించినచో అందు
*'వావర్'* అను మిత్రునితో స్నేహము చేయుచూ *'ఉదయనుడు'* అను కిరాతకుని చంపిన వ్యక్తిగా
మాత్రమే అయ్యప్ప కనిపించును. *తమిళ గ్రామ సంప్రదాయమున చెప్పబడు అయ్యనార్ అవతారంగా రూపుదాల్చి , అతడి పేరును తనదిగా మార్చుకున్న అయ్యప్ప , కాలక్రమేణా శిధిలావస్థలోనున్న శబరిమలను పునరుద్ధరించి , ఆ స్థలమున ప్రతిష్ఠ చేయబడిన విగ్రహములో ఐక్యమగుటను ఋజువుగా భావించవలసి వస్తుంది.*
పురాతనముగా నున్న *'శబరిమల'* ఆలయ స్థలమును దోపిడీ దారులు కొందరు ఆక్రమించుకొనగా ,
ప్రతి సంవత్సరమూ కొండపై నున్న శబరిగిరిపై కొలువైయున్న హరిహర పుత్రుని పందళరాజు
సేవించునట్లు మాట ఇచ్చినచో , తాను శత్రువులను సంహరించి ఆలయమును సంక్రమింప
జేయుడనని , స్వయముగా అయ్యప్పయే చెప్పినట్లుగా అయ్యప్ప పాటల వలన తెలియుచున్నది.
*"కాలానుగుణముగా వచ్చు మకర సంక్రమణ కాలమున పందళరాజు తన బలమును కూడగట్టుకుని , కొండనెక్కి నడచివచ్చి శబరిగిరి నాధుని పూజింతునని”*
*సత్యప్రమాణము చేసిన శత్రువులను సంహరింతును”* ఇలా ప్రాచీన కాలపు పాటలు , వ్రత విధానములయందునూ సత్యము గోచరించుచునేయున్నది. ఇది కధావిధానము తెలిపిన గురుస్వాముల
యొక్క తప్పిదమో , విన్నవారి యొక్క తప్పిదమో తెలియదుగానీ , శాస్తా యొక్క అవతారమైన అయ్యప్ప , శాస్తా ఒక్కరే నన్న ఒరవడి అలవడిన మాట మాత్రము నిజము. అటులనే ఇస్లాం
మతస్థుడైన వావర్ , భూతగణాధిపతి అయిన *'వావరుడు'* ఒక్కరే నని భావించుటయూ జరిగియుండును
నేటి కేరళ ప్రాంతము ఆనాటి పరశురాముని భూమి. రామాయణములోని పలు సంఘటనలు జరిగిన స్థలం అది. పరశురామునిచే ప్రతిష్ఠింపబడిన వాటిలో ఒకటి ఈ శబరిగిరి ఆలయంగా
భావించవలసివస్తుంది. దీన్ని బట్టి చూచినచో పురాణకాలము నుండియే శబరిగిరిలో శాస్తా
కొలువైయున్న విషయము నిరూపణ అవుచున్నది.