🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శాస్త్రు లోక నిర్మాణం*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
ఒక కల్పమున ఆవిర్భవించిన శ్రీమహాశాస్తా , దేవతలకే దేవతగా విరాజిల్లు పరబ్రహ్మ తత్వములో ,
తనకంటూ ప్రత్యేకించియున్న శాస్త్రులోకమున రాజరాజేశ్వరునిగా కొలువైయుండెను. అయిననూ అచ్చటివారికి కూడా అందనివాడై యుండెను.
కాబట్టి బ్రహ్మ , ఇంద్రుడు మొదలగు దేవతలందరూ తన ప్రియ పుత్రుని దర్శించి , పూజించు
నిమిత్తము , పరమేశ్వరుడు దేవశిల్పియైన విశ్వకర్మను పిలిపించి , తన పుత్రుడు నివసించుటకై ప్రత్యేక లోకమును సృష్టించమని చెప్పెను. కోరెను. శివుని ఆదేశానుసారము విశ్వకర్మ కైలాస పర్వత శ్రేణియందు ఉత్తమమైన ఒక స్థలమున అద్భుతముగా ఒక పట్టణమును నిర్మించెను.
లోకనాయకి అయిన ఆదిశక్తి పరిపాలించు స్థలము , కోరిన వరములనిచ్చు కల్పవృక్షము , అందమైన పూతోటలు , అందు మధురమైన ఆలాపనలతో విందు చేయు పక్షులు , వాటి చుట్టూ నదులు , ఆ నదులలో ప్రతిఫలించు రత్న , వైఢూర్యమణులు , సువాసనలు వెదజల్లు పుష్పములు , నవరత్న ఖచితమైన భవనములు ఇలా వర్ణించనలవి కానటువంటి అందచందములతో ఆ స్థలము వెల్లివెరిసినది. ద్వాదశ సూర్యులవంటి వారికే కనులు మిరుమిట్లు గొలుపునట్లుగా ఆ స్థలము భాసిల్లినది.
నవరత్న ఖచిత స్వర్ణ సింహాసనముపై స్వామిని కూర్చుండబెట్టి పరమేశ్వరుడు పట్టాభిషేకము చేసెను.
ఇంద్రాది ముప్పది ముక్కోటి దేవతలు , ఋషులు , మునివర్యులు , అఖిల లోకగణములు ,
గణపతి , స్కందుడు , గాయత్రి , సావిత్రి , సరస్వతీ సమేతుడై వచ్చిన బ్రహ్మ , భూదేవి , శ్రీదేవీ సమేతుడైన విష్ణుమూర్తి , ఇలా వీరంతా శాస్తాని పలువిధములుగా దీవించిరి.
సకల లోకములకు స్వామియే అధిపతియనునట్లుగా , పరమశివుడు నీతి తప్పని దండాయుధమును
కానుకగా ఇచ్చెను.
స్తోత్రరూపము రూపుదాల్చిన ఋగ్వేదము దేవోత్తముడైన స్వామిని పలువిధములైన వేద ఘోషలతో స్తుతించెను. స్తోత్రములకు ఆకృతినిచ్చు యజుర్వేదం వేదనారాయణుడైన స్వామిని పలు యజ్ఞ
రూపములుగా ఆరాధించినవి. నామసంకీర్తనా ప్రియుడైన స్వామిని సంతోషపరచు విధముగా సామవేదము గానం చేసినది. సకల దేవతా స్వరూపుడైన భూతనాధుని మంత్రశాస్త్ర రీతిలో అధర్వణ
వేదం ఉపాసించినది.
వేదనాయకుడైన స్వామిని మనసారా స్తుతించిన చతుర్వేదములు పరమేశ్వరుని ఒక కోరిక
కోరినవి. అదేమనగా స్వామిని యొక్క భారమును మోయు అవకాశము నిమ్మని అడుగగా పరమశివుడు అటులనేయని ఆనతిచ్చెను.
చతుర్వేదములు ఒక బ్రహ్మాండమైన ఏనుగు రూపుని ధరించినవి. గంభీరమైన ఆకృతి , ధవళ వర్ణపు కాంతిలో మెరిసిపోవు ఛాయ , ప్రకాశించు నాలుగు దంతములు కలిగి ఘీంకార నాదము
సలుపు ఐరావతమును బోలు గజముపై స్వామి ఆరోహణము చేసెను.
ఇటుల ముల్లోకములయందు పలుచోట్ల , పలు తెరగుల లీలా వినోదములను సలుపుచూ , అందరి యొక్క ప్రశంసలు , దీవెనలను అందుకొంటూ శాస్తా అనేక క్షేత్రముయందు కోవెలలో
కొలువైయుండెను.
తరువాత సిద్ధ , నాగ , ఆకాశ , గంధర్వ , కిన్నెర , కింపురుష , భోగభూమియు , వింజెయ , పిశాచ , తారక , సుర , అసుర , భూత , ముని , దేవ , గరుడ , రాక్షస , చారణ , యక్షులు ఇలా పదునెనిమిది గణములచే నుతింపబడుచూ తనదైన శాస్త్రులోకమున అఖిలాండ నాయకునిగా పరిపాలన చేయుచుండెను.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*